Air India: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా (Air India) విమానం క్రాష్ అయిన నాటి నుంచి సంస్థకు చెందిన విమాన సర్వీసుల్లో తీవ్ర అవాంతరాలు ఎదురవుతున్నాయి. టెక్నికల్ సమస్యల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యహరిస్తున్నారు. జూన్ 12న విమాన ప్రమాదం జరగగా, ఆ రోజు నుంచి ఇప్పటివరకు గణనీయ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. చాలా ఫ్లైట్లు ఆలస్యమయ్యాయి, మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇవాళ (జూన్ 17) ఒక్క రోజే సాయంత్రం 6 గంటల్లోగా ఏకంగా ఐదు ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీనిని బట్టి పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మంగళవారం రద్దైన విమానాల జాబితాలో ఢిల్లీ-ప్యారిస్ ఏఐ-143 సర్వీస్ కూడా ఉంది. నిబంధనల ప్రకారం విమానం తనిఖీ ప్రక్రియలో సాంకేతిక సమస్యను గుర్తించడంతో సర్వీసును రద్దు చేస్తున్నట్టు ఎయిరిండియా ఒక ప్రకటన విడుదల చేసింది. పర్యావసానంగా, ప్యారిస్-ఢిల్లీ ఏఐ142 సర్వీసును కూడా రద్దు చేస్తున్నట్టు వివరించింది. సాంకేతిక సమస్యను రిపేర్ చేశారని తెలిపింది. ఇప్పటికే ఆలస్యమైనందున విమానాన్ని రద్దు చేస్తున్నామని, రాత్రి సమయంలో విమాన సేవలపై ప్యారిస్ ఛార్లెస్ డీ గల్లే ఎయిర్‌పోర్టులో పరిమితులు ఉన్నాయని, అందుకే సర్వీసును రద్దు చేస్తున్నట్టు వివరించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తు్న్నామని, ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేశామని వెల్లడించింది. హోటల్ వసతి కల్పిస్తున్నామని, ఫుల్ రిఫండ్ ఆఫర్ కూడా ఇచ్చామని తెలిపింది.
Read this- Indus Water Treaty: భారత్ దెబ్బకు పాక్ విలవిల.. సంచలన రిపోర్ట్ విడుదల
అహ్మదాబాద్-లండన్ ఫ్లైట్ రద్దు
ఢిల్లీ-ప్యారిస్ విమానాన్ని రద్దు చేయడానికి కొన్ని గంటల ముందు, అహ్మదాబాద్ – లండన్ విమానాన్ని ఎయిరిండియా రద్దు చేసింది. గగనతల పరిమితుల కారణంగా విమానాలు అందుబాటులో లేకపోవడం, అదనపు ముందస్తు జాగ్రత్త తనిఖీల కారణంగా రద్దు చేసినట్టు ఎయిరిండియా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ‘‘అహ్మదాబాద్ నుంచి గాట్విక్ కు వెళ్లాల్సిన ఏఐ-159 విమానాన్ని రద్దు చేశాం. అత్యంత జాగ్రత్తగా పరిశీలించడంతో సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టింది. ఎలాంటి సాంకేతిక లోపం దొరకలేదు’’ అని వివరించారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నామని, ప్యాసింజర్లను వారిని వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని వివరించారు. ప్రయాణికులకు హోటల్ వసతిని కూడా అందిస్తున్నామన్నారు. టికెట్ రద్దుపై పూర్తి డబ్బు వాపసు లేదా ఉచిత రీషెడ్యూలింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని అన్నారు. పర్యావసానంగా, లండన్ గాట్విక్ నుంచి అమృత్‌సర్‌కు రావాల్సిన ఏఐ-170 విమానాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు వివరించింది.
Read this- Flight Emergency: గాల్లో ఉన్న ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు.. కెప్టెన్ ఏం చేశాడంటే
డ్రీమ్‌లైనర్లలో సమస్యలు
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ‘డ్రీమ్‌లైనర్’ విమానాల్లో టెక్నికల్ సమస్యలు వరుసగా బయటపడుతున్నాయి. జూన్ 12న ఏఐ-171 ఫ్లైట్ ప్రమాదానికి గురవ్వగా, ఆ తర్వాత బ్రిటిష్ ఎయిర్‌వేస్, లుఫ్తాన్స, ఎయిరిండియాకు చెందిన మరో మూడు బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్లను టేకాఫ్ తర్వాత, వెనక్కు మళ్లించాల్సి వచ్చింది. హాంకాంగ్-ఢిల్లీ ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన 15 నిమిషాల తర్వాత వెనుతిరిగింది. బయలుదేరిన తర్వాత సాంకేతిక సమస్యను గుర్తించడంతో పైలట్ వెనక్కి తిప్పారు. మిగిలిన రెండు విమానాల్లో ఒకటి ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్, మరొకటి లండన్ నుంచి చెన్నై బయలుదేరి మార్గమధ్యంలోనే వెనుతిరిగాయి. మంగళవారం తెల్లవారుజామున కోల్‌కతా మీదుగా ముంబై వెళ్లాల్సిన శాన్‌ఫ్రాన్సిస్కో విమానం కూడా సాంకేతిక సమస్య కారణంగా ఆలస్యమైంది. దీంతో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయంలో ప్రయాణీకులను కిందకు దింపేశారు. విమానం ఎడమ ఇంజిన్‌లో సమస్య ఉన్నట్టు ఇంజనీర్లు గుర్తించారు.