VB-G RAM G: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకురావాలని యోచిస్తున్న విషయంపై తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ముందడుగు వేస్తున్న ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. లోక్‌సభ ప్రతిపక్ష నేత, హస్తం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పేరు మార్చడం మహాత్మా గాంధీ ఆదర్శాలను నేరుగా అవమానమించడమేనని వ్యాఖ్యానించారు. కొత్తగా వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్, లేదా VB-G RAM G) బిల్లు, 2025ను ప్రవేశపెట్టనుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం నాడు ఎక్స్ వేదికగా ఆయన సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రెండు విషయాలపై తీవ్రమైన అయిష్టత ఉందని, అవి మహాత్మా గాంధీ ఆలోచనలు, పేదల హక్కులు అని రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పించారు.
ఎంజీఎన్‌ఆర్ఈజీఎస్ పథకం మహాత్మా గాంధీ సూచించిన గ్రామ స్వరాజ్యానికి సజీవ రూపమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ పథకం కోట్లాది మంది గ్రామీణ భారతీయులకు జీవనాధారమని, కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఆర్థిక భద్రతా వలయంగా నిలిచిందని ఆయన ప్రస్తావించారు. ఇక, ఎన్డీయే ప్రభుత్వం ఒక క్రమపద్ధతిలో ఈ పథకాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రధాని మోదీని ఎప్పుడూ కలవరపెడుతూనే ఉందని వ్యాఖ్యానించారు. గత పదేళ్లుగా మోదీ ప్రభుత్ ఈ పథకాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తూనే ఉందని, ఇక పూర్తిగా తుడిచివేయాలని నిశ్చయించుకున్నారని విమర్శలు గుప్పించారు.
Read Also- VB G RAM G Bill: ఈ పేర్లు మార్చే పిచ్చేంటి?.. లోక్‌సభలో కేంద్రంపై ప్రియాంక గాంధీ ఫైర్
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాన్ని కేంద్రం నియంత్రణలోని సాధనంగా మార్చుకోవాలని చూస్తున్నారని, బడ్జెట్లు, నిబంధనల ద్వారా కేంద్రమే నిర్దేశిస్తుందని రాహుల్ గాంధీ అనుమానం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత కొత్త బిల్లు ప్రకారం రాష్ట్రాలు 40 శాతం నిధులను భరించాల్సి వస్తుందని అన్నారు. పథకానికి కేటాయించిన నిధులు అయిపోయిన తర్వాత, లేదా పంట కోత సీజన్‌లో గ్రామీణ కార్మికులకు నెలల తరబడి ఉపాధి నిరాకరిస్తారని ఆయన విమర్శలు సంధించారు. ఇదొక ప్రజా వ్యతిరేక బిల్లు అని, దీనికి వ్యతిరేకంగా రోడ్ల నుంచి పార్లమెంటు వరకు కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు.
భారీ నిరుద్యోగ పరిస్థితుల ద్వారా దేశ యువత భవిష్యత్తును నాశనం చేసిన తర్వాత, మోదీ ప్రభుత్వం ఇప్పుడు పేద గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని లక్ష్యంగా చేసుకుంటోందని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. కాగా, ఎన్‌ఆర్‌ఈజీఏను (NREGA) 2025లో నాటి యూపీఏ ప్రభుత్వం చట్టంగా రూపొందించింది. 2009 అక్టోబర్ 2న ఆ చట్టానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చింది. గ్రామీణ పేద కుటుంబాలకు ఏడాదికి 100 రోజుల ఉపాధిని ఒక హక్కుగా కల్పించింది. తాజాగా, మోదీ సర్కార్ ప్రతిపాదించిన వీబీ-జీ గ్రామ్ జీ బిల్లులో పని రోజుల సంఖ్యను 125 రోజులకు పెంచారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
Read Also- Akhanda 2 OTT: ‘అఖండ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా? ఇంత త్వరగానా!

