Chain Snatching Case: వ్యాపారంలో నష్టాలు.. కూతురి పెళ్లి కోసం చేసిన అప్పుల నుంచి బయట పడటానికి యూ ట్యూబ్‌లో చూసి చెయిన్ స్నాచింగ్(Chain snatching)కు పాల్పడ్డ వ్యక్తితోపాటు అతని భార్యను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి లక్షా 13వేల రూపాయల విలువ చేసే బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ కుమార్(ACP Ramesh Kumar), చిక్కడపల్లి సీఐ రాజు నాయక్(CI Raju nayak), డీఐ శంకర్(DI Shankar) తో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
యూ ట్యూబ్ లో చెయిన్ స్నాచింగులు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కొంగపాడుకు చెందిన గుడిపాటి అంజలి (48), గుడిపాటి బ్రహ్మయ్య (51) భార్యాభర్తలు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి బోరబండలో స్థిరపడ్డారు. ఇక్కడికి వచ్చిన తరువాత బ్రహ్మయ్య వ్యాపారం ప్రారంభించాడు. కొన్నాళ్లు బాగానే నడిచినా ఆ తరువాత బిజినెస్ మందగించటంతో నష్టాల పాలయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లోనే చిన్న కూతురు పెళ్లి చేయటానికి తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. బాకీ తీర్చాలని అప్పు ఇచ్చిన వారి నుంచి ఇటీవలిగా ఒత్తిడి అధికమైంది. దాంతో ఏం చేయాలో అర్థం కాక బ్రహ్మయ్య చెయిన్ స్నాచింగులు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో యూ ట్యూబ్ లో చెయిన్ స్నాచింగులు ఎలా చేస్తారన్న దానికి సంబంధించిన వీడియోలు చూశాడు. యూసుఫ్ గూడ, బోరబండ ప్రాంతాల్లో చెయిన్ స్నాచింగ్ చేయాలని పదిహేను రోజులు ప్రయత్నించాడు. అయితే, ఎక్కడా అతనికి అవకాశం దొరకలేదు. దాంతో గతనెల 31న ఎర్రగడ్డ నుంచి మెట్రో రైల్లో నారాయణగూడకు చేరుకున్నాడు. ఆ తరువాత సుల్తాన్ బజార్ లో రెండుసార్లు చెయిన్ స్నాచింగ్ కు ప్రయత్నించాడు. అయితే, జనం రద్ధీ అధికంగా ఉండటంతో వీలు పడలేదు. ఆ సమయంలో చిక్కడపల్లి దేవీ థియేటర్ ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్న సురేఖ (69) అతని కంటపడింది.
Also Read: Election Commission: పోలింగ్ శాతం పెంచేందుకు.. ఈసీ కీలక నిర్ణయం!
కూకట్ పల్లిలోని మణప్పురం బ్రాంచ్లో..
ఒంటరిగా ఉన్న సురేఖ(Sureka)ను చూసిన బ్రహ్మయ్య రాంకోఠి బస్టాప్ నుంచి ఆమె ఉంటున్న అపార్ట్ మెంట్ వరకు వెంటాడుతూ వచ్చాడు. ఇక, సురేఖ లిఫ్ట్ కోసం ఎదురు చూస్తుండగా ఒక్కసారిగా ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసిన సీఐ రాజు నాయక్, డీఐ శంకర్, ఎస్ఐ మహ్మద్ కరీంతో కలిసి విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల పుటేజీని విశ్లేషించటం ద్వారా నిందితున్ని గుర్తించారు. గాలింపు చేపట్టి బ్రహ్మయ్యను అరెస్ట్ చేశారు. విచారణలో చేసిన నేరాన్ని అంగీకరించిన బ్రహ్మయ్య కూకట్ పల్లిలోని మణప్పురం బ్రాంచ్ లో తన భార్య అంజలి పేర ఖాతా ఉందని తెలిపాడు. ఇద్దరం కలిసి అక్కడికి వెళ్లి బంగారు గొలుసును కుదువబెట్టి లక్షా 13వేల రూపాయలు తీసుకున్నట్టు చెప్పాడు. ఆ డబ్బుతో కొన్ని అప్పులు తీర్చినట్టు వెల్లడించాడు. ఈ క్రమంలో పోలీసులు అంజలిని కూడా అరెస్ట్ చేశారు. వారి నుంచి బంగారు గొలుసుతోపాటు పేపర్ కట్టింగ్ బ్లేడ్ ను స్వాధీనం చేసుకున్నారు.
