Honeymoon Murder Case: దేశంలో సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో పూటకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. భర్త రాజా రఘువంశీ (Raja Raghuvanshi)ని భార్య సోనమ్ (Sonam) సుపారీ ఇచ్చి మరి హత్య చేయించినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఇప్పటికే భార్య సోనమ్ తో పాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మేఘాలయలో అడుగుపెట్టిన దగ్గర నుంచి రాజా రఘువంశీ, సోనమ్ దంపతులు ఏం చేశారు? ఎక్కడెక్కడ ఉన్నారు? మర్డర్ కు ముందు ఏం జరిగింది? ఈ కేసులో కీలక అంశాలు ఏంటీ? అన్నది ఈ ప్రత్యేకత కథనంలో తెలుసుకుందాం.
కొత్త జీవితం ఆస్వాదించాలని..
రఘువంశీ (27), సోనమ్ (24) వివాహం.. మే నెల 11వ తేదీన జరిగింది. తమ కొత్త జీవితాన్ని ఘనంగా ప్రారంభించాలని భావించి హనీమూన్ ట్రిప్ ప్లాన్ (Honeymoon Trip Plane) చేశారు. ఇందులో భాగంగా మేఘాలయాలోని షిల్లాంగ్ ప్రాంతంలో మే 21న చెక్ ఇన్ అయ్యారు. అక్కడ మరుసటి రోజు ఓ స్కూటీని అద్దెకు తీసుకొని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన సోహ్రా (చిరపుంజీ)కి వెళ్లారు. మే 22 సాయంత్రం మావ్లాఖియాట్ అనే గ్రామానికి చేరుకుని అక్కడ తమ స్కూటీని పార్క్ చేశారు. దగ్గరలోని రిమోట్ ఏరియా ప్రాంతం నాంగ్రియేట్ గ్రామంలో ట్రెక్కింగ్ చేసేందుకు లోకల్ గైడ్ ను నియమించుకున్నారు. అయితే తాము సొంతంగా వెళ్తామని చెప్పి రాజా రఘువంశీ, సోనమ్ వెళ్లిపోయారు. గైడ్ అప్పుడే వారిని చివరిగా సారిగా చూసినట్లు చెప్పారు.
డ్రోన్ సాయంతో బాడీ గుర్తింపు
మే 23న సోహ్రా గ్రామంలో ఒక స్కూటీ అనుమానస్పందంగా ఉండటాన్ని స్థానిక పోలీసులు గమనించారు. విచారించగా ఓ జంటకు చెందినదని గుర్తించారు. దీంతో వారి ఆచూకి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక గ్రామస్తులు సైతం కనిపించకుండా పోయిన రాజా రఘువంశీ – సోనమ్ ఆచూకీ కోసం వెతికారు. ఈ క్రమంలో జూన్ 2న డ్రోన్ సాయంతో వీ సావ్డాంగ్ జలపాతం (Wei Sawdong Falls) సమీపంలోని లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని కనుగొన్నారు. ఘటన స్థలంలో మాచెట్, రక్తంతో తడిచి ఉన్న రెయిన్ కోట్ ను కూడా కనుగొన్నారు. దీనిని హత్యగా ప్రాథమికంగా తేల్చారు. దీంతో మేఘాలయ ప్రభుత్వం (Meghalaya Govt).. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సిట్ కు అప్పగించింది. ఇందులో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ చేరి.. కనిపించకుండా పోయిన సోనమ్ ఆచూకి కోసం ప్రయత్నించాయి.
సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన
దర్యాప్తులో భాగంగా రాజా రఘువంశీ స్టే చేసిన హోటల్ సీసీటీవీ ఫుటేజీని సిట్ అధికారులు పరిశీలించారు. షిల్లాంగ్ లోని వారి హోమ్ స్టే వద్దకు స్కూటర్ పై రావడం, అక్కడి నుండి వెళ్లిపోవడం కనిపించింది. అయితే సోనమ్ ఆచూకి కోసం మేఘాలయలో గాలిస్తుండగా.. జూన్ 9న రాత్రి ఆమె అనూహ్యంగా యూపీలో ప్రత్యక్షమైంది. వారణాసి-గాజీపూర్ హైవేపై ఉన్న కాశీ దాబాలో సోనం ఒంటరిగా కూర్చుని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: MLA Mandula Samuel: తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
అసోం సీఎం, డీజీపీ కీలక ప్రకటన
ఈ క్రమంలోనే మేఘాలయ పోలీస్ చీఫ్ ఇడాషిషా నొంగ్రాంగ్ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. సోనం తన భర్త హత్యను ప్లాన్ చేసినట్లు ఆరోపించారు. మెుత్తం ముగ్గురు నిందితుల్లో ఇద్దరు ఇండోర్, ఒకరు యూపీకి చెందినవారని పేర్కొన్నారు. ఇంకో అనుమానుతుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో సంచలనంగా మారిన హనీమూన్ మర్డర్ కేసును.. 7 రోజుల్లోనే ఛేదించినందుకు ఆ రాష్ట్ర సీఎం పోలీసులపై ప్రశంసలు కురిపించారు. ‘కేవలం ఏడు రోజుల్లో పెద్ద పురోగతి సాధించబడింది. భార్య లొంగిపోయింది. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. ఇంకో అనుమానితుడి కోసం ట్రాక్ చేస్తున్నారు. టీమ్ అద్భుతమైన పని చేసింది’ అని సీఎం ప్రశంసించారు.