Operation Aaghat 3.0: దేశ రాజధాని దిల్లీ నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న వేళ.. నగర పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. దక్షిణ, తూర్పు దిల్లీ జిల్లాల్లో దాడులు జరిపి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న 660 మందిని పైగా అరెస్టు చేశారు. ఆపరేషన్ అఘాత్ 3.0 పేరుతో చేపట్టిన ముందస్తు చర్యల్లో భాగంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.లక్షల్లో నగదు, మత్తు పదార్థాలు, మద్యం, దొంగిలించిన వస్తువులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు దిల్లీ పోలీసులు ప్రకటించారు.
ఆ రెండు జిల్లాల్లో దాడులు..
రాబోయే ఫెస్టివల్ సీజన్ లో నేరాలను అడ్డుకోవడంలో లక్ష్యంగా దిల్లీ పోలీసులు ‘ఆపరేషన్ అఘాత్ 3.0’ నిర్వహించారు. ప్రమాదకరంగా భావించిన ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి.. అనుమానిత అల్లరి మూకను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్ లో దిల్లీ సౌత్, సౌత్ ఈస్ట్ జిల్లాల పోలీసులు పాల్గొన్నారు. సౌత్ ఈస్ట్ దిల్లీ జిల్లాలో 285 మందిని అరెస్టు చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో 2,800 మందిని పైగా ప్రశ్నించినట్లు దిల్లీ జాయింట్ కమిషనర్ (సెక్యూరిటీ విభాగం) ఎస్.కె. జైన్ వెల్లడించారు. ఇది అత్యంత విజయవంతమైన ఆపరేషన్ గా పేర్కొన్నారు.
భారీగా ఆయుధాలు స్వాధీనం
‘ఆపరేషన్ అఘాత్ 3.0’ భాగంగా అనుమానితుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను దిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 24 దేశీ తుపాకులు, 44 కత్తులు, 22,500 క్వార్టర్ల మద్యం, 10 కేజీల గంజాయి సీజ్ చేశారు. అలాగే పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం సేవించిన కారణంగా 350 మందిని పైగా అరెస్టు చేశారు. దిల్లీలో నానాటికి పెరిగిపోతున్న వాహనాల దొంగతనాలపైనా ఈ ఆపరేషన్ లో దృష్టిసారించారు. పండుగల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఐదుగురు ఆటో లిఫ్టర్లను అరెస్టు చేశారు. దాడుల సమయంలో 231 ద్విచక్ర వాహనాలు, ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.
Also Read: City Police Annual Press Meet: హైదరాబాద్‌లో 405 అత్యాచారాలు.. 69 దారుణ హత్యలు.. క్రైమ్ చిట్టా విప్పిన సజ్జనార్
350 మెుబైల్స్ సీజ్..
‘ఆపరేషన్ అఘాత్ 3.0’ భాగంగా జూదం నిరోధక చట్టాల కింద దిల్లీ పోలీసులు 30 కేసులు నమోదు చేశారు. రెండు జిల్లాల్లో కలిపి 68 మంది జూదగాళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే దొంగిలించినట్లుగా భావిస్తున్న సుమారు 350 మొబైల్ ఫోన్లను సైతం పోలీసులు సీజ్ చేశారు. వాటిని నిజమైన యజమానలకు అందజేస్తామని ఈ సందర్భంగా దిల్లీ పోలీసులు తెలియజేశారు.
#WATCH | Delhi Police display the items recovered and confiscated during Operation Aaghat 3.0. https://t.co/fA0n2qjKb3 pic.twitter.com/4nY0yoX2Zj
— ANI (@ANI) December 27, 2025

