Al-Falah Students: దిల్లీ కారు బ్లాస్ట్ వెనుక అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన వైద్యులు ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు తేల్చిన సంగతి తెలిసిందే. దర్యాప్తు వర్గాలకు పట్టుబడిన నలుగురు వైద్యుల్లో ఇద్దరు.. హర్యానా ఫరిదాబాద్ లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం (Al-Falah University)లో పాఠాలు భోదించారు. డాక్టర్ ఉమర్ మహమ్మద్, డాక్టర్ ముజమ్మిల్ సయీద్ అక్కడ ప్రొఫెసర్లుగా పనిచేసినట్లు దర్యాప్తు వర్గాలు ధ్రువీకరించాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రొఫెసర్లతో తమకు ఉన్న ఆసక్తికర అనుభవాలను విద్యార్థులు పంచుకున్నారు.
‘క్లాసులో లింగ వివక్ష చూపేవారు”
టెర్రర్ డాక్టర్ల గురించి మరింత సమాచారాన్ని సేకరించేందుకు దర్యాప్తు వర్గాలు.. విద్యార్థులను ప్రశ్నించాయి. ఈ క్రమంలో విద్యార్థులు కీలక విషయాలు వెల్లడించారు. స్టూడెంట్స్ ప్రకారం.. ఉమర్, ముజమ్మిల్ తరగతి గదిలో లింగ వివక్షను ఎక్కువగా చూపించినట్లు తెలిసింది. పాఠ్యాంశాల భోదనలో తాలిబన్ విధానాన్ని వారు అనుసరించారు. ఓ ఎంబీబీఎస్ విద్యార్థి మాట్లాడుతూ ‘మా బ్యాచ్ కు ఉమర్ సార్ పాఠాలు చెప్పేవారు. ఆయన క్లాసులోకి వచ్చి కూర్చోగానే అమ్మాయిలు, అబ్బాయిలు సెపరేట్ అయ్యేవారు. వేర్వేరుగా కూర్చునేవాళ్లం’ అని తెలిపారు. మరోవైపు ఉమర్ సార్ ఇక్కడే ఉండేవారంటూ ఆయన గదిని సైతం విద్యార్థులు చూపించడం గమనార్హం.
మహిళా టెర్రర్ డాక్టర్ గురించి..
దిల్లీ పేలుడుకి సూత్రదారిగా ఉన్న మహిళా వైద్యరాలు షాహీన్ సయీద్ గురించి ఓ విద్యార్థి మాట్లాడాడు. ‘మేము షాహీన్ మేడం వద్ద చదివాం. ఆమె బాగా బోధించేవారు’ అని చెప్పాడు. ఎర్ర కోట పేలుడు ఘటన తర్వాత.. అల్ ఫలాహ్ కు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు మరో విద్యార్థి పేర్కొన్నాడు. అయితే యూనివర్శిటీలో విద్యా బోధన, మౌలిక సదుపాయాల పట్ల విద్యార్థులు చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తేలింది. ‘ఇక్కడ బోధన బాగోలేదు. సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రాక్టికల్స్ కూడా సమయానికి నిర్వహించడం లేదు’ అని ఒక స్టూడెంట్ వాపోయాడు.
ఫ్యాకల్టీ ఏం చెప్పారంటే?
మరోవైపు ఉమర్ గురించి విశ్వవిద్యాలయ సిబ్బంది మరికొన్ని విషయాలను పంచుకున్నారు. అతడు చాలా మిత భాషి అని.. ఎవరితోనూ పెద్దగా కలిసేవాడు కాదని అన్నారు. ఓ ప్రొఫెసర్ మాట్లాడుతూ ‘నేను ఒక వారం ముందే ఇక్కడ చేరాను. నేనే ఇక్కడ చాలా జూనియర్ డాక్టర్. కానీ వారిలో ఎవరినీ నేను ఎప్పుడూ చూడలేదు’ అని ఒక ఫ్యాకల్టీ అన్నారు. అయితే ముజమ్మిల్, ఉమర్ ఇద్దరూ కూడా ఎప్పుడూ కూడా అనుమానస్పదంగా ప్రవర్తించలేదని యూనివర్సిటీ సిబ్బందిలో ఒకరు చెప్పారు.
Also Read: Election Celebrations: జూబ్లీహిల్స్ రిజల్ట్ పై పార్టీ శ్రేణులకు డీసీసీలకు కీలక ఆదేశాలు..!
అద్దెకు ఇచ్చిన ఇంటి ఓనర్
ఉగ్రకూటలో ప్రధాన సూత్రదారిగా ఉన్న ముజమ్మిల్ క్యాంపస్ వెలుపల ఉన్న కాలనీలో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. దిల్లీ పేలుడుకు కొద్ది రోజుల ముందు వరకూ ఇక్కడే పేలుడు పదార్థాలను దాచినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. అయితే ఇంటిని అద్దెకు తీసుకునే క్రమంలో తన గుర్తింపు బయటపడకుండా ముజమ్మిల్ జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. ఇంటి యజమాని మాట్లాడుతూ ‘ఓ రోజు ముజమ్మిల్ నా వద్దకు వచ్చాడు. ఇల్లు చూసుకొని నచ్చిందని చెప్పాడు. ఒంటరింగా ఉంటే రూ.1200, ఫ్యామిలీతో ఉంటే రూ.1500 అని చెప్పాను. ఆ రోజు రాత్రి 9 గం.కు వచ్చి రెండు నెలల అద్దె ముందే ఇచ్చివెళ్లిపోయాడు’ అని యజమాని మద్రాసి చెప్పుకొచ్చారు.
