Alcohol Ban: పంజాబ్ ప్రభుత్వం శ్రీ ఆనంద్‌పూర్ సాహిబ్, తల్వండి సాబో, అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్ కారిడార్‌ను అధికారికంగా పవిత్ర నగరాలుగా ప్రకటించింది. ఈ ప్రకటనతో పాటుగా ఈ ప్రాంతాల్లో మద్యం, మాంసం, పొగాకు ఉత్పత్తుల విక్రయం పూర్తిగా నిషేధించబడింది. ఈ నిర్ణయం గురు తేగ్ బహదూర్ 350వ శహీద్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ ఆనంద్‌పూర్ సాహిబ్‌లో నిర్వహించిన పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తీసుకున్నారు.
పవిత్ర నగరాల అభివృద్ధికి ప్రత్యేక నిధి
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ, ఈ ప్రాంతాలకు పవిత్ర నగర హోదా ఇవ్వడం వల్ల సిక్ సంప్రదాయాల, మతపరమైన ప్రాముఖ్యతను కాపాడటానికి సహాయపడుతుందని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి పరిశుభ్రత, సంరక్షణ, అభివృద్ధి పనులను వేగంగా చేపట్టబడుతాయని సూచించారు. పంజాబ్‌లో మూడు సిక్ తక్తులు ఉండగా, వాటి పరిసర ప్రాంతాలను పవిత్ర నగరాలుగా గుర్తించడం చారిత్రాత్మక నిర్ణయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Also Read: Bandi Sanjay: ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి 50 లక్షల వైద్య పరికరాలు ప్రారంభం : కేంద్ర మంత్రి బండి సంజయ్
దేశ నాయకుల స్పందన
ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్‌రివాల్ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్ సమాజం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న నిర్ణయమిదేనని అన్నారు. నిబంధనలు పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాల్లో మత్తుపదార్థాలు, మాంసాహారం పూర్తిగా నిషేధం అవుతాయని తెలిపారు. “పంజాబ్ చరిత్రలో నేటి రోజు బంగారు అక్షరాలతో నిలిచిపోతుంది. ఆధ్యాత్మికంగానే కాదు, పంజాబ్ సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర రక్షణలో కూడా ఇది అత్యంత కీలకమైన అడుగు,” అని కేజ్‌రివాల్ Xలో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ సింగ్ బాజ్వా సహా వివిధ పార్టీల నేతలు కూడా ఈ సమావేశానికి హాజరై పంజాబ్ సాంస్కృతిక గుర్తింపును సంరక్షించడానికి కలిసి పనిచేయాలని సూచించారు.
చారిత్రాత్మక అసెంబ్లీ సమావేశం
పంజాబ్ చరిత్రలో ఈ ప్రత్యేక సమావేశం ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంది. మొట్టమొదటిసారిగా అసెంబ్లీ సమావేశం చండీగఢ్ వెలుపల నిర్వహించబడింది. ఇది శ్రీ ఆనంద్‌పూర్ సాహిబ్‌లో జరగడం మరో ప్రత్యేకత. సమావేశంలో భాగంగా ప్రభుత్వం రూ.50 లక్షల నిధులను కూడా ప్రకటించింది. గురు తేగ్ బహదూర్ సుమారు తొమ్మిదేళ్లు నివసించినట్లు భావించే కుకేవాల్ గ్రామ అభివృద్ధికి ఈ నిధులు వినియోగించబడతాయి. పంజాబ్‌లోని సిక్ చరిత్ర, ఆధ్యాత్మిక వారసత్వాన్ని బలోపేతం చేయడమే ఈ కొత్త చర్యల ముఖ్య లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.

