Singareni Collieries: ప్రపంచంలోనే వజ్రాలు, బంగారం, బాక్సైట్, మాంగనీస్, లిథియం తదితర ఉత్పత్తులకు ప్రముఖ దేశంగా పేర్కొనే రిపబ్లిక్ ఆఫ్ ఘనా, సింగరేణి సంస్థను తమ దేశంలో పెట్టుబడులకు ఆహ్వానం పలికింది. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో శనివారం ఘనా దేశ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌తో సమావేశమైంది. పలు వ్యాపార అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా ఘనా దేశ ప్రతినిధి బృందం మాట్లాడుతూ, తమ దేశంలో ఖనిజ రంగంలో పెట్టుబడులకు అవకాశం ఉన్నదని, ఈ విషయంలో అపార అనుభవం గల సింగరేణి సంస్థకు తాము స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. తమ దేశంలో ప్రధానంగా వజ్రాలు, బంగారం, బాక్సైట్, మాంగనీస్, లిథియం వంటి పలు ఖనిజాల తవ్వకం, ఉత్పత్తులు పెద్ద ఎత్తున జరుగుతుంటాయని, విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటామన్నారు.
సీఎండీ బలరాం నాయక్ స్పందిస్తూ..
ఉత్పత్తి పెంచడానికి ఇందుకు అవసరమైన పెట్టుబడులను ఆహ్వానించడం కోసం వచ్చామని, మైనింగ్‌లో ఎంతో అనుభవం ఉన్న సింగరేణి సంస్థ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. తమ దేశంలో బొగ్గు మైనింగ్ కూడా ఉన్నదని, అందులోనూ సింగరేణి సహకారాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై సీఎండీ బలరాం నాయక్ స్పందిస్తూ, సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా విదేశాల్లో ఇతర ఖనిజాలు, కీలక ఖనిజ రంగాల్లో కూడా ప్రవేశించాలని ఇప్పటికే నిర్ణయించి ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. ఘనా దేశంలో కూడా మైనింగ్ జరపడానికి గల అవకాశాలను పరిశీలిస్తామన్నారు. కీలక ఖనిజ తవ్వకాలకు అవకాశం ఉంటే అధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. మరో నెల రోజుల్లో ఘనా దేశానికి చెందిన సాంకేతిక బృందం కేంద్ర ప్రభుత్వంతో సమావేశం కానున్నదని ఆ దేశ ప్రతినిధి బృందం సీఎండీకి వివరించింది. ఆ సమయంలో మరో దఫా సమావేశం కావాల్సిందిగా, అలాగే తమ దేశానికి సింగరేణి బృందాన్ని కూడా పంపించాల్సిందిగా వారు కోరారు. దీనిపై బలరాం నాయక్ సానుకూలంగా స్పందించి సింగరేణి అధికారుల బృందాన్ని పంపిస్తామని పేర్కొన్నారు. ఈ చర్చలు సఫలమైతే తొలిసారి ఆఫ్రికా దేశంలో సింగరేణి అడుగుపెట్టడానికి అవకాశం దొరికినట్లవుతుంది.
Also Read: Election Commission: పోలింగ్ శాతం పెంచేందుకు.. ఈసీ కీలక నిర్ణయం!
ఉచిత ప్రమాద బీమా పథకం..
రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణిలో ఉద్యోగులు, ఒప్పంద కార్మికుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల సహకారంతో దేశంలోనే తొలిసారిగా ప్రారంభించిన ఉచిత ప్రమాద బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఈ పథకాన్ని తమ సంస్థల్లో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. ఈ పథకాన్ని మొట్టమొదటగా సింగరేణిలో ప్రారంభించడంలో సహకారం అందించిన బ్యాంకుల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం సింగరేణి భవన్‌లో పలు బ్యాంకుల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉచిత ప్రమాద బీమా పథకం ద్వారా సింగరేణి ఉద్యోగులకు గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు, పొరుగు సేవల సిబ్బందికి రూ.40 లక్షల వరకు బీమా అందించడం సంతోషకరమన్నారు. ఇప్పటి వరకు వివిధ ప్రమాదాల్లో మరణించిన 34 మందికి దాదాపు రూ.30 కోట్ల బీమా సొమ్మును బ్యాంకుల ద్వారా అందించినట్లు చెప్పారు. అయితే, ఒప్పంద కార్మికులకు కనీసం రూ.50 లక్షల ప్రమాద బీమా అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సింగరేణి ఉద్యోగులది సహజ మరణమైతే కనీసం రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చే విషయంలోనూ సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Also Read: B. Sudershan Reddy: భావప్రకటన స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం నిలవదు: జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి
