Modi Gifts Putin: రెండు రోజులు భారత్‌లో పర్యటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని బహుమతులను (Modi Gifts Putin) అందించారు. భారతీయ వారసత్వానికి ప్రతీకలుగా ఉన్నవాటిని మోదీ గిఫ్ట్‌లుగా ఎంచుకున్నారు. దేశ సంస్కృతి, కళా నైపుణ్యం, వారసత్వాన్ని ప్రతిబింబించే అద్భుతమైన బహుమతుల ఈ జాబితాలో ఉన్నాయి. నాణ్యమైన అస్సాం బ్లాక్ టీని పుతిన్‌కు మోదీ అందించారు. మాల్టీ రుచికి (కొద్దిగా తీపి), చక్కటి మెరిసే రంగుకు ప్రసిద్ధిగాంచిన ఈ అస్సాం బ్లాక్ టీకి ‘భౌగోళిక గుర్తింపు’ (GI ట్యాగ్) కూడా ఉంది. ఎంతో సారవంతమైన బ్రహ్మపుత్ర మైదానాలలో ఇది సాగవుతుంది. భారతదేశ టీ సంప్రదాయాన్ని ఈ బ్లాక్ టీ ప్రతిబింబిస్తుంది.
అలంకరించిన వెండి టీ సెట్
ముర్షిదాబాద్‌లో అత్యంత సూక్ష్మమైన, సంక్లిష్టమైన ఆకృతులతో తయారు చేసిన వెండి టీ సెట్‌ను బహుమతికిగా పుతిన్‌కు మోదీ అందించారు. టీ సెట్, టీ సేవించే ఆచారాన్ని భారత్ – రష్యా మధ్య శాశ్వత స్నేహాన్ని చాటిచెబుతుందనే నమ్మకం ఉంది. ఇక, మహారాష్ట్రలో తయారైన హస్తకళాఖండం ‘వెండి గుర్రాన్ని’ కూడా మోదీ అందించారు. ఈ గుర్రం గౌరవం, ధైర్యం, నిరంతరం ముందుకు సాగుతున్న భారతదేశం–రష్యా భాగస్వామ్యానికి ప్రతీకగా నిలవనుంది. మార్బుల్ చదరంగం (చెస్) సెట్‌ను కూడా పుతిన్ కానుకగా అందుకున్నారు. ఆగ్రాకు చెందిన ఈ సున్నితమైన కళాకృతి చదరంగం సెట్ ఉత్తర భారతదేశ కళానైపుణ్యాన్ని, సుందరత్వాన్ని మిళితంగా తయారైంది. మార్బుల్ చెస్ సెట్‌లో పాలరాతితో పాటు కలప, సెమీ-ప్రీషియస్ రాళ్లను పొదిగారు.
Read Also- Guard of Honor: రాష్ట్రపతి భవన్‌లో అధ్యక్షుడు పుతిన్‌కు ‘గార్డ్ ఆఫ్ హానర్స్’ స్వాగతం.. వీడియో ఇదిగో
రష్యన్ భాషలో శ్రీమద్ భగవద్గీత
రష్యన్ భాషలో రచించిన శ్రీమద్ భగవద్గీతను కూడా ప్రధాని మోదీ అందజేశారు. ఈ పవిత్ర గ్రంథం విధి (కర్తవ్యం), నైతికత, ఆధ్యాత్మికతకు సంబంధించి కాలాతీత జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ గ్రంధాన్ని రష్యన్ పాఠకులకు కూడా అందుబాటులోకి వచ్చింది. పుతిన్‌కు మోదీ అందించిన బహుమతుల జాబితాలో కాశ్మీరీ కుంకుమ పువ్వు కూడా ఉంది. దీనిని ‘ఎర్ర బంగారం’ అని కూడా పిలుస్తారు. దీని సువాసన, రుచి, ఆరోగ్య ప్రయోజనాలు చాలా చాలా విలువైనవి. ఈ కుంకుమ పువ్వు కాశ్మీర్ వారసత్వం, హస్తకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
పుతిన్ పర్యటనపై రాష్ట్రపతి భవన్ కీలక ప్రకటన
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం తర్వాత రాష్ట్రపతి భవన్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. భారత్, రష్యా స్నేహం మరింతగా వికసిస్తుందని పేర్కొంది. పుతిన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ నివాసంలో ఆహ్వానించి, ప్రభుత్వ గౌరవార్థం విందు ఇచ్చినట్టు రాష్ట్రపతి భవన్ తెలిపింది. భారత్ – రష్యా మధ్య ఉన్న ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యానికి పుతిన్ అందిస్తున్న మద్దతు, ఆయన వ్యక్తిగత నిబద్ధతపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు జల్లు కురిపించారు. ఇరుదేశాల మధ్య స్నేహం రాబోయే సంవత్సరాల్లో కూడా మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ మేరకు ఇరు దేశాల నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారని రాష్ట్రపతి భవన్ ప్రకటనలో వివరించింది.
Read Also- TG Global Summit: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్‌లో కీలక మార్పులు

