Patigadda Flyover: రోజురోజుకి హైదరాబాద్(Hyderabada) మహానగరంలో పెరుగుతున్న రద్దీ, ట్రాఫిక్(Traffic) సమస్య నుంచి వాహనదారులకు కొంతమేరకైనా ఉపశమనం కల్గించేందుకు హెచ్ సిటీ పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ(GHMC) సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి 10 నెలలు గడిచిపోవటంతో కనీసం ఇప్పుడేైనా ఈ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే కేబీఆర్ చుట్టూ చేపట్టాల్సిన పనులకు, నానల్ నగర్ జంక్షన్ లో నిర్మించనున్న మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను చేపట్టిన జీహెచ్ఎంసీ ఇపుడు తాజాగా ట్రాఫిక్ అత్యంత ఎక్కువగా ఉంటే బేగంపేట, సికిందరాబాద్ కారిడార్ లో పాటిగడ్డ వద్ద నిర్మించనున్న రోడ్ ఓవర్ బ్రిడ్జి పనులపై కసరత్తును ప్రారంభించింది.
ప్రత్యామ్నాయ రోడ్ల కోసం..
కేబీఆర్(KBR), నానల్ నగర్(Nanal Nagar) లలో చేపట్టనున్న హెచ్ సిటీ(H-City) పనులకు స్థల సేకరణ పూర్తి కాకముందే టెండర్ల ప్రక్రియ చేపట్టిన జీహెచ్ఎంసీ(GHMC) ఇపుడు తన పంథాను మార్చుకుని ముందుగా స్థల సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే నిత్యం రద్దీ ఉండే, భూమి ధర ఆకాశాన్నంటి ఉన్న పాటి గడ్డలో రోడ్ ఓవర్ బ్రిడ్జి స్థల సేకరణ కోసం నోటిఫికేషన్ ను జారీ చేసింది. కంటోన్మెంట్ లో ప్రత్యామ్నాయ రోడ్ల కోసం సేకరించాల్సిన స్థల సేకరణ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో త్వరలోనే కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రూ. 906 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రత్యామ్నాయ రోడ్ల పనులకు సమాంతరంగా ఈ పాటిగడ్డ రోడ్ ఓవర్ బ్రిడ్జి పనులను చేపట్టాలని జీహెచ్ఎంసీ యోచిస్తుంది.
Also Read; CM Revanth Reddy: సీనియర్ ఐఏఎస్‌లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ?
37 ఆస్తులు.. 15 వేల 706 గజాలు..
పాటిగడ్డ లో రోడ్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించేందుకు నిత్యం రద్దీగా ఉండే పాటిగడ్డ, పాటిగడ్డ మెయిన్ రోడ్డులోని మొత్తం 37 ఆస్తుల నుంచి సుమారు 15 వేల 706 గజాల స్థలాన్ని సేకరించేందుకు జీహెచ్ఎంసీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. వీటిల్లో మూడు పైగాకు చెందిన ఆస్తులుండగా, ఒకటి హెచ్ఎండీఏ(HMDA)కు చెందిన ఖాళీ స్థలం ఉంది. మరో ఆరు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన క్వార్టర్స్ ఉండగా, మిగిలినవన్నీ ప్రైవేటు ఆస్తులే. రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏకు చెందిన ఆస్తుల నుంచి స్థల సేకరణకు పెద్దగా ఇబ్బందులు, అడ్డుంకులు లేకపోయినా, ప్రైవేటు ఆస్తుల నుంచి స్థలాలను సేకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్థల సేకరణ ప్రక్రియ ఆలస్యం కాకుండా త్వరగా ముగించేందుకు వీలుగా జీహెచ్ఎంసీ భూ సేకరణ వింగ్ అధికారులు నేరుగా స్థల యజమానులతో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నారు. సేకరిస్తున్న స్థలానికి బదులుగా తొలుత ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్ (టీడీఆర్)ను ఆఫర్ చేయాలని, ఓనర్లు అంగీకరిస్తే టీడీఆర్ లు లేని పక్షంలో నష్టపరిహారం చెల్లించాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ అధికారులు ఆశించిన విధంగానే సకాలంలో స్థల సేకరణ, ఆ తర్వాత రోడ్ ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తయి అందుబాటులోకి వస్తే పాటిగడ్డ మీదుగా అటు పంజాగుట్ట వైపు, ఇటు సికిందరాబాద్ వైపు ట్రాఫిక్ వేగంగా ముందుకు కదిలే వెసులుబాటు కల్గనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: Kantara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’ మూవీ 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?
