Honeymoon Case: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో (Honeymoon Murder Case) పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హత్యకు గురైన భర్త రాజా రఘువంశీపై, అతడి భార్య సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా స్నేహితులు ముగ్గురూ దాడి చేసినట్టు తేలింది. ఇక, ఇప్పటివరకు ఒక్క కొడవలినే ఉపయోగించారని భావించగా, రెండు కత్తులు వాడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని మేఘాలయ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని ‘వీ సావ్‌డాంగ్ జలపాతం’ సమీపంలో మేఘాలయ పోలీసులు సీన్ రీ-కన్‌స్ట్రక్చన్ చేశారు. సోనమ్, రాజ్‌తో పాటు హత్య చేసిన ముగ్గుర్నీ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మంగళవారం (జూన్ 17) రాజా దంపతులు గడిపిన పలు ప్రదేశాలకు తీసుకెళ్లింది. మావ్లాఖియాత్, వీ సావ్‌డాంగ్ జలపాతాల వద్దకు కూడా తీసుకెళ్లి పోలీసులు మరిన్ని వివరాలను రాబట్టారు.
Read this- Air India: వెంటవెంటనే విమానాల రద్దు?.. ఏం జరుగుతోంది?
‘‘హత్య జరిగిన రోజు, హత్య సమయంలో ఘటనల క్రమాన్ని రీ-క్రియేట్ చేశామని తూర్పు ఖాసీ హిల్స్ పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సయీమ్ వెల్లడించారు. ‘‘హత్య జరిగిన చోటుకు తీసుకెళ్తాం. హత్య సమయంలో ఏ వ్యక్తి ఏ స్థానంలో ఉన్నారు?. రాజాపై ఎలా దాడి చేశారో నిర్ధారించుకున్నాం. నిజానికి, వాళ్ల దగ్గర రెండు వేర్వేరు కొడవళ్లు ఉన్నాయి. హత్య కోసం రెండింటినీ వాడారు. రెండవ కత్తి కోసం వెతుకుతున్నాం. రాజా మృతదేహాన్ని విసిరేసిన లోయలో, నిందితుల్లో రాజేశ్ అనే వ్యక్తి అతడి తెల్లటి చొక్కాను విసిరివేశాడు. దాడి మొదలపెట్టాలని నిందితులకు సిగ్నల్ ఇచ్చింది భార్య సోనమ్. రాజాపై మొదటి దెబ్బ విశాల్ విసిరాడు. ఆ దెబ్బ తగలగానే రాజా నేలపై పడిపోయాడు’’ అని ఎస్పీ వివేక్ చెప్పారు.
సోనమ్ నేరం ఒప్పుకుంది
రాజా రఘువంశీ హత్య కేసులో భార్య సోనమ్ ఇప్పటికే నేరం అంగీకరించిందని ఎస్పీ వివేక్ వెల్లడించారు. ‘‘ ఇవాళ నేరస్థలాన్ని తీసుకెళ్లి సీన్ రీక్రియేట్ చేశాం. హత్య సమయంలో ఆమె ఎక్కడ ఉంది?, ఆమె పాత్ర ఏమిటి?, ఇలా ప్రతి అంశం ఈరోజు బయటపడింది. ముగ్గురు వ్యక్తులు రాజాను చంపారు. సోనమ్ అక్కడే నిలబడి చూసింది. సోనమ్ ఆమె ఫోన్‌ను పగలగొట్టుకుంది. అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే నడుచుకుంది. నిందిత ముగ్గురు వ్యక్తులు రాజా మృతదేహాన్ని లోయలోకి విసిరేశారు. హత్య చేసేందుకు ‘వీ సావ్‌డాంగ్’ ఏరియా అనువైన ప్రదేశమని సోనమ్, హంతకులు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే, అక్కడ ఎవరూ లేరు. నిందితుల్లో ఎవరూ ఇంతకు ముందు మేఘాలయకు వెళ్లలేదు’’ అని ఎస్పీ వివేక్ వివరించారు. మరో పోలీసు బృందం ఇండోర్‌లో ఉందని, వారు తదుపరి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో మరికొంత మందిని సైతం ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు.
Read this- Iran-Israel Conflict: అక్కడి నుంచి వెళ్లిపోండి.. భారతీయులకు కీలక అడ్వైజరీ
కాగా, రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీల వివాహం ఈ ఏడాది మే 23న జరిగింది. ఇండోర్ పెళ్లి జరిగిన 12 రోజుల తర్వాత హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. ఇద్దరూ కనిపించకపోవడంతో తొలుత దంపతులు మిస్సింగ్ అయినట్టు డ్రామా నడిచింది. అయితే, జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని లోయలో గుర్తించడంతో అసలు విషయం బయటపడింది. రాజాను భార్య సోనమ్ రఘువంశీ కుట్రపూరితంగా హత్య చేసినట్టు గుర్తించారు.