MLA Kadiyam Srihari: ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేయబోనని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే తన కార్యాచరణ ఉంటుందని తెలిపారు. ఈ మేరకు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఎన్నికల గురించి ఎవరూ తొందరపడి ఆలోచించవద్దని సూచించారు. చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు అయినా ప్రజలు వారిని త్వరగా మర్చిపోయారని, కానీ తనను మర్చిపోయిన వారు లేరని ఆయన పేర్కొన్నారు.
Also Read: MLA Kadiyam Srihari: ఆ ఎమ్మెల్యే పొలిటికల్ ఫ్యూచర్ పై సర్వత్రా ఉత్కంఠ.. ఉప ఎన్నిక ఖాయమా..?
కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ మాత్రమే ప్రధాన పోటీ
జూబ్లీహిల్స్ ఎన్నికలపై బీఆర్‌ఎస్ పార్టీ విష ప్రచారం చేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 25 వేల మెజారిటీతో గెలవడం సంతోషంగా ఉందని కడియం శ్రీహరి అన్నారు. బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒక్క సర్పంచ్‌ను కూడా గెలుచుకోదని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ మాత్రమే ప్రధాన పోటీ అని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించేందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కార్యకర్తలకు, నాయకులకు “బంపర్ ఆఫర్” ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవంగా బలపరిస్తే గ్రామ అభివృద్ధికి రూ. 10 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి తన ఎమ్మెల్యే, ఎంపీ నిధుల నుంచి రూ. 25 లక్షల నిధులు ఇస్తానని ప్రకటించారు.
Also Read: Kadiyam Srihari: జీడికల్ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి.. ఎమ్మెల్యే కడియం కీలక అదేశాలు!

