Terrorist Arrest: దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో దాడులు చేయడానికి కుట్రలు పన్నిన ముగ్గురు ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (Gujarat Anti-Terrorist Squad) అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో హైదరాబాద్(Hyderabad) వాసి కూడా ఉన్నాడు. పట్టుబడిన ముగ్గురి నుంచి ఏటీఎస్ అధికారులు ఆయధాలు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
నిఘా వర్గాల హెచ్చరికతో..
పహల్గామ్‌లో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించిన తరువాత భారత్ ఆపరేషన్ సింధూర్ జరిపింది. పాకిస్తాన్‌లోని పలు ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపిన మన వైమానిక దళం వాటిని నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో పలువురు టెర్రరిస్టులు చనిపోయారు. అప్పటి నుంచి ఉగ్ర సంస్థలు భారత్‌లో రక్తపాతం సృష్టించడానికి కుట్రలు చేస్తూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే లష్కర్ ఏ తోయిబా, జైష్ ఏ మహ్మద్(Jaish-e-Mohammed)ఉగ్రవాద సంస్థలు కాశ్మీర్‌లో దాడులకు కుట్రలు చేస్తున్నట్టుగా ఇటీవల నిఘా వర్గాలు గుర్తించాయి. అన్ని రాష్ట్రాల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ఈ క్రమంలో గుజరాత్(Gujarat) ఏటీఎస్ అధికారులు ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టారు.
అదాలజ్ టోల్ ప్లాజా దగ్గర..
హైదరాబాద్‌కు చెంది వేర్వేరు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న అహ్మద్ మొహియుద్దీన్ అహ్మదాబాద్‌కు వస్తున్నట్టుగా ఏటీఎస్ అధికారులకు తెలిసింది. దాంతో అదాలజ్ టోల్ ప్లాజా దగ్గర నిఘా పెట్టి మొహియుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో అతను వెల్లడించిన వివరాల మేరకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు టెర్రరిస్టులు ఆజాద్ సులేమాన్ షేక్, మహ్మద్ సుహైల్ సలీంఖాన్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రెండు గ్లోక్ పిస్టళ్లు, 30 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
చైనాలో ఎంబీబీఎస్
పట్టుబడ్డ ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ చైనాలో ఎంబీబీఎస్ చదివినట్టుగా ఏటీఎస్ విచారణలో వెల్లడైంది. చదువు పూర్తి చేసిన తరువాత హైదరాబాద్ తిరిగొచ్చి టెలిగ్రాం యాప్ ద్వారా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పరుచుకున్నట్టుగా తెలిసింది. దాంతోపాటు పలువురు ఉగ్రవాదులతో కూడా అతను టచ్‌లో ఉన్నట్టుగా వెల్లడైంది.
ఆయుధాల సరఫరా
మొహియుద్దీన్ ఆయుధాలు సరఫరా చేయడానికే అహ్మదాబాద్‌కు ప్రయాణమైనట్టుగా ఏటీఎస్ విచారణలో తెలిసింది. మొదట గుజరాత్ లోని కాలోల్ వెళ్లి అక్కడ ఆయుధాలు తీసుకున్నట్టుగా వెల్లడైంది. అప్పటికే ఆజాద్ సులేమాన్ షేక్, మహ్మద్ సుహైల్ సలీంఖాన్ బనస్కాంత ప్రాంతంలో అతని రాక కోసం ఎదురు చూస్తున్నారు. పక్కాగా సమాచారాన్ని సేకరించిన ఏటీఎస్ పోలీసులు మొదట మొహియుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. అతను వెల్లడించిన వివరాలతో బనస్కాంతకు వెళ్లి మిగితా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా దాడులకు కుట్ర
ముగ్గురు టెర్రరిస్టులు దేశవ్యాప్తంగా దాడులు చేయడానికి కుట్రలు పన్నినట్టుగా ఏటీఎస్ దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటికే ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నోలో రెక్కీ కూడా జరిపినట్టుగా తెలిసింది. ముగ్గురు కలిసి కశ్మీర్ కూడా వెళ్లినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ ఏడాది ప్రారంభంలో అల్ ఖైదా ఉగ్ర సంస్థతో సంబంధం ఉన్న ఐదుగురిని గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఆన్ లైన్ వేదికగా టెర్రర్ మాడ్యూల్ నడుపుతున్న బెంగళూరుకు చెందిన ఓ మహిళ కూడా ఉన్నది. వీరితో తాజాగా అరెస్టయిన ముగ్గురికి సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా ఏటీఎస్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
కాశ్మీర్‌లో విస్తృత తనిఖీలు
లష్కర్ ఏ తోయిబా, జైష్ ఏ మహ్మద్ ఉగ్ర సంస్థలు కాశ్మీర్‌లో రక్తపాతం సృష్టించడానికి కుట్రలు చేస్తున్నాయన్న సమాచారంతో కౌంటర్ ఇంటెలిజెన్స్‌తోపాటు ఆ రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో కశ్మీర్ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో తనిఖీలు జరుపుతున్నారు. శనివారం 60కి పైగా ప్రాంతాల్లో తనిఖీలు జరపగా, ఆదివారం మరో 12 చోట్ల సోదాలు జరిపారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఇద్దరు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.
మన పోలీసులూ అలర్ట్
గుజరాత్ ఏటీఎస్ హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్‌ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అలర్ట్ అయ్యారు. మొహియుద్దీన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. హైదరాబాద్‌లో అతని నివాసం ఎక్కడ ఉన్నది? ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి? ఇలా అన్నింటిపై ఆరా తీస్తున్నారు.
Also Read: Singareni Collieries: భవిష్యత్తులో కీలక ఖనిజాల తవ్వకాలు ఉంటే భాగస్వాములవుతాం
