Harish Rao: నీళ్లపై రేవంత్ రెడ్డి అంతులేని అజ్ఞానంతో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. దేశం ముందు తెలంగాణ (Telangana) పరువు పోయిందని, అవగాహన లేకుండా మాట్లాడడం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యమని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొంతకాలంగా (Banakacharla) బనకచర్లను అడ్డుకోండి అని తాము మాట్లాడితే బోడి గుండుకు మోకాలుకు లంకె పెట్టినట్లు రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడారని దుయ్యబట్టారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడారన్నారు.
Also ReadL:GHMC Commissioner: డ్రైనేజీ సమస్యను సత్వరమే పరిష్కరించాలి!
బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉన్నారు
సచివాలయంలో పీపీటీ పెట్టి తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని సెటైర్లు వేశారు. సీఎం, నీళ్ల మంత్రి బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారన్నారు. దేవాదుల ఏ బేసిన్‌లో ఉందో తెలియదు, బనకచర్ల ఏ బేసిన్‌లో కడుతున్నారో తెలియదు, రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఏం చేస్తున్నట్లు అని నిలదీశారు. బనకచర్ల (Banakacharla) ప్రాజెక్టుపై ఏపీ 6 నెలల నుంచి పని చేస్తుంటే, కేంద్రానికి ఉత్తరాలు రాస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిని కలుస్తూ కేంద్ర జల మంత్రిని కలుస్తూ ముందుకు పోతుంటే అమాయకంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బనకచర్ల (Banakacharla) ఏ బేసిన్‌లో ఉందని అడుగుతున్నారని మండిపడ్డారు.
ఎంత శ్రద్ధ పెట్టారో బయట పడింది
ఎంత కమిట్మెంట్ ఉందో.. ఎంత సిన్సియార్టీ ఉందో ఆరు నెలల నుంచి ఎంత శ్రద్ధ పెట్టారో బయట పడిందని వ్యాఖ్యానించారు. ఆంధ్ర జల దోపిడీ అడ్డుకొని తెలంగాణ పొలాలకు నీళ్లు పారివ్వు, అక్రమ ప్రాజెక్టును ఆపవయ్యా అంటే అది చేతగాక అడ్డూ అదుపు లేకుండా అబద్ధాల ప్రవాహాన్ని ముఖ్యమంత్రి పారించారని విమర్శించారు. అసలు విషయం మాట్లాడమంటే మొత్తం విషయాన్ని పక్కదోవ పట్టించారన్నారు. బూతులు తెలుసుకున్నంత సులువు కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం అంటూ సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి ఇట్లుంటే ఆయన సలహాదారుడు అంతకంటే గొప్ప ఘనుడుగా ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.