Tik Tok In India: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) విధిస్తున్న ప్రతీకార సుంకాలను ఎదుర్కొనేందుకు భారత్ – చైనా ఒక్కటవుతున్న సంగతి తెలిసిందే. గల్వాన్ లోయ ఉద్రిక్తతల (Galwan Valley clashes) తర్వాత తిరిగి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ టిక్ టాక్ పై విధించిన నిషేధాన్ని భారత్ ఎత్తివేయనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం భారత్ లో టిక్ టాక్ సైట్ ఓపెన్ అయ్యిందంటూ కూడా కొందరు యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే దీనిపై కేంద్ర వర్గాలు స్పందిస్తూ కీలక ప్రకటన చేశాయి.
టిక్ టాక్ రీఎంట్రీపై క్లారిటీ
భారత్ లో టిక్ రీఎంట్రీపై కేంద్ర వర్గాలు స్పందించాయి. కొందరు టిక్ టాక్ వెబ్ సైట్ ను యాక్సెస్ చేయగలిగామంటూ చేసిన కామెంట్స్ ను కొట్టిపారేశాయి. ఈ ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని.. భారత ప్రభుత్వం టిక్‌టాక్‌ను అన్‌బ్లాక్ చేయడానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశాయి. కాబట్టి టిక్ టాక్ విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి.
యాక్సెస్ అయినా..
ఇదిలా ఉంటే టిక్ టాక్ వెబ్ సైట్ కొందరు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చినప్పటికీ వారు లాగిన్ కావడం, వీడియోలను అప్ లోడ్ చేయడం లేదా వీక్షించడం వంటివి చేయలేకపోయారు. చైనాకు చెందిన ఈ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ ప్రస్తుతం యాప్ స్టోర్లలో కూడా అందుబాటులో లేదు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్.. ఎప్పటికప్పుడు టిక్ టాక్ సైట్ ను నిరోధిస్తూనే ఉన్నాయని టెలికాం శాఖ వర్గాలు సైతం తెలిపాయి. అయినప్పటికీ కొందరు దానిని ఎలా యాక్సెస్ చేయగలిగారు అన్న దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
చైనాతో బంధం బలోపేతం
2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత భారత్ – చైనా సంబంధాలు బాగా దిగజారాయి. అయితే ఈ వారం ప్రారంభంలో ఇరు దేశాలు.. స్థిరమైన ద్వైపాక్షిక సంబంధాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పలు చర్యలను ప్రకటించాయి. ఇందులో సరిహద్దు ప్రాంతంలో శాంతి పరిరక్షణ, సరిహద్దు వాణిజ్యం పునఃప్రారంభం, పెట్టుబడి ప్రవాహాల ప్రోత్సాహం, డైరెక్ట్ విమాన సర్వీసులను వీలైనంత త్వరగా తిరిగి ప్రారంభించడం ఉన్నాయి.
Also Read: Suravaram Sudhakar Reddy: సీపీఐ అగ్రనేత నేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత
నెలాఖరులో చైనాకు ప్రధాని
ఇదిలా ఉంటే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు చైనాలో పర్యటించనున్నారు. తియాంజిన్‌లో జరుగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping) ఇచ్చిన ఆహ్వానం మేరకు ప్రధాని చైనాకు వెళ్లబోతున్నారు. కాగా 2020 జూన్ 15న జరిగిన గల్వాన్ లోయ ఘర్షణకు ప్రతిగా చైనాకు చెందిన టిక్ టాక్ సహా 59 యాప్ లపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.