Draupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు (Draupadi Murmu) మంగళవారం సాయంత్రం (అక్టోబర్ 21) పెనుప్రమాదం తప్పింది. నాలుగు రోజుల అధికారిక పర్యటన కోసం కేరళలోని పతనంతిట్ట పట్టణానికి ఆమె ప్రత్యేక హెలీకాప్టర్‌లో చేరుకున్నారు. ‘ప్రమదం స్టేడియం’లో హెలీకాప్టర్ ల్యాండవ్వగా, బరువును తట్టుకోలేక హెలీప్యాడ్ ఉపరితలం కొంతభాగం కుంగిపోయింది. నేలలోకి కొంతమేర దిగబడినట్టయింది. ఈ ఘటనతో అక్కడున్న భద్రత సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించి, హెలికాప్టర్‌ను కుంగిన ప్రభావిత ప్రాంతం నుంచి సురక్షిత ఉపరితలం వైపు నెట్టారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు కలిసి ఎలాంటి యంత్రాల సాయం లేకుండా మానవప్రయత్నంతో హెలీకాప్టర్‌ను ముందుకు నెట్టారు. అదృష్టం కొద్దీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. హెలీప్యాడ్ కుంగిపోవడానికి గల కారణాలు ఏంటనేది ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది.
Read Also- M Padmanabha Reddy: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ.. ఎందుకంటే..?
కేరళలో 4 రోజల పర్యటన
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళలో 4 రోజులపాటు అధికారిక పర్యటన చేయనున్నారు. బుధవారం నాడు శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇందుకోసం బుధవారం ఉదయం 7.30 గంటల సమయంలో శబరిమల ఆలయం ఉన్న పతనంతిట్ట జిల్లాకు బయలుదేరారు. రాష్ట్రపతి కాన్వాయ్ ఉదయం 7.25 గంటలకు రాజ్‌భవన్ నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పతనంతిట్ట జిల్లాలోని ప్రమదం చేరుకొని, అక్కడ నుంచి శబరిమల కొండ దిగువ ప్రాంతమైన పంబకు చేరుకుంటారు. శబరిమల దర్శన కోసం వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం చెప్పేందుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (TDB) అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.
సాంప్రదాయ పర్వతారోహణ మార్గం గుండా ఆమె ఆలయానికి చేరుకుంటారని, ఐదు ఫోర్-వీల్ వెహికిల్స్, ఒక అంబులెన్స్ కాన్వాయ్‌లో ఉంటాయని టీబీడీ అధికారులు తెలిపారు. కాన్వాయ్‌కు సంబంధించిన కాన్వాయ్ రిహార్సల్ కూడా ఇటీవలే నిర్వహించామని వివరించారు. అయ్యప్ప స్వామివారి దర్శనం అనంతరం రాష్ట్రపతి ముర్ము బుధవారం సాయంత్రం తిరువనంతపురం తిరిగి వెళ్తారని వెల్లడించారు.
Read Also- Patigadda Flyover: పాటిగడ్డ ఫ్లైఓవర్ పై బల్దియా ఫోకస్.. స్థల సేకరణకు నోటిఫికేషన్ జారీ!
పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ముర్ము
కేరళ పర్యటనలో ద్రౌపది ముర్ము బిజీబిజీగా గడపనున్నారు. గురువారం నాడు ఆమె రాజ్‌భవన్‌లో మాజీ రాష్ట్రపతి కేఆర్. నారాయణన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం వర్కలలోని శివగిరి మఠంలో శ్రీ నారాయణ గురు మహాసమాధి శతాబ్ది వేడుకల్లో పాల్గొని ప్రారంభిస్తారు. కొట్టాయం జిల్లా పాలలో ఉన్న సెయింట్ థామస్ కాలేజ్ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల ముగింపు వేడుకలకు కూడా ఆమె హాజరుకానున్నారు. ఇక, అక్టోబర్ 24న ఎర్నాకుళంలోని సెయింట్ థెరిసాస్ కాలేజ్ శతాబ్ది వేడుకల్లో పాల్గొనడంతో ముర్ము కేరళ పర్యటన ముగుస్తుందని షెడ్యూల్ ప్రకారం తెలుస్తోంది. కాగా, మంగళవారం రాష్ట్రానికి రాష్ట్రపతి చేరుకున్న సందర్భంగా , కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, సీఎం పినరయి విజయన్, ఇతర ప్రజాప్రతినిధులు, సీనియర్ అధికారులు ఎయిర్‌పోర్టుకు వెళ్లి స్వాగతం పలికారు.
#WATCH | Kerala: A portion of the helipad tarmac sank in after a chopper carrying President Droupdi Murmu landed at Pramadam Stadium. Police and fire department personnel deployed at the spot physically pushed the helicopter out of the sunken spot. pic.twitter.com/QDmf28PqIb
— ANI (@ANI) October 22, 2025
