నాగ్‌పూర్, స్వేచ్ఛ: Narendra Modi: దేశ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన 11 ఏళ్ల తర్వాత తొలిసారి నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని నరేంద్ర మోదీ సందర్శించారు. మరణమంటూ లేని భారతదేశ సంస్కృతికి ప్రతీక అని, ఒక మహావృక్షం లాంటిదని ఆర్ఎస్ఎస్‌ను ఈ సందర్భంగా మోదీ అభివర్ణించారు. బిజీ షెడ్యూల్ మధ్య ఆదివారం తెల్లవారుజామున ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఆయన, సంఘ్ వ్యవస్థాపక పితామహుడైన డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిర్‌ను సందర్శించి నివాళులు అర్పించారు.
ఆర్‌ఎస్‌ఎస్ మాజీ చీఫ్ మాధవ్‌రావు గోల్వాల్కర్ పేరు మీద నిర్మించ తలపెట్టిన ‘మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్’కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఐ ఇన్‌స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ విస్తరణలో భాగంగా దీనిని నిర్మిస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1956లో బౌద్ధమతం స్వీకరించిన స్థలం ‘దీక్షభూమి’ని కూడా ఆయన సందర్శించారు. కాగా, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన రెండవ సిట్టింగ్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిలిచారు. అంతకుముందు అటల్ బిహారీ వాజ్‌పేయి 2000వ సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.
ఆర్‌ఎస్‌ఎస్ ఒక మహావృక్షం
మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు శంకుస్థాపన తర్వాత మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన స్వచ్ఛంద సేవకులు అని కొనియాడారు. దేశంలోని వివిధ రంగాలలో, ప్రాంతాలలో నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని మెచ్చుకున్నారు. ‘‘భారతదేశ అజరామరమైన సంస్కృతి, ఆధునికీకరణ ప్రతీక ఆర్‌ఎస్‌ఎస్. సంఘ్ ఒక మహావృక్షం. జాతీయ చైతన్యాన్ని కాపాడమే ఆర్ఎస్ఎస్ ఆదర్శాలు, సూత్రాలు. ఈ మహావృక్షం సాధారణమైనది కాదు. సేవకు పర్యాయపదం. గత 100 ఏళ్లలో సంఘటన్, సమర్పణ్‌తో ఆర్‌ఎస్‌ఎస్ చేసిన ‘తపస్య’ ఫలితాలు చూపింది. దేశం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం ముందుకెళుతోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన 100 ఏళ్ల తర్వాత, ఆర్‌ఎస్‌ఎస్ మరో మైలురాయిలోకి అడుగుపెడుతుంది.
Also read: Peddi: మెగా అలెర్ట్.. శ్రీరామనవమికి సిద్ధంకండమ్మా!
2025 నుంచి 2047 మధ్య కాలం దేశానికి ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే పెద్ద లక్ష్యాలు మన ముందు ఉన్నాయి. తదుపరి 1,000 సంవత్సరాల అభివృద్ధి, ప్రగతికి మనం పునాది రాయి వేయాలి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశం ఈ ఏడాది 75 రాజ్యాంగ దినోత్సవ వేడుకలను జరుపుకుంటోందని, ఆర్‌ఎస్‌ఎస్ 100వ వార్షిక ఏడాదిని జరుపుకుంటోందని మోదీ ప్రస్తావించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన భగవత్ మాట్లాడుతూ, మాధవ్ నేత్రాలయం అనేక సంవత్సరాలుగా ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోందని అన్నారు. ఆర్ఎస్ఎస్ అనుసరిస్తు్న్న నిస్వార్థ సేవ అనే సిద్ధాంతం నుంచి ప్రేరణగా పొంది ఈ ఇన్‌స్టిట్యూట్‌ను నడిపిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు.
దీక్షభూమి.. సామాజిక న్యాయానికి ప్రతీక
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బౌద్ధమతం స్వీకరించిన ‘దీక్షభూమి’ని సందర్శించిన మోదీ, ఈ నేల సామాజిక న్యాయానికి, అణగారిన వర్గాలకు సాధికారతకు చిహ్నమని అభివర్ణించారు. అంబేద్కర్ కలలుగన్న భారతదేశాన్ని సాకారం చేసుకోవడానికి మరింత కష్టపడి పనిచేయడానికి ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అభివృద్ధి చెందిన, సమగ్రమైన భారతదేశాన్ని నిర్మించడమే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్‌కు నిజమైన నివాళి అని మోదీ అన్నారు. దీక్షభూమిలోని అంబేద్కర్ స్థూపానికి మోదీ నివాళులు అర్పించారు. సందర్శకుల డైరీలో హిందీలో మోదీ తన సందేశాన్ని రావారు. నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు సంబంధించిన పంచతీర్థాలలో ఒకటైన దీక్షభూమిని సందర్శించే అవకాశం లభించడం తనకు లభించడం చాలా ఆనందంగా ఉందని మోదీ వ్యాఖ్యానించారు.
Also read: Telugu states: ఉగాది వేళ ఇలా జరిగిందేంటి.. ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం!
ఇక్కడి పవిత్ర వాతావరణంలో అంబేద్కర్ చాటి చెప్పిన సామాజిక సామరస్యం, సమానత్వం, న్యాయం అనే సూత్రాలను అనుభూతి చెందవచ్చని అన్నారు. కాగా, 2017లో తొలిసారి దీక్షభూమిని ప్రధాని మోదీ సందర్శించారు. కాగా, నాగ్‌పూర్‌లోని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్‌కు చెందిన మందుగుండు సామగ్రి సౌకర్యాన్ని కూడా మోదీ సందర్శించారు. ఆయుధరహిత వైమానిక వాహనాల ఎయిర్‌స్ట్రిప్, మందుగుండు సామగ్రిని పరీక్షించే సౌకర్యాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఉన్నారు.