Meghalaya Honeymoon Murder: హనీమూన్ మర్డర్ (Honeymoon murder) కేసు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కట్టుకున్న భార్యే.. భర్తను సుపారి ఇచ్చి మరి హత్య చేయించడం అందరినీ షాక్ గురిచేస్తోంది. అయితే ఈ కేసుకు సంబంధించి తాజాగా కీలక విషయాలు వెలుగు చూశాయి. మృతుడి పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. మృతుడు రాజా రఘువంశీని పదునైన ఆయుధంతో తలపై రెండు సార్లు బలంగా కొట్టినట్లు తేలింది. నిందితుల్లో ఒకరైన రాజ్ కుశ్వాహా అనే వ్యక్తితో మృతుడు భార్య సోనమ్ ప్రేమ వ్యవహారం నడుపుతోందని పోలీసులు నిర్ధారించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సోనమ్ సహా మరో ముగ్గురు విక్కీ ఠాకూర్, ఆకాశ్, ఆనంద్ అరెస్ట్ అయ్యారు.
విచారణ అధికారి ఏమన్నారంటే?
హనీమూన్ కపుల్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. మేఘాలయా ప్రభుత్వం దీనిపై స్పెషల్ ఇన్ వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసింది. సిట్ ఉన్నతాధికారి హెబర్ట్ పైనియడ్ ఖర్కోంగోర్ పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ గురించి ప్రస్తావిస్తూ.. పదునైన ఆయుధంతో రెండుసార్లు తలపై బలంగా కొట్టడం వల్లే రాజా రఘువంశీ మరణించినట్లు తేల్చారు. అసలు హత్య జరిగిన తీరు, ప్రతి విషయాన్ని అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కుట్ర మేఘాలయకే పరిమితం కాలేదని విచారణాధికారి అనుమానం వ్యక్తం చేశారు.
సోనమ్ తండ్రి రియాక్షన్
హనీమూన్ మర్డర్ పరిణామాలపై సోనమ్ తండ్రి దేవీ సింగ్ స్పందించారు. తన కుమార్తెకు ఏ పాపం తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. సోనమ్ పై తనకు పూర్తి నమ్మకం ఉందని.. ఇరుకుటుంబాల అంగీకారంతోనే రాజా రఘువంశీతో ఆమె పెళ్లి జరిగిందని స్పష్టం చేశారు. ఇంతవరకు సోనమ్ తను మాట్లాడలేదని.. ఆమె తన భర్తను ఎందుకు చంపుకుంటుందని పేర్కొన్నారు. మేఘాలయ పోలీసులు అబద్దం చెప్తున్నారని.. ఆమెను మేఘాలయాలోనే అరెస్ట్ చేసినట్లు వారు అబద్దం చెబుతున్నారని ఆమె తండ్రి దేవీ సింగ్ స్పష్టం చేశారు. ఈ కేసును సీబీఐ ద్వారా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి సీబీఐ విచారణకు రిక్వెస్ట్ చేస్తానని చెప్పారు.
సోదరుడు స్పందన ఇదే
మరోవైపు సోనమ్ సోదరుడు విపిన్ సైతం హనీమూన్ మర్డర్ పై స్పందించారు. తొలుత సోనమ్ తమకు కాల్ చేసి తన భర్త హత్యకు గురైనట్లు చెప్పిందని పేర్కొన్నారు. తాము ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారని అన్నారు. ఆమె చాలా భయపడిపోయిందని పేర్కొన్నారు. సోనమ్ లోకేషన్ యూపీలో ఉందన్న ఆమె సోదరుడు.. అనుమానితుల్ని మధ్యప్రదేశ్ లో అరెస్ట్ చేశారని చెప్పారు. ఇది చూస్తే చాలా డిఫరెంట్ గా కనిపిస్తోందని అన్నారు. తమ సోదరి చెప్పిన తర్వాత అసలు ఏం జరిగిందనే దాని గురించి నమ్ముతామని విపిన్ స్పష్టం చేశారు.
మేఘాలయ టూరిజంపై ప్రశ్నలు
ఇదిలా ఉంటే రాజా రఘువంశీ, సోనమ్ వివాహం మే నెల 11వ తేదీన జరిగింది. 20న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అయితే 23 నుంచి ఇద్దరి ఆచూకి మిస్ కావడంతో మేఘాలయ పోలీసులు రంగంలోకి దిగారు. 9 రోజుల తర్వాత అంటే జూన్ 2న పోలీసులు.. రాజా రఘువంశీ మృతదేహాన్ని గుర్తించారు. ఒక లోయలో ఆయన శరీరాన్ని కనుగొన్నారు. అయితే ఈ విషయం బయటకు రాగానే నెటిజన్లు పెద్ద ఎత్తున విచారం వ్యక్తం చేశారు. రాజా – సోనమ్ హనీమూన్ విషాదంతో ముగిసిందని.. వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే మేఘాలయ టూరిజం పైనా నెటిజన్లు విమర్శలు గుప్పించారు. పర్యటకుల రక్షణను అక్కడి పోలీసులు గాలికి వదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తొలి నుంచి సోనమ్‌పై అనుమానాలు
అయితే భర్త బాడీ మాత్రమే కనిపించి.. భార్య అదృశ్యం కావడంపై మేఘాలయ పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సోనమ్ తన భర్తను హత్య చేసి పారిపోయి ఉండొచ్చని తొలి నుంచి అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే సోనమ్.. యూపీ ఘాజీపూర్ లోని నంద్ గంజ్ పోలీసు స్టేషన్ లో లొంగిపోయారని మేఘాలయా పోలీసు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. సోనమ్ ను తమ అదుపులోకి తీసుకొని రాజా రఘువంశీ హత్యపై మరిన్ని విషయాలను వెలికి తీయనున్నట్లు చెప్పారు.
Also Read: Pawan Kalyan: బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్.. పవన్ కళ్యాణ్ తో పోటీ పడనున్న బాలయ్య
నెటిజన్ల ప్రశ్నలు
హనీమూన్ మర్డర్ కేసుపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రాజా – సోనమ్ మ్యారేజ్ పై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సోనమ్ పెళ్లి ఆమె ఇష్టా ఇష్టాలకు వ్యతిరేకంగా జరిగిందా? పెద్దల ఒత్తిడి మేరకే ఆమె అంగీకరించిందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజా చనిపోయే ముందు అతడి గుండెకోతను తాను అర్థం చేసుకోగలనని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. భర్త కంటే ప్రియుడే ముఖ్యమని భావిస్తే.. చెప్పాపెట్టకుండా అతడితోనే వెళ్లి పోవాల్సిందని మరొకరు కామెంట్ పెట్టారు. అంతేగాని హత్యలు చేసి అతడ్ని ఎంతగానో ఇష్టపడే కుటుంబం నుంచి వారిని వేరు చేయవద్దని హితవు పలికారు.