Event Organiser Arrest: అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్ కత్తా పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగిన సంగతి తెలిసిందే. సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీని చూసేందుకు వచ్చిన అభిమానులు.. మైదానంలో వీరంగం సృష్టించారు. కుర్చీలు, వాటర్ బాటిల్స్ విసిరేస్తూ గందరగోళం చేశారు. అయితే మెస్సీ ఫుట్ బాల్ ఆడతారని, గ్రౌండ్ చుట్టూ తిరుగుతారని నిర్వాహకులు అంతకుముందు ప్రకటించారు. అవేమి జరగకపోవడంతో అభిమానులు మైదానంలోకి వచ్చి రచ్చ చేశారు. దీంతో సీఎం మమతా బెనర్జీ మెస్సీని క్షమాపణలు సైతం కోరారు. అదే సమయంలో ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మెస్సీ ఈవెంట్ ఆర్గనైజర్ ను అరెస్ట్ చేశారు.
టికెట్ డబ్బులు వాపస్
లియోనెల్ మెస్సీ కోల్ కత్తా పర్యటనకు శతద్రు దత్తా ఈవెంట్ ఆర్గనైజర్ గా ఉన్నారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు నగర అడిషన్ డైరెక్టర్ జనరల్ జావెద్ షమీం ధృవీకరించారు. ‘శతద్రు దత్తా ఇనిషియేటివ్’ కింద మెస్సి ఈవెంట్ టికెట్లు అతడు విక్రయించాడని పేర్కొన్నారు. ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తామని నిర్వహకుడు చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే ఒక్కో టికెట్ ను రూ. 5000 నుంచి రూ.25000 వరకూ విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే మెస్సీపై చూసేందుకు ఏమాత్రం డబ్బు లెక్కచేయకుండా వేలాదిమంది స్టేడియానికి తరలించారు. ఈ క్రమంలో సాల్ట్ లేక్ స్టేడియానికి మెస్సీ రాగానే ఆయన చుట్టూ భద్రతా సిబ్బంది, రాజకీయ ప్రముఖులు, మాజీ ఆటగాళ్లు గుమ్మికూడారు. దీంతో మెస్సీని కళ్లారా చూద్దామనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. దీనికి తోడు భద్రతా కారణాల రిత్యా 10 నిమిషాల్లోనే మెస్సీని స్టేడియం నుంచి నిర్వాహకులు తీసుకెళ్లారు. దీంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. మైదానంలోకి దూసుకొచ్చి నిరసనకు దిగారు.
స్టేడియంలో ఏం జరిగింటే?
స్టేడియం నుంచి మెస్సీ బయటకు వచ్చిన కొన్ని నిమిషాల్లోనే మైదానంలో పరిస్థితి అదుపు తప్పింది. ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం కోల్‌కతాకు వచ్చిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, మాజీ భారత క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. తీవ్ర గందరగోళం కారణంగా ఈవెంట్ లో పాల్గొనలేకపోయారు. మెస్సీ సన్మాన కార్యక్రమాన్ని సైతం రద్దు చేశారు. కొంతమంది అభిమానులు మైదానంలోకి చొచ్చుకొచ్చి.. కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన షామియానాలను ధ్వంసం చేశారు. ఒక అభిమాని మాట్లాడుతూ ఈ కార్యక్రమ నిర్వాహకులు తమను మోసం చేశారని ఆరోపించారు.
Also Read: Messi India Visit: మెస్సీ భారత్‌కు ప్రయాణించిన విమానం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారేమో!
సీఎం మమతా బెనర్జీ క్షమాపణ
మరోవైపు ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ క్షమాపణ చెప్పారు. ‘ఈ రోజు సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన గందరగోళం నన్ను తీవ్రంగా కలిచివేసింది. షాక్‌కు గురిచేసింది. నా అభిమాన ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీని చూడటానికి వేలాది క్రీడాభిమానుల తరహాలోనే నేను కూడా స్టేడియంకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఈ దురదృష్టకర ఘటనకు గాను లియోనెల్ మెస్సీకి అలాగే అన్ని క్రీడాభిమానులకు, అతని అతని ఫ్యాన్స్ కు హృదయపూర్వకంగా క్షమాపణ చెబుతున్నాను. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆశీమ్ కుమార్ రాయ్ అధ్యక్షతన ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నాను. ఇందులో చీఫ్ సెక్రటరీ, అదనపు చీఫ్ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. బాధ్యులను గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి’ అని మమతా ఆదేశాలు జారీ చేశారు.

