India vs Pakistan: దేశాధినేతలు, ప్రధానమంత్రులు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో భాగంగా నిత్యం ఏదోక దేశంలో పర్యటిస్తునే ఉంటారు. ఈ నేపథ్యంలో వీవీఐపీ విమానంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య వారు ప్రయాణిస్తుంటారు. సాధారణంగా దేశాధినేతల పర్యటనలకు సంబంధించి ప్రత్యేకంగా ఓ విమానం ఉంటుంది. ఆ విమానంలోని అత్యాధునిక సౌఖర్యాలు, భద్రత.. ఆ దేశ ప్రతిష్ఠకు అద్దం పడుతుంటుంది. అయితే ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తన ఎయిర్ ఇండియా వన్ (కస్టమ్ బోయింగ్ 777-300ER) విమానంలో చైనాకు వెళ్లారు. అదే సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం గల్ఫ్ స్ట్రీమ్ IV జెట్ (Gulfstream IV)తో అక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతల విమానాలు పక్క పక్కనే కనిపించాయి. ఇప్పటికే భారత్ పాక్ మధ్య ఉద్రిక్తలు ఉన్న నేపథ్యంలో.. విమానంలో ఏ ప్రధానికి ఎలాంటి సౌఖర్యాలు ఉన్నాయన్న చర్చ మెుదలైంది. కాబట్టి రెండు విమానాల మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
ఎయిర్ ఇండియా వన్ (Boeing 777-300ER)
ఎయిర్ ఇండియా వన్ విమానం చాలా విశాలంగా, సౌఖర్య వంతంగా ఉంటూ సుదూరంగా ఉండే దేశాలకు ప్రయాణించేందుకు అనువైనదిగా రూపొందించబడింది. దీనిని పూర్తిగా VVIP వినియోగం కోసం డిజైన్ చేశారు. తెలుపు-నారింజ రంగుల పూతతో పాటు జాతీయ చిహ్నం గల ఈ విమానం.. తను దిగే ప్రతి ప్రదేశంలో గంభీరతను ప్రదర్శించి దేశ ప్రతిష్టకు చిహ్నంగా నిలుస్తుంటుంది.
శత్రు దుర్భేధ్యమైన రక్షణ వ్యవస్థలు
అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ ఈ ఎయిర్ ఇండియా వన్ విమానాన్ని నిర్మించింది. ఈ విమానం భారత ప్రముఖల భద్రత, సౌఖర్యాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. ఈ విమాన నిర్మాణం, ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాలు, భద్రతాపరమైన కమ్యూనికేషన్ వ్యవస్థలతో ఇది ఆకాశంలోనే కమాండ్ సెంటర్‌లా పనిచేస్తుంది. ఈ విమానాన్ని తరచూ ‘ఫ్లయింగ్ ఫోర్ట్రెస్’ అని కూడా పిలుస్తారు. ఇది అమెరికా ఎయిర్ ఫోర్స్ వన్ సరసన నిలబడగల రక్షణ సామర్థ్యాలను కలిగి ఉంది. ఇందులో అధునాతన క్షిపణి-రక్షణ వ్యవస్థలు, రాడార్ జామర్లు, ఎలక్ట్రానిక్ కౌంటర్‌మేజర్లు ఉంటాయి. సురక్షిత ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థల కారణంగా ప్రధాని గగనతలం నుంచి కూడా జాతిని ఉద్దేశించి మాట్లాడగలరు. అలాగే సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించడం వంటివి చేయవచ్చు.
13,650 కి.మీ నాన్ స్టాప్ జర్నీ
వాణిజ్య వినియోగంలో బోయింగ్ 777లో 300 మందికి పైగా ప్రయాణికులు కూర్చొనే వీలుంటుంది. అయితే VVIP వినియోగం కోసం దీనిని తిరిగి డిజైన్ చేశారు. ప్రధాని, ఉన్నతాధికారులు, భద్రతా సిబ్బంది, సహాయక సిబ్బంది కోసం విభాగాలుగా తీర్చిదిద్దారు. ఇందులో విలాసవంతమైన సూట్లు, మెడికల్ సెంటర్, సెక్యూర్ కాన్ఫరెన్స్ హాల్, సిబ్బంది కోసం ప్రత్యేక కేబిన్లు ఉంటాయి. దీని గరిష్ట ప్రయాణ శ్రేణి సుమారు 13,650 కి.మీ. అంటే భారత్ నుంచి అమెరికా లేదా యూరప్‌కి ఎక్కడా ఆగేపని లేకుండా నేరుగా చేరవచ్చు. అవసరమైతే గగనతలంలోనే ఇంధనం నింపుకునే సామర్థ్యం కూడా ఉంది.
పాక్ ప్రధాని విమానం
ఇక పాకిస్తాన్ ప్రధాని ఉపయోగించే గల్ఫ్‌స్ట్రీమ్ IV అనేది మధ్యతరహా బిజినెస్ జెట్. ఇది విలాసవంతమైనదే కానీ దాని రూపకల్పన ప్రధానంగా వ్యాపార ప్రయాణాల కోసం రూపొందించబడింది. కేవలం 14–18 మంది మాత్రమే కూర్చునే సామర్థ్యం ఉంది. సౌకర్యవంతమైన సీట్లు, చిన్న సమావేశ టేబుళ్లు ఉన్నప్పటికీ.. పెద్ద బృందాలతో లేదా అధిక భద్రతా అవసరాలతో ప్రయాణాలకు ఇది సరైనది కాదు. ఈ విమానం గరిష్ట ప్రయాణం 8,000 కి.మీ మాత్రమే. అంటే ఆసియా లేదా మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ ప్రయాణాలకు అనువైనదే కానీ అమెరికా వంటి దూరప్రాంతాలకు ఇంధనం నింపకుండా నేరుగా వెళ్లడం సాధ్యం కాదు. దీనిలో సాధారణ భద్రతా సౌకర్యాలే ఉంటాయి. ఎయిర్ ఇండియా వన్ లాంటి అధునాతన రక్షణా వ్యవస్థలు లేవు.
Also Read: Telangana Jagruthi Kavitha: ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా.. హరీశ్ రావుపై మరోమారు మాటల తూటాలు
రెండింటికీ స్పష్టమైన తేడా
భారతదేశపు ఎయిర్ ఇండియా వన్ అత్యాధునిక సాంకేతికత, కట్టుదిట్టమైన భద్రతకు అనువైన విలాసవంతమైన విమానం. ఇది దేశ ప్రతిష్టను, సాంకేతిక శక్తిని ప్రపంచానికి తెలియజేస్తుంది. కానీ పాకిస్తాన్ ప్రధాని వినియోగించే గల్ఫ్‌స్ట్రీమ్ IV సాధారణ సౌకర్యాలతో కూడిన బిజినెస్ జెట్ మాత్రమే. చిన్న బృందాల ప్రాంతీయ ప్రయాణాలకు మాత్రమే అనువైనది. అంతిమంగా ఈ రెండు విమానాలు కేవలం సాంకేతికత, భద్రతలోనే కాదు.. ఇరుదేశాల గ్లోబల్ స్థాయి, వ్యూహాత్మక లక్ష్యాల మధ్య ఉన్న వ్యత్యాసాన్నీ కూడా ప్రతిబింబిస్తున్నాయి.