Iran Israel Conflict: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య (Iran-Israel conflict) ఉద్రిక్తకర పరిస్థితులు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. పరస్పర భీకర దాడులు 5వ రోజుకు చేరుకున్నాయి. దాడుల విరమణకు ఇరు దేశాలూ ససేమిరా అంటుండడంతో ఉద్రిక్తత మరింత ముదరడం ఖాయమనిపిస్తోంది. ఇరాన్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, అక్కడి ఇండియన్ ఎంబసీ అధికారులు రంగంలోకి దిగారు. ఇరాన్‌లోని భారత పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు ప్రక్రియను వేగిరం చేశారు. ఇప్పటికే ఇరాన్‌లోని 110 మంది భారతీయ విద్యార్థులను సురక్షితంగా అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి రేపు (బుధవారం) ఢిల్లీకి పంపించాలని అధికారులు నిర్ణయించారు.
మరో అడ్వైజరీ జారీ
ఇరాన్‌లో ఆందోళనకర పరిస్థితులు అంతకంతకూ పెరిగిపోవడంతో టెహ్రాన్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు తాజాగా మరో అడ్వైజరీ జారీ చేశారు. టెహ్రాన్‌లో నివసిస్తున్న భారతీయులు వెంటనే నగరాన్ని వీడాలని సూచించారు. మరింత సమాచారం కోసం ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ అవ్వాలని తెలిపారు. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్లు +989010144557, +989128109115, +989128109109 కాంటాక్ట్ అవ్వాలని కోరారు.
Read this- Watch Video: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో వైరల్
టెల్‌అవీవ్‌లోనూ హెల్ప్ లైన్
ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా అప్రమత్తమైంది. 24 గంటలపాటు భారతీయులకు సేవలు అందించేందుకు వీలుగా అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ తీవ్రమవ్వడంతో ఇక్కడి భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. వేగంగా మారిపోతున్న పరిణామాలను గమనిస్తున్నామని, ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరుల భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నామంటూ అక్కడి భారత రాయబార కార్యాలయం శనివారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే +972 54-7520711, +972 54-3278392 నంబర్లు, ఈ-ఇమెయిల్ cons1.telaviv@mea.gov.in సంప్రదించాలని సూచించింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తకర పరిస్థితులను తగ్గించేందుకు చైనా, టర్కీ, యూకే వంటి పలు దేశాలు ప్రయత్నాలు చేస్తు్న్నాయి. అయినప్పటికీ ఇరు దేశాలు దారికి రావడం లేదు. ఇరాన్, అమెరికా మధ్య ఆదివారం జరగాల్సిన అణు చర్చలు రద్దు కూడా రద్దయ్యాయి.
Read this- Puri Sethupathi: కత్తిలాంటి హీరోయిన్‌ని పట్టిన పూరి, చార్మి! ఈసారి హిట్టు పక్కా!
వెనక్కి తగ్గని ఇరుదేశాలు
అణుబాంబుల తయారీకి ఇరాన్ ఒక్క అడుగు దూరంలోనే ఉన్నదని, అణు బాంబులు తయారైతే తమ దేశానికే ముప్పు అంటూ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట ఇజ్రాయెల్ గతవారం ఇరాన్‌పై విరుచుకుపడింది. భీకర దాడులతో అణు కేంద్రాలతో పాటు అణ్వాయుధాల తయారీలో ముఖ్యమైన శాస్త్రవేత్తలు అందర్నీ మట్టుబెట్టింది. ఇరాన్ ఆర్మీ చీఫ్‌ను కూడా దాడుల్లో మట్టుబెట్టింది. దీంతో, చిరకాల శత్రువులపై ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. క్షిపణి, డ్రోన్ దాడులతో పరస్పరం విరుచుకుపడుతున్నాయి. దీంతో, మధ్యప్రాచ్యంలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. రాజధాని టెల్అవీవ్‌తో పాటు పలు నగరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 20 మందికి పైగా మరణించగా, వందలాది మంది గాయపడినట్టు తెలుస్తోంది.