Modi vs Priyanka: సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు విపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ, ‘పార్లమెంట్‌లో నాటకాలు వొద్దు, ఫలితాలు చూపించడం కావాలి’’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చురకలు అంటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) స్పందించి, ప్రధాని మోదీకి (Modi vs Priyanka) గట్టి జవాబు ఇచ్చారు. ప్రజా సమస్యల గురించి సభలో మాట్లాడటం, వాటిని లేవనెత్తడం నాటకం కాదని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలకు అవకాశం ఇవ్వకపోవడమే అసలైన నాటకమని ప్రియాంక గాంధీ ఘాటుగా బదులిచ్చారు.
ఓటర్ల జాబితాలకు సంబంధించిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR), ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం వంటి కీలక అంశాలను లేవనెత్తడం నాటకం కాదని కౌంటర్లు ఇచ్చారు. ఓటర్ల జాబితా సవరణ, కాలుష్యం వంటివి చాలా పెద్ద సమస్యలని, వాటి గురించి చర్చించాలని ఆమె డిమాండ్ చశారు. చర్చించడానికి కాకపోతే పార్లమెంట్ ఇంకెందుకు?, ఇది ఎలా నాటకం అవుతుంది? అని ఆమె ప్రశ్నించారు. విపక్షాల గందరగోళం మధ్య లోక్‌సభ కొద్దిసేపు వాయిదా పడిన అనంతరం, పార్లమెంట్ ప్రాంగణంలో మాట్లాడుతూ ప్రియాంక గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
మోదీ ఏమన్నారంటే?
పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు, ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ బద్ధంగా ప్రసంగించారు. తన ప్రసంగంలో ప్రతిపక్ష పార్టీలను, నాయకులను టార్గెట్ చేశారు. సమావేశాలను డ్రామాలకు వేదికగా మార్చవద్దని, ఫలితాలు చూపించడానికి ఉపయోగించాలని అన్నారు. బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో చిట్కాలు కూడా ఇవ్వగలనని చురకలు అంటించారు. విపక్ష పార్టీల ఎంపీలు తమ వ్యూహాన్ని మార్చుకోవాలని అన్నారు. గత పదేళ్లుగా ప్రతిపక్షం ఆడుతున్న ఆటలను ప్రజలు ఇకపై అంగీకరించబోరని, అందుకే తమ వ్యూహాన్ని మార్చుకోవాలని విపక్షాలకు సూచించారు. ఎవరైనా నాటకాలు చేయాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ, ఇక్కడ నాటకాలు కాదు, ఫలితాలు ఉండాలని అన్నారు. నినాదాలు చేయడం కాకుండా, పాలసీలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
Read Also- Job Scam: విదేశీ ఉద్యోగం అని గంతేస్తున్నారా? నకిలీ జాబ్ మోసాలు వెలుగులోకి!
తొలిసారి ఎంపీలుగా ఎన్నికైన వారు తమ నియోజకవర్గాల్లోని సమస్యలపై మాట్లాడే అవకాశం లభించక నిరాశకు గురవుతున్నారని, పార్టీలతో సంబంధం లేకుండా, కొత్త ఎంపీలకు కూడా అవకాశం కల్పించాలని మోదీ అన్నారు. ఈ విషయాన్ని అంతా సీరియస్‌గా తీసుకోవాలని, నాటకాలు చేయడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయని, కానీ, పార్లమెంట్‌లో అలాంటివి వొద్దని విమర్శనాస్త్రాలు సంధించారు.
శీతకాల సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ శీతాకాల సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే, ఓటర్ల జాబితా సవరణ, ఢిల్లీ కాలుష్యంతో పాటు పలు సమస్యలపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో, కొద్దిసేపు తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఎంతసేపటికీ సద్దుమణగకపోవడంతో, సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. 2 గంటల తర్వాత సమావేశాలు పున:ప్రారంభమయ్యాయి.
