VB G RAM G Bill: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) పేరు మార్చివేసి, వీబీ-జీ రామ్-జీ (VB-G RAM G) పేరిట కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతుండడాన్ని కాంగ్రెస్ పార్టీ (Congress Party) తీవ్రంగా ఆక్షేపిస్తోంది. మంగళవారం (డిసెంబర్ 16) లోక్‌సభలో అధికార పక్షంపై కాంగ్రెస్ సభ్యులు భగ్గుమన్నారు. ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్రాలపై నియంత్రణను పెంచుకోవడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నంగా ఆమె అభివర్ణించారు. ఇదే సమయంలో రాష్ట్రాలపై బాధ్యతలు, నిధులను తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నమని ఆరోపించారు. పథకాలకు పేర్లు మార్చే పిచ్చి ఉందని కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ పిచ్చేమిటో తనకు అర్థం కావడం లేదని అన్నారు. వీబీ-బీ రామ్-బీ బిల్లు వస్తే, గతంలో ఎంజీఎన్‌ఆర్‌జీఎస్ కింద కల్పించిన హక్కులను ఈ బిల్లు బలహీనపరుస్తుందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. భారీ వ్యయంతో కూడిన అనవసరమైన మార్పులు చేయడం వెనుక హేతుబద్ధత ఏముందని కేంద్రాన్ని ప్రియాంక గాంధీ నిలదీశారు. ఈ పేర్లు మార్చాలనుకునే పిచ్చి ఏమిటో తనకు అర్థంకావడం లేదని, అనవసరంగా, ఇంత ఆదరాబాదరాగా ఎందుకు చేస్తున్నారో అర్థంకావడం లేదని మండిపడ్డారు.
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఏడాదికి 100 రోజుల ఉపాధిని హక్కు కల్పించిందని, కేంద్రం తీసుకొస్తున్న కొత్త బిల్లు చట్టంగా మారితే ఆ హక్కును బలహీనపరుస్తుందని ఆమె సందేహాన్ని వెలిబుచ్చారు. పనిదినాల సంఖ్యను పెంచినట్లు బయటకు అనిస్తోంది సరే, మరి వేతనాలను పెంచారా? అని కేంద్రాన్ని ప్రియాంక గాంధీ నిలదీశారు.
Read Also- West Bengal Voter’s: బెంగాల్‌లో రాజకీయ తుపాను.. ఓటర్ల జాబితాలో 58 లక్షల పేర్లు తొలగింపు
మహాత్మా గాంధీ మా కుటుంబ సభ్యులు కాదు
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం పేరు మార్పుపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రియాంక గాంధీ లోక్‌సభలో ప్రశ్నిస్తున్న సమయంలో, అధికార పక్షానికి చెందిన కొందరు సభ్యులు స్పందిస్తూ, ‘కుటుంబం’ అంటూ ఎద్దేవా చేసేందుకు యత్నించారు. అయితే, ప్రియాంక గాంధీ వెంటనే స్పందించారు. ‘‘మహాత్మా గాంధీ మా కుటుంబ సభ్యుడు కాదు. కానీ, మా ఫ్యామిలీ మెంబర్ లాంటివారే. మేమే కాదు, దేశం మొత్తం ఇలాగే భావిస్తుంది’’ అని ఆమె అన్నారు. ప్రతి పథకానికి పేరు మార్చే ఈ పిచ్చి ఏమిటి అని ఆమె ప్రశ్నించారు. చర్చలు, సంప్రదింపులు లేకుండా, సభల సలహాలు లేకుండా ఈ బిల్లు సభలో ఆమోదం పొందకూడదని ఆమె అన్నారు.
Read Also- Realme Narzo 90: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి వచ్చేసిన రియల్‌మీ నార్జో 90
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్ ఎంపీ శశి థరూర్ కూడా ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం పేరు మార్చు ప్రయత్నాన్ని విమర్శించారు. ఇదొక దురదృష్టకరమైన నిర్ణయమని థరూర్ అభివర్ణించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేదల పట్ల చాలా దూరదృష్టితో ఆలోచించి పెట్టిన పథకమని చెప్పారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ఎంజీఎన్ఆర్‌జీఏ స్థానంలో కొత్తగా ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఔర్ ఆజీవికా మిషన్ గ్రామీణ్’ (VB-G RAM G) బిల్లును తీసుకురావాలని భావిస్తోంది. ప్రతిపాదిత పథకం ప్రకారం, నిధుల విషయంలో కేంద్రం, రాష్ట్రాల వాటాలు 60:40 శాతంగా ఉన్నాయి. అయితే, పనిదినాల సంఖ్యను 125 రోజులకు పెంచారు.

