Priyanka Gandhi: ఆపరేషన్ సింధూర్‌పై లోక్ సభలో వాడివేడి చర్చ జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ఉగ్రవాదులు ఎందుకు పారిపోయారని తమను అడుగుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని దారుణాలు జరిగాయి, ఎంతమంతి ఉగ్రవాదులు తప్పించుకున్నారో రాహుల్ గాంధీ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు.
సోనియా ఉగ్రవాదుల కోసం ఎందుకు ఏడ్చారు?
మాటల సందర్భంలో బాట్లా హౌస్ ఘటనను అమిత్ షా గుర్తు చేశారు. ‘‘ఒక రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా సల్మాన్ ఖుర్షీద్ టీవీలో ఏడుస్తుండగా చూశాను. ఆయన సోనియా గాంధీ నివాసం నుంచి బయటకు వచ్చి, బాట్లా హౌస్ ఘటన నేపథ్యంలో సోనియా గాంధీ ఏడుస్తున్నారని అన్నారు. ఆమె ఉగ్రవాదుల కోసం కాకుండా షహీద్ మోహన్ శర్మ కోసం ఏడ్చి ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేంద్రమైతే, దానికి కాంగ్రెస్ చేసిన దేశ విభజన మూలమని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ విభజనను అంగీకరించకపోతే పాకిస్థాన్ ఉండేదే కాదని చెప్పారు.
Read Also- Rahul Gandhi: రాహుల్ గాంధీ గొప్ప మనసు.. ఆ 22 మంది పిల్లలకు సాయం
అమిత్ షా వ్యాఖ్యలకు ప్రియాంక గాంధీ కౌంటర్
అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో సోనియా గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. ‘‘మా అమ్మ తన భర్త రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందినప్పుడు మాత్రమే ఏడ్చారు’’ అని వ్యాఖ్యానించారు. పహల్గామ్ ఉగ్ర దాడికి దారి తీసిన నిఘా వైఫల్యాన్ని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ లేవనెత్తారు. ఉగ్రవాదులను తుదముట్టించామని అమిత్ షా చెబుతున్నారని, పహల్గామ్ దాడి నిఘా వైఫల్యం కాదా అని అడిగారు. టీఆర్ఎస్ అనేది కొత్తది కాదని, కాశ్మీర్‌లో చాలాచోట్ల తన మూలాలు ఉన్నాయని తెలిపారు. 2024లో జరిగిన దాడుల్లో 9 మంది మరణించారని వివరించారు. పహల్గామ్ దాడి ఘటనకు బాధ్యత ఎవరిదని ప్రశ్నించిన ప్రియాంక, హోంమంత్రి, ఐబీ చీఫ్ రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. జమ్ముకశ్మీర్‌లో శాంతి నెలకొన్నది, భూములు కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ చెప్పారని, కానీ శాంతి ఎక్కడుందని నిలదీశారు.
Read Also- Drone Thief: లవర్ కోసం వెళ్లిన యువకుడు.. దొంగ అనుకొని తుక్కురేగొట్టిన గ్రామస్తులు!