Rajnath Singh: భారత ఆర్థిక వ్యవస్థ నిష్క్రియాత్మకమంటూ (Dead Economy) భారీ టారీఫ్‌లు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ (Rajnath Singh) ఆదివారం స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. అంతర్జాతీయ శక్తిగా భారత్ ఎదుగుదలను అమెరికా పాలనా యంత్రాంగం స్వాగతించదని ఆయన విమర్శించారు. భారత ఎదుగుదలను ‘పెద్దన్న’ అడ్డుకుంటోందని అమెరికాకు ఆయన చురకలు అంటించారు.
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుండటాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, అస్సలు ఇష్టపడడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అందరికీ బాస్ మేమేనని చెప్పుకుంటున్నారు. భారత్ ఇంత వేగంగా ఎలా ఎదుగుతోందని ఆశ్చర్యపడుతున్నారు. ‘‘భారత్‌లో తయారవుతున్న ఉత్పత్తులు, ఇతర దేశాల ఉత్పత్తులకంటే ఖరీదైనవిగా మార్చాలన్న లక్ష్యంతో చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా చేసి భారత్‌లో తయారైన వస్తువుల ధరలు పెరిగితే, ప్రపంచం వాటిని కొనకుండా మానేస్తుందని భావిస్తున్నారు. కానీ, భారత్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా ఎదగనివ్వకుండా ఇప్పుడు ఎవరూ అడ్డుకోలేరు’’ అని రాజనాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణాన్ని చూపుతూ భారత దిగుమతులపై టారిఫ్‌లను ఏకంగా 50 శాతానికి పెంచుతూ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also- Crematorium reel: వైరల్ అవ్వడం కోసం దిగజారిన యువతి..
ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత రక్షణ ఎగుమతులు ప్రభావితం కాబోవని, నిరంతరం పెరుగుతున్నాయని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రక్షణ రంగంలో భారత్ ఏడాదికి రూ.24 వేల కోట్ల విలువైన రక్షణ సామగ్రిని ఎగుమతి చేస్తోందని, సరికొత్త భారత దేశ బలాన్ని ఎగుమతులు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. సరికొత్త ఇండియాలో కొత్త రక్షణ రంగం ఆవిర్భవించిందని, ఎగుమతులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయని రాజనాథ్ వివరించారు.
భారత్‌పై ట్రంప్ అక్కసు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. టారిఫ్‌లకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలపై అమెరికా చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం వినకపోవడాన్ని ఆయన రుచించుకోలేకపోతున్నారు. రష్యా నుంచి ముడిచమురును కొనుగోలు చేస్తూ, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఆర్థిక సహకారం అందిస్తున్నారంటూ నిందలు వేశారు. ఈ కారణాన్ని చూపి అమెరికాలో భారత్ దిగుమతులపై సుంకాలను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచుతూ ఇటీవలే ప్రకటన చేశారు. భారత్-రష్యా సంబంధాలపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు నిష్క్రియాత్మకం (Dead Economy) అని అభివర్ణించారు. భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని ట్రంప్ చెబుతుంటే, ఆయన సహచరులు కొందరు మాత్రం రష్యా యుద్ధానికి భారత్ నిధులు సమకూర్చుతోందని ఆరోపిస్తున్నారు. దీనిని బట్టి భారత ఆర్థిక వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ట్రంప్ విధించిన ఆంక్షలపై కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ట్రంప్ టారీఫ్‌లు అన్యాయమైనవని, అసంబద్ధమైనవని, అకారణమని అభివర్ణించింది. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని విదేశాంగ శాఖ ఒక ప్రకటన కూడా చేసింది.
Read Also- Viral Polyandry: ఒకే స్త్రీని పెళ్లి చేసుకోవడంపై తొలిసారి స్పందించిన అన్నదమ్ముళ్లు