GHMC: జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎక్కడి చెత్త అక్కడే అన్నట్టు కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నది. ముఖ్యంగా వీఐపీలు నివసించే బంజారాహిల్స్ (Banjara Hills) ప్రాంతంలోనూ ఎక్కడబడితే అక్కడ చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad)మహానగరాన్ని డంపర్ బిన్ ఫ్రీ సిటీ చేయాలన్న జీహెచ్ఎంసీ (GHMC) అధికారుల ప్రయత్నం విఫలమై, సిటీ మొత్తం గార్బేజీ ఫుల్ సిటీగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు చెత్త కుండీలు, తర్వాత డంపర్ బిన్లను ఏర్పాటు చేయడంతో స్థానికులు అలవాటుగా వాటిల్లో చెత్తను వేసేవారు. కానీ బిన్ ఫ్రీ సిటీ పేరిట వాటిని తొలగించడంతో రెగ్యులర్‌గా చెత్త పడేసే ప్రాంతంతో పాటు ఖాళీ ప్రదేశాలు, కూడళ్లలో పేరుకుపోతున్నది.
గ్రేటర్ పరిధిలో పారిశుద్ధ్య పనులు నిర్వర్తించేందుకు సుమారు 14 ఏళ్ల క్రితం రాంకీ సంస్థతో జీహెచ్ఎంసీ (GHMC) చేసుకున్న ఒప్పందం అమలుకు గతంలో అడ్డంకులు తలెత్తగా, ప్రస్తుతం ఆ ఒప్పందాన్ని జీహెచ్ఎంసీ (GHMC) దశల వారీగా అమలు చేస్తున్నది. ఈ ఒప్పందం చేసుకున్న కొత్తలో ఒక్కో టన్నుకు రూ.810 చెల్లిస్తూ, ఏటా 5 శాతం పెంచాలన్న నిబంధనను అగ్రిమెంట్‌లో పొందుపరిచారు. చెత్త సేకరణ, తరలింపునకు సంబంధించి రాంకీ, జీహెచ్ఎంసీ (GHMC) మధ్య నెలకొన్న సమన్వయ లోపం కారణంగా ఎక్కడా కూడా చెత్త సకాలంలో తొలగించకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
Also Read: Farmer Welfare Initiatives: రైతుల సంక్షేమంపై.. తెలంగాణ ప్రభుత్వం భేష్!
కంపు కొడుతున్న మేయర్ డివిజన్
సిటీలో సంపన్నవర్గాలు, సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు నివసించే బంజారాహిల్స్ డివిజన్‌లోని నందినగర్, ఫిల్మ్ నగర్‌లలో చెత్త కుప్పలు పేరుకుపోయినట్లు స్థానికులు వెల్లడించారు. పైగా, నగర ప్రథమ పౌరురాలు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్న బంజారాహిల్స్ డివిజన్ లోనూ సకాలంలో చెత్త కుప్పలను తరలించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వెనుక రోడ్డు నిర్మాణ వ్యర్ధాలను తొలగించడంలో వహిస్తున్న నిర్లక్ష్యం స్థానికుల పాలిట శాపంగా మారింది. నంది నగర్‌లో రోడ్డు నిర్మించిన తరువాత వ్యర్ధాలను తొలగించాలి. కానీ, రెండు నెలలు దాటినా తొలగించలేదు
స్వచ్ఛ టిప్పర్ కార్మికుల కక్కుర్తి
11ఏళ్ల క్రితం జీహెచ్ఎంసీ (GHMC) చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేతో గ్రేటర్‌లో సుమారు 22 లక్షల గృహ సముదాయాలున్నట్లు గుర్తించారు. వీటి నుంచి నేరుగా చెత్తను సేకరించేందుకు విడుతల వారీగా జీహెచ్ఎంసీ 3750 స్వచ్ఛ ఆటో టిప్పర్లను సమకూర్చుకుంది. వీటిలో సుమారు 1500 నుంచి 2 వేల వరకు చెత్త సేకరణ విధులకు దూరంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతమున్న సుమారు 2 వేల స్వచ్ఛ ఆటోలు చెత్తను సేకరించేందుకు ఒక్క ఆటోకు సుమారు 600 నుంచి 700 వందల మధ్య ఇళ్లను కేటాయించారు.
కానీ ఒక ఆటో టిప్పర్ రోజుకి కనీసం వంద ఇళ్ల నుంచి కూడా చెత్తను సేకరించకపోవడం వల్లే వీధుల్లో, నాలాల్లో, కూడళ్లలో దర్శనమిస్తున్నది. టిప్పర్ కార్మికులు కూడా ఎవరెక్కువ డబ్బులిస్తే వారి నుంచి చెత్తను సేకరిస్తున్నారే తప్ప, డబ్బులివ్వని ఇండ్ల నుంచి సేకరించకపోవడంతో, వాటిలో నివాసముండే వారు రోడ్డుకిరువైపులా వేస్తున్నారు. జీహెచ్ఎంసీ (GHMC) కనీసం తాను సమకూర్చుకున్న టిప్పర్ల ద్వారా నూటికి నూరు శాతం చెత్త సేకరించడంలోనూ విఫలమైందన్న విమర్శలున్నాయి.
Also Read: PM Modi on Pahalgam attack: ప్రపంచ వేదికపై ప్రధాని మాస్ స్పీచ్.. పాకిస్థాన్‌కు ఇక మూడినట్లేనా!