Kadiyam Srihari: వచ్చే నెలలో జరగనున్న లింఘాల ఘనపూర్ మండలం, జీడికల్ శ్రీరామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలను అత్యంత బ్రహ్మాండంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఆదేశించారు. ఈ ఉత్సవాలకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ భరోసా ఇచ్చారు. వచ్చే నెల 4 నుంచి 17వ తేదీ వరకు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం ఆలయం వద్ద వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Also Read: Kadiyam Srihari: ఘనపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి 50కోట్లు.. కడియం శ్రీహరి కీలక వాఖ్యలు
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
నవంబర్ 10న జరిగే స్వామి కల్యాణంతో పాటు అన్ని ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కడియం శ్రీహరి సూచించారు. ‘గుడి పక్కన ప్రహరీ గోడ నుండి గుండం వరకు మెట్ల నిర్మాణం. రెండు గుండాల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు. గ్రామం నుండి ఆలయానికి సీసీ రోడ్డు నిర్మాణం. కల్యాణ మండపం వద్ద పిచ్చి మొక్కల తొలగింపు, ల్యాండ్ లెవలింగ్ పనులు. అటవీ శాఖ సహకారంతో నిత్య కైంకర్యాల కోసం పూల తోట ఏర్పాటు. సెంట్రల్ లైటింగ్, రెండు రెడీమేడ్ టాయిలెట్స్ అందుబాటులో ఉంచాలి. శానిటేషన్ పక్కాగా, 24 గంటలు తాగునీరు, విద్యుత్, మెడికల్ క్యాంప్, పోలీస్ భద్రత తప్పనిసరి. నవంబర్ 3వ తేదీ లోగా అన్ని పనులు పూర్తి చేయాలని గడువు విధించారు.
అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
మున్ముందు జీడికల్ దేవస్థానంకు మాస్టర్ ప్లాన్ తయారు చేసి శాశ్వత అభివృద్ధి పనులు చేపడతామని, ఇందులో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని’ ఎమ్మెల్యే కోరారు. గత జాతరను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేశామని గుర్తు చేసిన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఈసారి కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలు సజావుగా జరిగేందుకు జనగామ ఆర్డీఓ గోపీరామ్‌ను స్పెషల్ అధికారిగా నియమించామని కలెక్టర్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు
శానిటేషన్ కోసం ఎక్కువ మంది వర్కర్లను పెట్టి ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డీపీఓను ఆదేశించారు. అలాగే, శాశ్వతంగా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, మెడికల్ సిబ్బంది, మందులు, అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో డీసీపీ రాజా మహేందర్ నాయక్, ఆర్డీఓ గోపిరామ్, డీపీఓ స్వరూప, ఆలయ చైర్మన్ నరసింహులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి వంశీ, డైరెక్టర్లు, విద్యుత్, ఇంజినీరింగ్, మెడికల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Also Read: MLA Kadiyam Srihari: రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే ప్రధాన లక్ష్యం
