Modi On INS Vikrant: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఏడాది మాదిరిగానే, ఈసారి కూడా భారత సాయుధ దళాలతో కలిసి దీపావళి వేడుకలు నిర్వహించుకునే తన సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈసారి, ఆయన గోవా, కార్వార్ (కర్ణాటక) తీరంలో మోహరించి ఉన్న ఐఎన్‌ఎస్ విక్రాంత్ (Modi On INS Vikrant) యుద్ధనౌకపై నావికాదళ సిబ్బందితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, గొప్ప ధైర్య సాహసాలు కలిగిన నేవీ సిబ్బందిపై ప్రశంసల జల్లు కురిపించారు. పవిత్రమైన దీపావళి పండుగను నేవీ సిబ్బందితో కలిసి జరుపుకోవడం తన అదృష్టమని, ఈ గొప్ప అవకాశం తనకు దక్కిందని ఆయన అన్నారు.
‘‘ ఇవాళ నిజంగా అద్భుతమైన రోజు. ఈ దృశ్యాలు మరచిపోలేనివి. ఈ రోజు నా ముందు ఒకవైపు మహాసముద్రం, మరోవైపు భరతమాత ధైర్యవంతులైన సైనికుల శక్తి ఉన్నాయి. ఒకవైపు అనంతమైన ఆకాశాన్ని, భూమిని కలిపే దిగంతం. మరోవైపు అనంతమైన శక్తులకు ప్రతీకగా నిలిచిన ఐఎన్‌ఎస్ విక్రాంత్ ఉంది. సూర్యకిరణాల ప్రకాశంతో సముద్రపు నీటిపై మన సైనికులు దీపాలు వెలిగించినట్టుగా అనిపిస్తోంది’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
ఐఎన్ఎస్ విక్రాంత్‌పై ప్రశంసల జల్లు
భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక అయిన ఐఎన్‌ఎస్ విక్రాంత్ భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధాని మోదీ కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కేవలం కొన్ని రోజుల్లోనే పాకిస్థాన్ మోకరిల్లేలా చేసిందని, పాకిస్థాన్‌కు నిద్రలేని రాత్రులు ఇచ్చిందని మోదీ వ్యాఖ్యానించారు. త్రివిధ దళాల మధ్య ఉన్న ‘అసాధారణమైన సమన్వయమే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ లొంగిపోయేలా చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్ కేవలం ఒక యుద్ధనౌక మాత్రమే కాదని, 21వ శతాబ్దపు భారతదేశ షి, ప్రతిభ, ప్రభావం, నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు.
‘‘నిన్న (శనివారం) ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై గడిపిన రాత్రి మాటల్లో వర్ణించలేనిది. మీ (నేవీ సిబ్బంది) అందరిలో నిండివున్న అపారమైన శక్తిని, ఉత్సాహాన్ని నేను చూశాను. మీరు దేశభక్తి పాటలు పాడుతున్న తీరును, మీ పాటల్లో ఆపరేషన్ సింధూర్‌ను వర్ణించిన విధానాన్ని చూసినప్పుడు, యుద్ధభూమిలో నిలబడిన ఒక సైనికుడు అనుభవించే అనుభూతిని మాటల్లో పూర్తిగా చెప్పలేమని నాకు అర్థమైంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘‘మీ మధ్య గడపడంతో దీపావళి నాకు చాలా ప్రత్యేకం అయ్యింది’’ అంటూ తన ప్రసంగాన్ని మోదీ ముగించారు.
కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల నరమేధానికి ప్రతీకారంగా, మే 7న భారత దళాలు ఆపరేషన్ సింధూర్ ప్రారంభించాయి. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని అనేక ఉగ్ర స్థావరాలు, వారి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని సమన్వయ దాడులు చేపట్టాయి. పాకిస్థాన్ ప్రతిఘటించగా, భారత బలగాలు బలంగా తిప్పికొట్టాయి.
Highlights from INS Vikrant, including the Air Power Demo, a vibrant cultural programme and more… pic.twitter.com/Br943m0oCC
— Narendra Modi (@narendramodi) October 20, 2025
