Terrorists Arrest: ఉగ్రవాదులు తలపెట్టిన భారీ కుట్రను పోలీసుల భగ్నం చేశారు. జమ్ముకాశ్మీర్ – హర్యానా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, తుపాకీ, ముందు గుండు సామాగ్రి బయటపడింది. హర్యానాలోని ఫరిదాబాద్ లో గల ఓ అద్దె ఇంట్లో తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలకు ఇవి లభించాయి. ఇటీవల జమ్ముకాశ్మీర్ లో అరెస్ట్ చేయబడ్డ డాక్టర్ ఆదిల్ అహ్మద్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఈ ఆపరేషన్ ను చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే..
జమ్ముకాశ్మీర్ అనంత్ నాగ్ లో సీనియర్ డాక్టర్ గా పనిచేస్తున్న ఆదిల్ అహ్మద్ ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థతో అతడికి సంబంధాలు ఉన్నాయని తేలడంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆదిల్ ఇచ్చిన సమాచారం మేరకు.. హర్యానాలోని ఫరిదాబాద్ లో గల అతడి రహస్య స్థావరమైన అద్దె ఇంట్లో సోమవారం దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడ 360 కిలోల పేలుడు పదార్థాలు (అమోనియం నైట్రేట్‌గా అనుమానం), అసాల్ట్ రైఫిల్ (మూడు మేగజైన్‌లతో), 83 లైవ్ కార్ట్రిడ్జ్‌లు, ఒక పిస్టల్ (8 లైవ్ రౌండ్స్‌తో), 12 సూట్‌కేసులు, పేలుడు పదార్థంతో నిండిన బకెట్, 20 టైమర్లు, 4 బ్యాటరీలు, రిమోట్ కంట్రోల్స్, 5 కిలోల ఇనుప ముక్కలు, ఒక వాకీ–టాకీ సెట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలు నిల్వచేయడానికి సహకరించిన ముజామిల్ షకీల్ అనే మరో డాక్టర్ ను సైతం దర్యాప్తు వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి.
మహిళా డాక్టర్‌పై అనుమానం..
అయితే ముజామ్మల్ షకీల్ కు చెందిన అసాల్ట్ రైఫిల్ ను ఓ మహిళా డాక్టర్ కారు (స్విఫ్ట్ డిజైర్)లో భద్రతా బలగాలు గుర్తించాయి. ఆ వైద్యురాలు అల్ ఫలాహ్ యూనివర్శిటీలో పనిచేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ముజామ్మల్ ఆయుధం ఆమె కారులో ఉండటంతో.. ఈ ఉగ్ర కుట్ర వెనుక ఆమె పాత్ర ఏమైనా ఉందా? అనుమానాలు మెుదలయ్యాయి. ప్రస్తుతానికి వైద్యురాలిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. ఆమెకు తెలియకుండానే ముజామ్మల్ వాహనాన్ని వినియోగించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే వైద్యురాలి పాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు.
Also Read: Air Pollution Protest: ఊపిరి పీల్చలేకపోతున్నాం, రక్షించండి.. రోడ్డెక్కిన దిల్లీ జనం.. పిల్లలు కూడా అరెస్ట్?
దాడులకు ముందు..
ఈ భారీ ఆపరేషన్… పుల్వామాకు చెందిన డాక్టర్ ఆదిల్ అహ్మద రాధర్ తో ప్రారంభమైంది. సహారన్ పూర్ లో ఆయన్ను అరెస్ట్ చేసిన జమ్మూ పోలీసులు.. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫరిదాబాద్ లోని ముజామ్మల్ షకీల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడు అద్దెకు తీసుకున్న ఇంట్లో సోదాలు నిర్వహించి.. భారీ మెుత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఫరిదాబాద్ పోలీసు కమిషనర్ సతేందర్ కుమార్ గుప్తా అన్నారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి ఎక్కువ విషయాలు బయటకు చెప్పలేకపోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
