MLA Mandula Samuel: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. వైన్స్ యాజమానులను ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే మామూళ్ల వ్యవహారాన్ని బయటపెట్టాలన్న ఉద్దేశ్యంతో సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అధికార కాంగ్రెస్ కు చెందిన వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో విపక్ష పార్టీలు.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే సామెల్ మీడియా ముందుకు వచ్చారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురించి ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు.
తీన్మార్ మల్లన్న.. బ్లాక్ మెయిలర్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే మందుల సామెల్ మీడియాతో మాట్లాడారు. మాదిగ ఎమ్మెల్యే అయిన తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తన ఇంటికి వైన్ షాప్ వాళ్లు వచ్చి చాయ్ తాగి మాట్లాడారని అన్నారు. ఇదంతా బ్లాక్ మెయిలర్ తీన్మార్ మల్లన్న చేసిన పనేనని మందుల సామెల్ ఆరోపించారు. తనను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకోవడానికి చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీతో తీన్మార్ మల్లన్న కుమ్మక్కై తనపై విష ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తనేంటో తుంగతుర్తి నియోజక వర్గ ప్రజలకు తెలుసని అన్నారు. నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడ్ని, దళితుడ్ని అయిన తనను అణగదొక్కే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.
Also Read: National Women’s Commission: అమరావతి వివాదంలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
నిరూపిస్తే దేనికైనా సిద్ధం
శాసన సభ ఎన్నికల్లో ప్రజలు తనను చందాలు వేసుకొని గెలిపించారని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. తన మీద వీడియో తీసిన వ్యక్తి.. తీన్మార్ మల్లన్న స్టూడియోలో కూర్చున్నారని చెప్పారు. దళితుడైన తనపై ఎందుకు ఇంత అక్కసు అని ప్రశ్నించారు. తాను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఎమ్మెల్యే సవాలు విసిరారు. నాపై దుష్పరాచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తన ఇంట్లో తిని తనపైనే విషం కక్కారని.. ఇందుకు మించిన దురదృష్టకరం మరొకటి ఉండదని చెప్పారు. అంతేకాదు తనపై ఇంకా వీడియోలు ఉన్నాయని.. డబ్బులు గుంజడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తుంగతుర్తి పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.