Air india Plane Crash: అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం.. భారతీయుల హృదయాలను తీవ్రంగా కలిచి వేసింది. లండన్ కు టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం.. నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలి.. 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనలో ఒకే ఒక్క ప్రయాణికుడు బయటపడటంతో అందరి దృష్టి అతడిపై పడింది. ఇంతటి భారీ ప్రమాదం నుంచి ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేశ్ (Vishwash kumar Ramesh) బయటపడటం.. నిజంగా మిరాకిల్ అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే అతడు కూర్చొన్న 11A సీటు మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో విమానాల్లో 11A సీటు కోసం భారీగా పోటీ పెరిగినట్లు తెలుస్తోంది.
11A సీటుకు భారీ డిమాండ్!
అహ్మదాబాద్ ఘోర ప్రమాద సమయంలో మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేశ్ ప్రాణాలతో బయటపడటానికి 11A సీటు ప్రధాన కారణమని చర్చ జరిగింది. విమానంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ కు ఈ సీటు దగ్గర ఉండటంతో.. ప్రమాదం జరిగిన వెంటనే విశ్వాస్ కుమార్.. బయటకు వచ్చేసి ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇది గమనించిన విమాన ప్రయాణికులు.. ఫ్లైట్స్ లో 11A సీటును బుక్ చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి. ఒకవేళ అనుకోని ప్రమాదం సంభవించినా.. ఎమర్జెన్సీ డోర్ నుంచి త్వరగా బయట పడేందుకు వీలుంటుందని ప్రయాణికులు భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. అంతేకాదు.. టికెట్ ధరకు అదనంగా చెల్లించేందుకు సైతం ప్రయాణికులు సిద్ధపడుతున్నట్లు స్పష్టం చేశాయి.
ప్రయాణికుల మాటల్లో..
తరచూ విమానాల్లో ప్రయాణించే కొందరు వ్యక్తులు.. 11A సీటు లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కు దగ్గరగా ఉండే సీటు గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తాను 11A సీటులోనే ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు కోల్ కత్తాకు చెందిన రాజేశ్ భగ్నానీ అన్నారు. విశ్వాస్ కుమార్ ప్రాణాలతో బయటపడ్డ ఎపిసోడ్ మెుత్తం చూశాక.. ఆ సీటు అయితేనే కాస్త సేఫ్ గా ఉంటుందన్న అభిప్రాయాన్ని వచ్చినట్లు తెలిపారు. వ్యాపారవేత్త జితేందర్ సింగ్ భగ్గా.. 11A సీటు గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విమానంలో తన తొలి ప్రాధాన్యం 11A సీటుకేనని.. దాని కోసం ఎక్స్ ట్రా మనీ చెల్లించేందుకైనా తాను సిద్ధమని వ్యాఖ్యానించారు. మరో రెగ్యులర్ ట్రావెలర్ అనిల్ పుంజాబి సైతం 11A సీటుపై ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ సీటులో కూర్చుంటే కాస్త ప్రశాంతంగా ఉండవచ్చని పేర్కొన్నారు.
గతంలోనూ ఇదే రిపీట్!
ఎయిరిండియా విమాన ప్రమాదంలో ‘11ఏ సీటు’లో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడ్డట్టుగానే, 27 ఏళ్ల క్రితం కూడా ఒక మిరాకిల్ జరిగింది. 1998 డిసెంబర్ 11న థాయ్ ఎయిర్‌వేస్ విమానం (టీజీ261) ఘోర ప్రమాదానికి గురైంది. అప్పుడు కూడా ఫ్లైట్‌లో 11వ సీటులో కూర్చున్న థాయ్‌లాండ్ ప్రముఖ సింగర్, నటుడు రువాంగ్‌సక్ లాయ్‌చూజాక్ (Ruangsak Layjack) ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గురైన విమానంలో మొత్తం 146 మంది ప్రయాణించగా, అందులో 101 మంది చనిపోయారు. 45 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అయితే, 11ఏ సీటులో కూర్చున్న రువాంగ్‌సక్ మాత్రం ఎలాంటి గాయాలు కాకుండానే బతికి బట్టకట్టారు.
Also Read: Kuberaa Twitter Review: ‘కుబేర’ ట్విట్టర్ టాక్.. తిప్పరా మీసం అంటున్న అక్కినేని ఫ్యాన్స్.. హిట్ కొట్టినట్టేనా?
విమానంలో సేఫ్ సీట్లు ఇవేనా?
విశ్వాస్ కుమార్ రమేష్ 11ఏ సీటులో కూర్చొని ప్రాణాలతో బయటపడడంతో విమానంలో సేఫ్ సీట్లపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. విమాన ప్రమాదాల్లో బయటపడ్డ వారు కూర్చున్న సీట్లను బట్టి పరిశీలిస్తే, విమానంలో సురక్షితమైన సీట్లు ఉంటాయని విమానయాన రంగ నిపుణుడు అంగద్ సింగ్ అన్నారు. విమానంలో చివరన లేదా ముందు భాగం కుడివైపున ఉండే సీట్లు కొంతమేర సురక్షితమైనవిగా భావించవచ్చని విశ్లేషించారు. కాగా, ఎయిరిండియా ప్రమాదం నుంచి బయటపడిన విశ్వాస్ కుమార్ రమేష్, తాను సజీవంగా బయటకు వచ్చానో తనకు తెలియదని అన్నారు. ‘‘నేను చనిపోతానని కొద్దిసేపు అనిపించింది. కానీ, నేను కళ్లు తెరిచి చూస్తే బతికే ఉన్నాను. నా సీట్ బెల్ట్ ఓపెన్ చేసి అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఎయిర్‌హోస్టెస్, అత్తామామ, అందరూ నా కళ్ల ముందే చనిపోయారు’’ అని ఆయన పేర్కొన్నారు.