Navy New Base: మన దేశానికి పొరుగు దేశాలు పెద్ద సవాళ్లుగా మారుతున్నాయి. ఇప్పటికే ఒక పక్కన పాకిస్థాన్, మరోపక్క చైనా గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నాయి. తాజాగా, ఈ జాబితాలో బంగ్లాదేశ్ కూడా చేరింది. ఆ దేశంతో కూడా మన దౌత్య సంబంధాలు సన్నగిల్లాయి. పక్కలో బల్లాళ్లా తయారైన ఈ మూడు దేశాల పట్ల ఏమాత్రం అలసత్వంతో ఉండకూడదని భారత్ భావిస్తోంది. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని కీలక ప్రాంతమైన హల్దియా వద్ద కొత్త నేవీ బేస్‌ను (Navy New Base) ఏర్పాటు చేయాలని ఇండియన్ నేవీ (Indian Navy) నిర్ణయించింది. తద్వారా బంగాళాఖాతంలో పటిష్ట భద్రత మోహరించాలని డిసైడ్ అయ్యింది. హల్దియాలో కొత్త నేవీ స్థావరాన్ని ఏర్పాటు చేస్తే బంగ్లాదేశ్‌తో పాటు చైనాపై కూడా కన్నేయవచ్చు. ఈ ప్రాంతంలో ఇప్పటికే చైనా నౌకాదళ కార్యకలాపాలు పెరిగాయి.
ప్రస్తుతానికి చిన్న యుద్ధ నౌకల మోహరింపు
ఇప్పటికిప్పుడు భారీ స్థాయి యుద్ధం నౌకలను మోహరించకపోయినా.. చిన్నాపాటి యుద్ధ నౌకలను హల్దియాలో మోహరించి ఉంచాలని నౌకా దళం నిర్ణయించింది. ఈ కొత్త బేస్ ‘నావల్ డిటాచ్‌మెంట్’గా పనిచేస్తుందని రక్షణ వర్గాలు తెలిపాయి. అంటే, హల్దియాలో ప్రస్తుతం ఉన్న డాక్ కాంప్లెక్స్‌ను ఉపయోగించుకొని, పెద్దగా అదనపు ఖర్చులు లేకుండానే త్వరగా అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ఉంది. ఇందుకోసం తొలుత ప్రత్యేక ఏర్పాట్లు, తీరప్రాంతంలో సహాయక సౌకర్యాలను నిర్మిస్తారు. వెనువెంటనే ఇక్కడ చిన్నపాటి యుద్ధ నౌకలను మోహరిస్తారు. ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ క్రాఫ్ట్‌లు, 300 టన్నుల బరువు ఉండే ‘న్యూ వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్‌లను’ మోహరించి ఉంచనున్నారు. ఈ నౌకలు గంటకు 40 నుంచి 45 వరకు నాటికల్ మైళ్ల వేగంతో దూసుకెళతాయి. ఈ నౌకల్లో సీఆర్ఎన్-91 అనే గన్‌లు ఉంటాయి. వీటికి అధునాతన వ్యవస్థలను కూడా అమర్చుతారు. కొత్త నేవీ బేస్‌లో దాదాపుగా 100 మంది అధికారులు, నావికులు ఉంటారు. అయతే, పూర్తి స్థాయి కమాండ్‌గా కాకుండా, వ్యూహాత్మక కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇక్కడ మోహరించనున్న నౌకలు తీరప్రాంత పెట్రోలింగ్, హార్బర్ సెక్యూరిటీ, ప్రత్యేక ఆపరేషన్లు చేపడతాయి.
Read Also- AI Voice Clone Scam: ఏఐ వాడుకొని కజిన్ వాయిస్ క్లోన్ చేసి.. కేటగాళ్లు చేసిన లేటెస్ట్ స్కామ్ ఇదే!
హల్దియా స్థావరం ఎంతో కీలకం
హల్దియా స్థావరం చాలా వ్యూహాత్మకమైనదని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. కోల్‌కతాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హుగ్లీ నది గుండా ఎక్కువదూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండానే, నేరుగా బంగాళాఖాతానికి చేరుకోవచ్చు. ఇక్కడ బేస్ ఏర్పాటు చేసుకుంటే, హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా నౌకల కదలికలను గుర్తించవచ్చునని అంటున్నారు. ఇటీవలి కాలంలో చైనా నౌకల కదిలికలు పెరిగిపోయింది. మరోవైపు, బంగ్లాదేశ్ నుంచి సముద్ర మార్గాల ద్వారా మన దేశంలోకి జరిగే అక్రమ చొరబాట్లను అట్టుకట్ట వేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు. భౌగోళికంగా కూడా ఇది చాలా వ్యూహాత్మక ప్రాంతం. బంగ్లాదేశ్‌లో చైనా మౌలిక సదుపాయాల నిర్మాణాలు, పాకిస్థాన్‌తో చైనా రక్షణ భాగస్వామ్యం నేపథ్యంలో ఈ ప్రాంతంలో నిఘా పెంచడం చాలా ముఖ్యమని రక్షణరంగ నిపుణులు అంటున్నారు.

