PM Modi: గత దశాబ్దకాలం పూర్తి చేసుకున్న ప్రతిష్టాత్మక ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రశంసల జల్లు కురిపించారు. ఈ కార్యక్రమం దేశంలో డిజిటల్ అంతరాలను తగ్గించడమే కాకుండా, 140 మంది భారతీయ పౌరులకు సాధికారతను అందించిందని వ్యాఖ్యానించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, సాధించిన విజయాలు, రానున్న రోజుల్లో సాధించాల్సిన లక్ష్యాలను ఆయన ‘లింక్డ్‌ఇన్’ పోస్టులో పేర్కొన్నాు. ఆలోచనలు సవ్యంగా ఉంటే ఆవిష్కరణ ప్రతి ఒక్కరికీ సాధికారిత ఇస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఉన్నవారికి, లేనివారికి మధ్య అంతరాన్ని తొలగించడంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యీకరణ, సమగ్ర డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన, అందరికీ అవకాశాలు కల్పన అనే ముఖ్య లక్ష్యాలు పునాదిగా డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.
Read also- Law Student: లా విద్యార్థినిపై అఘాయిత్యానికి ముందు ఏం జరిగిందో బయటకొచ్చింది!
97 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు
భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు 97 కోట్లకు పెరిగారని ప్రధాని మోదీ తెలిపారు. ‘‘2014లో దేశంలో సుమారుగా 25 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉండేవారు. ఆ సంఖ్య నేడు 97 కోట్లకు పెరిగింది. భూమి, చంద్రుడి మధ్య దూరానికి 11 రెట్లు సమానమైన 42 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ విస్తరించడం ద్వారా ఇది సాధ్యమైంది. సియాచిన్ నుంచి గల్వాన్ వరకు, ప్రపంచంలో అత్యంత వేగంగా 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. దేశంలో అత్యంత మారుమూల ప్రాంతాలు కూడా ఇప్పుడు డిజిటల్‌గా అనుసంధానమయ్యాయి. కేవలం రెండేళ్లలో 4.81 లక్షల బేస్ స్టేషన్లను స్థాపించాం. డిజిటల్ ఇండియాలో భాగంగా యూపీఐ, ఆధార్, డిజిలాకర్, ఇతర కీలక ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. యూపీఏ ద్వారా దేశంలో ప్రతిఏటా 100 బిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. రియల్-టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో భారత్ తిరుగులేని అగ్రస్థానంలో నిలిచింది’’ అని ప్రధాని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా ప్రతిఏడాది దేశ పౌరులకు రూ.44 లక్షల కోట్లకు బదిలీ అవుతోందని, తద్వారా మధ్యవర్తుల ప్రమేయం తొలగిపోయిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానాకు రూ.3.48 లక్షల కోట్ల మేర ఆదా చేసిందని మోదీ వివరించారు.
Read also- Captain Cool: ‘కెప్టెన్ కూల్’పై ధోనీకి కేంద్రం గ్రీన్‌సిగ్నల్..
ఎంఎస్ఎంఈలకు ఎన్నో అవకాశాలు
ఓఎన్‌డీసీ (Open Network for Digital Commerce), జీఈఎం (Government e-Marketplace) వంటి సంస్థల తోడ్పాటుతో ఎంఎస్ఎంఈల (సూక్ష్మ, చిన్న తరహా కుటీర పరిశ్రమలు) ప్రజాస్వామీకరణ జరిగిందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. మహిళల సారధ్యంలో పెద్దఎత్తున వ్యాపారాలు జరిగాయని, క్షేత్ర స్థాయి నుంచి పెట్టుబడిదారులు ఎదిగారని ప్రస్తావించారు. ఓఎన్‌డీసీ ఇటీవల 200 మిలియన్ల ట్రాన్సాక్షన్లను దాటిందని, చివరి 100 మిలియన్ల లావాదేవీలు నిర్వహించడానికి కేవలం ఆరు నెలల సమయం మాత్రమే పట్టిందని వివరించారు. ఇక, జీఈఎం కేవలం 50 రోజుల్లోనే రూ.1 లక్ష కోట్ల విలువైన వాణిజ్యాన్ని జరిపిందని గుర్తుచేశారు. మహిళలు నేతృత్వం వహిస్తున్న సంస్థలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని చెప్పారు. స్వమిత్వ యోజన (SVAMITVA) వంటి పథకాలు 6.47 లక్షలకు పైగా గ్రామాలను డిజిటల్ మ్యాపింగ్ చేశాయన్నారు. 2.4 కోట్ల ఆస్తి కార్డులను జారీ చేశామని, లక్షలాది మందికి భూమి యాజమాన్య స్పష్టత అందించామని తెలిపారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భాగంగా, కోవిన్, ఆధార్, డిజిలాకర్, ఫాస్టాగ్, పీఎం-వాణి వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.