Telangana Jagruthi Kavitha: భారత రాష్ట్ర సమితి నుంచి తనను సస్పెండ్ చేయడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదన్న ఆమె.. బీఆర్ఎస్ పార్టీ ద్వారా పొందిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామాను స్పీకర్ ఫార్మెట్ లో అందజేయనున్నట్లు తెలిపారు. అదే సమయంలో బీఆర్ఎస్ కు సైతం తాను రాజీనామా చేస్తున్నట్లు కవిత వెల్లడించారు.
‘బీఆర్ఎస్ పెద్దలు పునరాలోచించాలి’
తెలంగాణలోని జాగృతి భవన్ నుంచి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ ‘నిన్న మధ్యాహ్నం తర్వాత BRS నుండి ఒక ప్రకటన వచ్చింది. BRS అధినేత కేసిఆర్ నన్ను సస్పెండ్ చేస్తూ ఆ లెటర్ ను విడుదల చేశారు. నేను సుమారు 6 నెలలు జైల్లో గడిపిన తరువాత బయటి కొచ్చి హాస్టల్ స్టూడెంట్స్ పడుతున్న బాధలపైన మాట్లాడాను. బనకచర్ల, రైతుల సమస్యలు, బీసీ రిజర్వేషన్లు ఇలా అన్ని రకాల సమస్య పైన మాట్లాడాను. ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది అంటూ మాట్లాడిన బీఆర్ఎస్ పెద్దలు పునరాలోచించాలి’ అని కవిత అన్నారు.
‘నాకే ఇలా జరిగితే.. మిగతావారి పరిస్థితేంటి’
తన తండ్రి నుండి నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకుని ఇవాళ తాను సామాజిక తెలంగాణ కోసం మాట్లాడానని కవిత అన్నారు. ‘హరీష్ రావు, సంతోష్ రావు లు పని పట్టుకుని నా మీద దుష్ప్రచారం చేశారు. నేను బంగారు తెలంగాణ కోసం మాట్లాడితే నా పైన విమర్శలు చేశారు. నేను రామన్నను గడ్డం పట్టుకుని బ్రతిమిలాడాను. నా మీద కుట్రలు జరిగియని చెప్తే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడితే కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడలేదు. నాకే ఇలా జరిగితే బీఆర్ఎస్ లో సామాన్య మహిళలకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నన్ను సస్పెండ్ చేసినా పర్లేదు కానీ నిన్న బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ఒక్కటయ్యారు. అందుకు నాకు సంతోషం గా ఉంది’ అని కవిత పేర్కొన్నారు.
‘బీఆర్ఎస్ హస్తగతానికి హరీశ్ రావు కుట్ర’
దైవ సామానులైన తన తండ్రి కేసీఆర్ కు తాను ఒక విజ్ఞప్తి చేస్తున్నట్లు కవిత అన్నారు. ‘మీ చుట్టూ ఏం జరుగుతుందో మీరు చూసుకోవాలి. ఈ రోజు నాకు జరిగింది రేపు కేటీఆర్ కి, కేసీఆర్ కూడా జరగొచ్చు. బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి హరీశ్ రావు పన్నాగాలు పన్నుతున్నారు. హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకే ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్లినప్పుడు నుండి మా కుటుంబం పైన కుట్ర జరిగింది. హరీష్ రావు.. రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడిన తర్వాత నా పైన ఇంత పెద్ద కుట్ర చేశారు. హరీష్ రావు పైన విచారణ అనగానే ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. తర్వాత రోజు అసలు హరీష్ రావు గురించి న్యూస్ ఉండదు. అదే కేటీఆర్ విషయానికి వస్తే రోజుల తరబడి ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని కవిత చెప్పుకొచ్చారు.
‘ఆ అవినీతి డబ్బు కాళేశ్వరానిదే’
ఇవాళ కేసీఆర్ వరకు సీబీఐ వచ్చింది అంటే ఆది కేవలం హరీశ్ రావు, సంతోష రావు వల్లనే అని కవిత మరోమారు వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుండి హరీష్ రావు కేసీఆర్ గారితో లేరు. పార్టీ పెట్టిన 9 నెలల తర్వాత పార్టీలోకి వచ్చారు. హరీష్ రావు ట్రబ్బుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్. ఆయనే ట్రబుల్ క్రియేట్ చేసి బబుల్ షూట్ చేస్తారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఎన్నికలో కూడా అలాగే చేశారు. బీజేపీ నుండి ఒక కాండిడేట్ ను పెడదామని చెప్పారు. 2018 ఎన్నికల్లో MLA లకు హరీష్ రావు సెపరేట్ గా ఫండింగ్ ఇచ్చారు. ఆయనకు ఎక్కడ నుండి వచ్చాయి ఆ డబ్బు. అవి కచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి చేసిన డబ్బులే’ అని కవిత ఆరోపించారు.
Also Read: Indian Railways: స్వర్గానికి కేరాఫ్‌గా నిలిచే రైల్వే స్టాప్స్.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే!
‘రామన్న.. నాన్న జాగ్రత్త’
అంతేకాదు కేటీఆర్, కేసీఆర్ లను ఓడించేందుకు హరీష్ రావు కుట్రలు చేశారని కవిత ఆరోపించారు. ‘రామన్న నా మీద మీకు ఎవరు ఏం చెప్పారో తెలీదు కానీ నాకు మాత్రం మీరు ఎప్పుడూ బావుండాలి అని ఉంటుంది. ఆడపిల్ల ఎప్పుడు ఇల్లు బావుండాలి అని కోరుకుంటుంది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే నేను కేసీఆర్ గారి కూతురు లాగ పుట్టాను. రామన్న కేసీఆర్ గారి ఆరోగ్యం కాపాడండి పార్టీని కాపాడండి. ఆరడగుల బుల్లెట్టు ఈ రోజు నన్ను గాయపరిచింది నేడో రేపో కేటీఆర్ గారిని కూడా గాయపరుస్తుంది. ఈటెల రాజేందర్ కూడా హరీష్ రావు వల్లే బయటికి వెళ్ళారు. ఇతర ముఖ్య నేతలు అందరూ హరీష్ వల్లే పార్టీని విడిచి వెళ్ళిపోయారు. మీడియా మేనేజ్మెంట్ లో హరీష్ రావు దిట్ట. కేటీఆర్ యూట్యూబ్ ను మేనేజ్మెంట్ చేస్తే హరీష్ రావు మెయిన్ స్ట్రీమ్ మీడియా ను మేనేజ్ చేస్తారు. పార్టీ నుండి వచ్చిన MLC పదవికి నేను రాజీనామా చేస్తున్నాను. స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేస్తున్నాను. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నా’ అని కవిత వెల్లడించారు.