Jubliee Hills Bypoll Results: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ విజయం ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ స్పందించారు. ముందుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడుపై సంతోషం వ్యక్తం చేశారు.
‘భారీ మెజారిటీతో గెలవబోతున్నాం’
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయంగా కనిపిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ‘జూబ్లి హిల్స్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువ నమోదు అయింది. జూబ్లీహిల్స్ లో తక్కువ ఓటు శాతం నమోదైంది. ఇది మంచి పరిణామం కాదు. ఎక్కువ మంది యువత తమ ఓటు హక్కును వినిగించుకోలేదు. ప్రతీ ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఎంతో విలువైనది. జూబ్లి హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కోసం బీజేపీ డమ్మీ క్యాండెట్ ని నిలబెట్టింది. కిషన్ రెడ్డి జూబ్లి హిల్స్ లో చేసిందేమి లేదు. మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది’ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
కొండ సురేఖ రియాక్షన్
మరోవైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ‘ఎన్నికల ప్రచారంలోనే నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైంది. రెండు సార్లు ఓడినా, ప్రజల్లో ఉంటూ మంచిపేరు తెచ్చుకున్నాడు. ఏ ఇంటికి వెళ్ళినా నవీన్ యాదవ్ గెలుస్తాడని చెప్పారు. మా పార్టీ బీసీ నినాదం కూడా గెలుపునకు సహకరించింది. బీఆర్ఎస్ పని పూర్తిగా ఖతమైనట్లే. పెయిడ్ ఆర్టిస్టులతో సోషల్ మీడియాలో ప్రచారం చేసి దెబ్బతిన్నారు. గెలుపు తర్వాత కూడా నవీన్ యాదవ్ ప్రజల మనిషి లాగే ఉండాలి. ఎమ్మెల్యేను అనే అహంకారం వస్తే భవిష్యత్తు ఆగమవుతుంది. నవీన్ యాదవ్ ప్రజల సేవలో ఉంటూ మరెన్నో విజయాలు సాధించాలి’ అని ఆకాంక్షించారు.
Also Read: Bihar Elections 2025: బిహార్‌లో వార్ వన్ సైడ్.. 160+ సీట్ల గెలుపు దిశగా ఎన్డీయే.. అమిత్ షా జోస్యం నిజమైందా?
పొన్నం ఏమన్నారంటే?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను గెలిపించబోతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సానుభూతి, డైవర్షన్ పాలిటిక్స్ తో జూబ్లీహిల్స్ గెలవాలని బీఆర్ఎస్ భావించినట్లు చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సన్నబియ్యం, రేషన్ కార్డుల పంపిణీ, ఉచిత బస్సు, వడ్డీ లేని రుణాలు తదితర సంక్షేమాల ముందు అవి నిలవలేకపోయాయని చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతామన్న అసహనంతోనే ఆ పార్టీ రిగ్గింగ్ బీఆర్ఎస్ రిగ్గింగ్ ఆరోపణలు చేసిందని మంత్రి దుయ్యబట్టారు. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీ తో గెలవబోతోందని చెప్పారు.
