Drone Thief: ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh)లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలిని కలిసేందుకు రాత్రి వేళ రహస్యంగా వెళ్లిన యువకుడిపై గ్రామస్తులు దాడి చేశారు. దొంగలని భావించి యువకుడితో పాటు అతడి ఇద్దరు స్నేహితులను చితక్కొట్టారు. తీరా వారు దొంగలు కాదని, యువతిని కలిసేందుకు వచ్చారని తెలిసి వారంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన యూపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది.
వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్ ప్రదేశ్ బరేలీ జిల్లా హాపూర్ గ్రామంలో డ్రోన్ దొంగల భయం గత కొన్ని రోజులుగా పీడిస్తోంది. సమీప గ్రామమైన అమ్రోహా ప్రాంతంలో ఇటీవల డ్రోన్ సాయంతో కొందరు దొంగ తనాలకు పాల్పడ్డారన్న పుకార్లు గ్రామస్తులను ఆందోళనకు గురిచేశాయి. దొంగలు దోపిడికి ముందు ఇళ్లను తనిఖీ చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరిగింది. అయితే అందులో వాస్తవం లేదని పోలీసులు చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా రాత్రి వేళ.. హాపూర్ గ్రామస్తులు గస్తీ కాయడం ప్రారంభించారు.
Also Read: Weight Loss Tips: అలా ఉన్నవారు.. ఇలా అవ్వాలంటే.. ఈ 5 టిప్స్ ఫాలో కావాల్సిందే!
రంగంలోకి పోలీసులు
ఈ క్రమంలోనే ఓ యువకుడు.. తన ప్రియురాలిని రహస్యంగా కలిసేందుకు రాత్రివేళ హాపూర్ గ్రామంలో అడుగుపెట్టారు. అతడితో పాటు మరో ఇద్దరు స్నేహితులు సైతం గ్రామంలోకి వచ్చారు. అదే సమయంలో గ్రామస్తులు డ్రోన్ దొంగ కోసం వెతుకుతుండగా.. ప్రియుడు, అతడి ఇద్దరు స్నేహితులు వారి కంట పడ్డారు. దీంతో వారిని వెంటాడి పట్టుకొని చితక్కొట్టారు. గ్రామంలోకి ఎందుకు వచ్చారని.. పదే పదే ప్రశ్నించినప్పటికీ వారు సమాధానం చెప్పలేదు. యువతితో ప్రేమ వ్యవహారం బయటపడుతుందన్న భయంతో మౌనంగా ఉండిపోయారు. చివరికీ అసలు నిజం తెలుసుకొని ఆ యువకుల్ని గ్రామస్తులు విడిచిపెట్టారు. దాడికి సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి అనితా చౌహన్ అన్నారు.