Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయంగా మారిన వేళ.. జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా? ఒడినా? ఒరిగేదేమి లేదని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత చేపట్టి జనం బాట కార్యక్రమం.. మెదక్ జిల్లాకు చేరిన నేపథ్యంలో అక్కడి రెడ్డిపల్లి భూ నిర్వాసిత రైతులతో కవిత మాట్లాడారు. వారి సమస్యలను స్వయంగా అడిగితెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు జూబ్లీహిల్స్ ఎన్నికలపై స్పందించారు.
రైతులకు అండగా కవిత..
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని రెడ్డిపల్లి గ్రామంలో కల్వకుంట్ల కవిత పర్యటించారు. అభివృద్ధి మాటున భూములు కోల్పోతున్న రైతులతో ఆమె మాట్లాడారు. కోట్లాది రూపాయాలు విలువ చేసే భూములను ప్రభుత్వం నామమాత్రం ధర ఇచ్చి స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని ఈ సందర్భంగా రైతులు కవిత దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలు విన్న తర్వాత కవిత మీడియాతో మాట్లాడారు. అభివృద్ధికి ఇక్కడి రైతులు వ్యతిరేకంగా కాదన్న ఆమె.. ఇక్కడి ఎకర భూమి ఎకరానికి రూ.2 నుంచి రూ.2.5 కోట్ల వరకూ పలుకుతోందని ఆమె అన్నారు. కాబట్టి మార్కెట్ ధరకు దగ్గరగా ఉన్న నగదును పరిహారంగా చెల్లిస్తే బాగుంటుందని చెప్పారు. రైతుల సమస్యలపై మరింత అధ్యయనం చేసి.. ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానని కవిత అన్నారు.
జూబ్లీహిల్స్ కౌంటింగ్ పై..
హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై కవితకు ప్రశ్న ఎదురైంది. దీంతో కవిత ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. జూబ్లీహిల్స్ లో ఎవరు గెలిచినా ప్రజలకు ఉపయోగం లేదని ఆమె వ్యాఖ్యానించారు. పైగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చాలా చిన్న అంశమని వ్యాఖ్యానించారు.
‘సరైన ధర ఇస్తేనే సంతకం’
అయితే నర్సాపూర్ నియోజకవర్గం తొలి రోజు పర్యటనలో తన దృష్టికి మూడు రకాల సమస్యలు వచ్చినట్లు కవిత పేర్కొన్నారు. మూడు రకాల అంశాలు ఇక్కడ నా దృష్టికి వచ్చాయని తెలిపారు. ‘ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన సర్వేను మార్చారు. హైటెన్షన్ వైర్లు, రైల్వే లైన్ విషయంలో కూడా అదే విధంగా చేశారు. నిర్వాసితుల పొలాలు, ఇళ్లకు సరైన ధరలు ఇవ్వటం లేదు. సరైన ధర వస్తేనే సంతకం పెడతామని రైతులు అంటున్నారు. మీ సోదరిగా చెబుతున్నా మీరు మాట్లాడినవి అన్ని న్యాయమైన విషయాలే. పైగా ఇదే జిల్లాలో మల్లన్న సాగర్ నిర్వాసితులు ఇక్కడ భూములు కొనుక్కున్నారు. వారి భూములు మరోసారి పోయే పరిస్థితి ఉంది’ అని కవిత అన్నారు.
Also Read: Jubilee Hills Bypoll Results: జూబ్లీహిల్స్‌లో గెలుపు దిశగా కాంగ్రెస్.. టీపీసీసీ చీఫ్, మంత్రుల రియాక్షన్ ఇదే
అన్యాయం జరగకుండా ప్రత్యేక శ్రద్ధ
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ లో పెద్దల వాళ్ల భూములను కాపాడేందుకు సర్వేను ఇష్టానుసారంగా మార్చుతున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది రాజకీయం కాదు. ఇప్పుడు ఓట్లు లేవు. రైతులకు మంచి చేయాలనే నేను వచ్చాను. మీ సమస్య కోసం అవసరమైతే హైదరాబాద్ లో పోరాడుదాం. అవసరమనుకున్న రోజు ఆర్ఆర్ఆర్ సమస్య పై ఎవరినీ కలువాలో వారిని కలుద్దాం. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యపై నిన్న హైదరాబాద్ లో ఎండీని కలిసి సమస్య వివరించాం. ప్రాజెక్ట్ లలో భాగంగా కళాకారులు, పేదవాళ్ల ఇళ్లు పోతున్నాయని తెలిసింది. వాళ్లకు అన్యాయం జరగకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వాన్ని కోరతాం’ అని కవిత అన్నారు.
