PM Modi – Trump: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత భారత్ – పాక్ మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత ఈ వివాదం తారా స్థాయికి చేరింది. రెండు దేశాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగుతాయా అన్న పరిస్థితులు తలెత్తాయి. ఆ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి ఇరుదేశాలు వెనక్కి తగ్గాయి. అయితే భారత్ – పాక్ (Ind vs Pak) మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. బహిరంగంగా ప్రకటించుకున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ స్పష్టత ఇవ్వాలని విపక్ష పార్టీలో పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ (Prime Minister Modi) తొలిసారి ఈ అంశంపై స్పందించారు. భారత్ – పాక్ మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని తేల్చి చెప్పారు.
మోదీ – ట్రంప్ ఫోన్ కాల్
కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Foreign Secretary Vikram Misri) తాజాగా మీడియాతో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీకి మధ్య 35 నిమిషాల పాటు ఫోన్ కాల్ జరిగిందని పేర్కొన్నారు. వాస్తవానికి జీ 7 శిఖరాగ్ర సదస్సు (G7 Summit) సందర్భంగా మోదీ – ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటి జరగాల్సి ఉందని మిస్రీ తెలిపారు. అయితే ఇరాన్ – ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ అర్థాంతరంగా అమెరికా పయనమైన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో భేటి కుదరకపోవడంతో ఇరు దేశాధినేతలు ఫోన్ లో మాట్లాడుకున్నారని మిస్రీ స్పష్టం చేశారు.
మధ్యవర్తిత్వం అవసరం లేదు: ప్రధాని
ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారని చెప్పారు. ఆ తర్వాత ఇరువురు నేతలు అసలు మాట్లాడుకోలేదని తేల్చి చెప్పారు. ఆ తర్వాత జరిగిన తొలి ఫోన్ కాల్ కావడంతో.. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని మోదీ.. ట్రంప్ కు వివరించారని మిస్రీ తెలిపారు. ఈ సందర్భంగా భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదన్న విషయాన్ని ట్రంప్ కు మోదీ స్పష్టంగా తెలియజేశారని మిస్రీ అన్నారు. పాక్ విజ్ఞప్తితోనే కాల్పులను విరమించామని మోదీ చెప్పారని పేర్కొన్నారు. భారత్ లోని అన్ని రాజకీయ పార్టీలదీ ఒకే స్టాండ్ అని స్పష్టం చేశారు.
Also Read: Maoist Encounter: అడవుల్లో కాల్పుల మోత.. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ!
పాక్ విజ్ఞప్తి మేరకే..
భారత్ – పాక్ మధ్య మే 7-10 మధ్య జరిగిన సైనిక ఘర్షణల మెుత్తం ఎపిసోడ్ లో భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందం లేదా యూఎస్ మధ్యవర్తిత్వం (US Mediation) వంటి అంశాలు ఏ స్థాయిలోనూ చర్చించబడలేదని ట్రంప్ కు మోదీ స్పష్టం చేశారని మిస్రీ తెలిపారు. మరోవైపు కెనడా నుంచి తిరిగి వెళ్తుండగా అమెరికా రావాలని మోదీకి ట్రంప్ ఆహ్వానం పంపినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి చెప్పారు. అయితే అప్పటికే బిజీ షెడ్యూల్ ఉండటంతో తాను రాలేనని ప్రధాని చెప్పారని పేర్కొన్నారు. త్వరలోనే ద్వైపాక్షిక భేటి కావాలని ఇరుదేశాధినేతలు నిర్ణయించినట్లు విక్రమ్ మిస్రీ తెలియజేశారు. మరోవైపు భారత్ లో జరగబోయే క్వాడ్ తదుపరి సమావేశానికి రావాలని ట్రంప్ ను మోదీ ఆహ్వనించారని వివరించారు.