Sundar Pichai: ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన భారతీయుల్లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ముందు వరుసలో ఉంటారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన.. చదువులు అసాధారణ ప్రతిభ కనబరిచి.. అందరికీ ఆదర్శంగా నిలిచారు. తాను స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో చదువుకోవడానికి వెళ్తున్న సమయంలో తన తండ్రి సంవత్సర జీతాన్ని తన ఫ్లైట్ టికెట్ కోసం ఖర్చు చేసినట్లు ఓ సందర్భంలో సుందర్ తెలిపారు. దీన్ని బట్టి అతడి ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాగా ఇవాళ ఆయన 53వ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో అతడి జీవితంలోని కీలక ఘట్టాలు, గూగుల్ సీఈఓ స్థాయికి ఎదిగిన తీరుపై ఓ లుక్కేద్దాం.
సుందర్ పిచాయ్ నేపథ్యం..
సుందర్ పిచాయ్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయన 1972 జూన్ 10న తమిళనాడులోని మధురైలో జన్మించారు. సుందర్ తండ్రి రఘునాథ పిచ్చాయ్ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలో పనిచేశారు. తల్లి లక్ష్మీ ఒక స్టెనోగ్రాఫర్. సుందర్ బాల్యమంతా చెన్నైలో గడిచింది. చెన్నైలోని జవహర్ విద్యాలయంలో పాఠశాలలో స్కూల్ విద్య, వనవాణి మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఇంటర్ చేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో బీ.టెక్ పట్టా పొందారు. అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఎంఎస్ చేశారు.
గూగుల్ లో ప్రస్థానం
సుందర్ తన కెరీర్ ను.. అప్లైడ్ మెటీరియల్స్ అనే సెమీకండక్టర్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్‌లో ప్రారంభించారు. ఆ తర్వాత మెకిన్సీ అండ్ కంపెనీలో మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. అక్కడ టెక్ అండ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ రంగాలపై దృష్టి సారించారు. 2004లో గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా సుందర్ చేరారు. గూగుల్ టూల్‌బార్, గూగుల్ క్రోమ్ వంటి కీలక ఉత్పత్తుల అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్, క్రోమ్ ఓఎస్ అతడి నాయకత్వంలోనే అభివృద్ధి చేయబడ్డాయి. ఇది గూగుల్ కు ఆర్థికంగా గొప్ప విజయాన్ని అందించింది.
సీఈఓగా ఎదుగుదల
గూగుల్ లో సుందర్ పిచాయ్ విశేష ప్రతిభ కనబరచడంతో అతడ్ని 2014లో ప్రొడక్ట్ చీఫ్ గా నియమించారు. అక్కడ గూగుల్ కు సంబంధించిన అన్ని కీలక ఉత్పత్తులను సుందర్ పర్యవేక్షించారు. 2015లో గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ అల్ఫాబెట్ ఇంక్. ను ప్రారంభించారు. ఆ సమయంలో గూగుల్ కు నాయకత్వం వహించడానికి సుందర్ పిచాయ్ ను సరైన ఎంపికగా వారు భావించి.. అతడి పేరును ప్రకటించారు. 2019లో ఆల్ఫాబెట్ సీఈఓగా కూడా సుందర్ పిచాయ్ బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.
Also Read: Meghalaya Honeymoon Murder: హనీమూన్ మర్డర్ కేసులో మరిన్ని సంచలనాలు.. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా ఉందే!
సుందర్ విజయాలు
సుందర్ పిచాయ్.. సాంకేతికంగా దూరదృష్టి కలిగిన వ్యక్తి. ఇది గూగుల్ ను క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్ (AI), హార్డ్ వేర్ రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేసింది. సుందర్ నాయకత్వంలో గూగుల్ ఏఐ ఆధారిత ఉత్పత్తులు.. గూగుల్ అసిస్టెంట్, గూగుల్ ట్రాన్స్‌లేట్ వంటి గణనీయమైన పురోగతిని సాధించాయి. సుందర్ నాయకత్వంలోని గూగుల్ సంస్థ.. సాంకేతిక రంగంలో ప్రస్తుతం అగ్రగామిగా కొనసాగుతోంది. ముఖ్యంగా AI అండ్ క్లౌడ్ రంగాలలో తిరుగులేని శక్తిగా అవతరించింది. అటు గూగుల్ తో పాటు వ్యక్తిగతంగానూ తన స్ట్రేచర్ ను సుందర్ అమాంతం పెంచుకున్నారు. టైమ్ మ్యాగజైన్ ‘100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్’ జాబితాలో చోటు సంపాదించారు.