Russia Ukraine War: రష్యాకు స్టూడెంట్ వీసాపై వెళ్లిన గుజరాత్‌కు చెందిన ఓ విద్యార్థి, రష్యా సైన్యంలో చేరొద్దని భారతీయ యువతకు హెచ్చరిక జారీ చేశాడు. డ్రగ్స్ కేసులో ఇరికించి, బలవంతంగా రష్యా ఆర్మీలో చేరేలా చేశారని అతడు ఆరోపించాడు. ఉక్రెయిన్ సేనలకు లొంగిపోయిన అనంతరం విడుదలైన వీడియోల నుంచి అతడి వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది.
గుజరాత్‌లోని మోర్బీ జిల్లాకు చెందిన సాహిల్ మహమ్మద్ హుస్సేన్ 2024లో ఉన్నత విద్య కోసం రష్యాకు వెళ్లాడు. చదువులతో పాటు జీవనోపాధి కోసం ఓ కూరియర్ కంపెనీలో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపాడు. అయితే, అదే సమయంలో రష్యన్ పోలీసులు తనపై తప్పుడు డ్రగ్స్ కేసు పెట్టారని సాహిల్ ఆరోపించాడు.
Also Read: Pade Pade Song: సంగీత ప్రియులను కట్టి పడేస్తున్న ఆది సాయికుమార్ ‘శంబాల’ నుంచి పదే పదే సాంగ్..
డ్రగ్స్ కేసు నుంచి బయటపడాలంటే రష్యా ఆర్మీలో చేరాలని అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని అతడు తెలిపాడు. “ జైలుకు పంపకుండా ఉండాలంటే రష్యా సైన్యంలో చేరాలని చెప్పారు. తప్ప మరో మార్గం లేక ఆ ఒప్పందాన్ని అంగీకరించాను ” అని సాహిల్ వీడియోలో వెల్లడించాడు.
సుమారు 15 రోజుల శిక్షణ అనంతరం తనను ఉక్రెయిన్ ఫ్రంట్‌లైన్‌కు పంపారని, అక్కడికి చేరగానే తాను ఉక్రెయిన్ సేనలకు లొంగిపోయానని చెప్పాడు. “ ఫ్రంట్‌లైన్‌కు చేరిన వెంటనే నేను చేసిన మొదటి పని ఉక్రెయిన్ ఆర్మీకి సరెండర్ కావడమే ” అని తెలిపాడు.ఉక్రెయిన్ సైన్యం విడుదల చేసిన వీడియోలో సాహిల్ భారత ప్రభుత్వాన్ని తనను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని వేడుకున్నాడు. “ ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు వచ్చారు. నా భద్రతతో కూడిన తిరిగి రావడానికి భారత ప్రభుత్వం పుతిన్‌తో మాట్లాడాలని కోరుతున్నాను ” అని విజ్ఞప్తి చేశాడు. అలాగే, రష్యాకు రావాలనుకునే భారతీయ యువతకు సాహిల్ హెచ్చరిక జారీ చేశాడు. “ నేను తీవ్ర భయంతో, అనిశ్చితిలో ఉన్నాను. ఇక్కడ చాలా మంది స్కామర్లు ఉన్నారు. తప్పుడు డ్రగ్స్ కేసుల్లో ఇరికించే ప్రమాదం ఉంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి ” అని చెప్పాడు.
Also Read: Narendra Modi: ల్యాండింగ్ సాధ్యపడక, వెనక్కి వెళ్లిపోయిన ప్రధాని మోదీ హెలికాప్టర్.. కారణం ఏంటంటే?
మరో వీడియోలో ఆర్థిక, వీసా సమస్యల కారణంగా కొంతమంది రష్యన్ వ్యక్తులతో పరిచయం ఏర్పడిందని, వారు మత్తు పదార్థాల అక్రమ రవాణాతో సంబంధం ఉన్నవారని ఆరోపించాడు. “ నేను ఎలాంటి తప్పు చేయలేదు. కానీ డ్రగ్స్ కేసుల్లో అరెస్టైన కనీసం 700 మందికి రష్యా జైలు అధికారులు ఆర్మీలో చేరితే కేసులు ఎత్తివేస్తామని చెప్పారు” అని వెల్లడించాడు. సాహిల్ లొంగిపోయిన తర్వాత ఉక్రెయిన్ సేనలు అతడి తల్లిని గుజరాత్‌లో సంప్రదించి, ఇలాంటి మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరినట్లు సమాచారం. దీంతో ఆమె ఢిల్లీ కోర్టులో తన కుమారుడి సురక్షిత రాక కోసం పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు ఫిబ్రవరిలో మళ్లీ విచారణకు రానుంది. ఇదిలా ఉండగా, రష్యా సైన్యంలో చేరిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపింది. డిసెంబర్ 5న విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ – రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన చర్చల్లో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు వెల్లడించారు.
“రష్యా ఆర్మీలో ఉన్న భారతీయుల విడుదల కోసం మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి” అని ఆయన తెలిపారు. అలాగే ఇలాంటి ఆఫర్లకు భారతీయులు దూరంగా ఉండాలని ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. రష్యాలో చిక్కుకున్న తమ కుటుంబ సభ్యులను స్వదేశానికి తీసుకురావాలని కోరుతూ పలువురు భారతీయుల కుటుంబాలు ఇటీవల నిరసనలు కూడా చేపట్టాయి.

