Nur Khan Airbase: ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. 26 మంది అమాయక పర్యాటకులను పొట్టనపెట్టుకున్నారు. దీని వెనుక పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థల ప్రమేయం ఉందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్, పీవోకేలోని పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. పాకిస్థాన్ సేనలు ప్రతిఘటించడంతో ఇరు దేశాల మధ్య సైనిక సంఘర్షణ జరిగింది. ఈ సంఘర్షణలో భారత బలగాలు సంపూర్ణ ఆధిపత్యం సాధించాయి. పాక్‌కు చెందిన కీలకమైన ఎయిర్‌బేస్‌లను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ధ్వంసం చేసింది. ఈ జాబితాలో నూర్ ఖాన్ అనే ఎయిర్‌బేస్ (Nur Khan Airbase) కూడా ఉంది.
నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ వద్ద తాజా పరిస్థితిని శాటిలైట్స్ ద్వారా పరిశీలించగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మే నెలలో భారత సేనలు ధ్వంసం చేసిన నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ వద్ద ప్రస్తుతం పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఎయిర్‌బేస్ పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. దాయాది వాయుసేనకు ఇది చాలా ముఖ్యమైన స్థావరంగా ఉంది. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ముఖ్యమైన అసెట్స్ ఇక్కడ ఉన్నాయి.
నూర్ ఖాన్ బేస్‌లో ప్రత్యేక లక్ష్యాల కోసం సిద్ధంగా ఉంచిన రెండు ట్రక్కులను లక్ష్యంగా చేసుకుని మే 10న భారత సేనలు క్షిపణి దాడులు చేశాయి. ఈ దాడిలో ట్రక్కులతో పాటు కాంప్లెక్స్ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ కాంప్లెక్స్‌ను డ్రోన్ల నియంత్రణ కోసం ఉపయోగించే కమాండ్ అండ్ కంట్రోల్ యూనిట్ కావొచ్చని భావిస్తున్నారు. నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌ను ధ్వంసం చేసేందుకు ఎలాంటి క్షిపణిని ఉపయోగించామన్నది భారత సేనలు ఇంతవరకు బయటకు చెప్పలేదు. అయితే, బ్రహ్మోస్ లేదా స్కాల్ప్ క్షిపణులు లేదా రెండూ వాడి ఉంటారని విశ్లేషణలు ఉన్నాయి.
Read Also- CM Revanth Reddy: వందేళ్లలో రానంత వరద.. కామారెడ్డికి ప్రత్యేక ప్యాకేజీ.. సీఎం రేవంత్ హామీ
నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌కు చెందిన పాత, కొత్త శాటిలైట్ ఫొటోలను పరిశీలించి చూడగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. భారత సేనల దాడికి ముందు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ కాంప్లెక్స్ వద్ద రెండు ట్రాక్టర్ ట్రక్కులు, వాటికి రక్షణ కోసం రేకుల షెల్టర్ కనిపించాయి. మే 10 తర్వాత తీసిన శాటిలైట్ ఫొటోలో ఆ రెండు ట్రక్కులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పక్కనున్న భవనాలపై కూడా తీవ్ర ప్రభావం పడి నష్టం వాటిల్లడం స్పష్టంగా కనిపించింది. మే 17 నాటికి, దాడికి గురైన ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. తాజాగా, సెప్టెంబర్ 3 తీసిన శాటిలైట్ ఫొటోలో అక్కడ కొత్త నిర్మాణాలు ప్రారంభమైనట్టు స్పష్టమవుతోంది. కొత్త గోడల నిర్మాణం కనిపిస్తోంది.
కాగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సుఖోయ్-30 (Su-30) ఫైటర్లు నుంచి ప్రయోగించారు. ఇక, స్కాల్ప్ క్షిపణులను రఫేల్ యుద్ధ విమానాల నుంచి ప్రయోగించారు.