Hyderabad Crime: అదనపు కట్నం కోసం అత్తమామలు, భర్త, మరిది వేధింపులు తట్టుకోలేక ఒక వివాహిత కేబుల్ బ్రిడ్జి పైనుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్ట్ మారేడ్‌పల్లిలోని అడ్డగుట్టకు చెందిన బీ సుష్మ (27)కు, నెరేడ్‌మెట్‌కు చెందిన గొల్లూరు ఆనంద్ కుమారుడు అమృత్‌తో 2025 జనవరి 31న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఆరు తులాల బంగారం, ఒక బుల్లెట్ బండి, రూ. 6 లక్షల నగదు కట్నంగా ఇస్తామని ఒప్పందం చేసుకోగా, రూ. 5.5 లక్షలు చెల్లించారు.
అమృత్ హైటెక్ సిటీలోని ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాగా, సుష్మ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ రోడ్డులోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. గత కొంతకాలంగా భర్త అమృత్, అత్తమామలు ఆనంద్, పాలిన, మరిది జ్యోతిరాజ్ అదనపు కట్నం తీసుకురావాలని సుష్మను వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. కట్నం విషయమై సుష్మకు అత్తమామలతో తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఇటీవల సుష్మకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో గత శని, ఆదివారాలు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని సోమవారం అడ్డగుట్టలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది.
ఈ నెల 18వ తేదీన సాయంత్రం 3 గంటలకు ఆఫీస్‌కు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి సుష్మ ఇంట్లోంచి బయలుదేరింది. ఆఫీస్‌కు చేరుకున్న తర్వాత, రాత్రి 8:30 గంటలకు బయటకు వెళ్లి కేబుల్ బ్రిడ్జి మీదకు చేరుకుని దుర్గం చెరువులోకి దూకింది. సుష్మ రాత్రి 1 గంటకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. సుష్మ పనిచేస్తున్న ఆఫీస్ మేనేజర్‌కు తండ్రి ఫోన్ చేసి అడగగా, రాత్రి 8:30 గంటలకే ఆమె ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిందని తెలియజేశాడు. బంధువులు, తెలిసినవారిని సుష్మ ఆచూకీ కోసం ఆరా తీసినా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో గురువారం తెల్లవారుజామున మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: Harish Rao: సీఎంకు బేసిన్‌లపై నాలెడ్జ్ లేదు.. హరీశ్ రావు సంచలన కామెంట్స్!
ఉదయం 7 గంటల సమయంలో దుర్గం చెరువు నీటిపై యువతి మృతదేహం తేలియాడుతుండటాన్ని స్థానికులు గమనించి మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయంతో యువతి మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీయగా, అది మిస్సింగ్ అయిన సుష్మదే అని గుర్తించారు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతురాలి తండ్రి అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుష్మ భర్త అమృత్, అతని తల్లిదండ్రులు ఆనంద్ పాలిన, మరిది జ్యోతిరాజ్‌లపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.