Red Fort Explosion: రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన కారు పేలుడు ఘటన తర్వాత ఢిల్లీలో భద్రతపై పెద్ద చర్చ మొదలైంది. ఉగ్రదాడుల ముప్పు ఉందన్న సమాచారం నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు నగరమంతా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో హోటళ్లు, మాల్స్, సినిమాహాళ్లు, మార్కెట్లు, పార్కింగ్ ప్లేస్‌లు ఇలా సుమారు 175 పబ్లిక్ ప్రదేశాల్లో భద్రత సరిగ్గా లేదని గుర్తించారు.
నవంబర్ 10న రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన పేలుడు తర్వాత నవంబర్ 28, డిసెంబర్ 8 తేదీల్లో ఈ చెక్స్ చేశారు. ముఖ్యంగా పార్కింగ్ ఏరియాలపై పోలీసులు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే పేలుడు చేసిన వ్యక్తి మూడు గంటల పాటు తన కారులోనే పార్కింగ్‌లో కూర్చుని ఉండి, తర్వాత బయటికి వెళ్లగానే కారు పేలిందని దర్యాప్తులో తేలింది.
తనిఖీల్లో చాలా చోట్ల గార్డులు యూనిఫాం లేకుండా ఉండటం, ఐడీ కార్డులు చూపించకపోవటం, వాహనాల కింద చెక్ చేసే మిర్రర్లు ఉపయోగించకపోవటం లాంటి లోపాలు కనిపించాయి. ఒక పెద్ద షాపింగ్ మాల్‌లో అయితే ఆయుధాలతో గార్డులు లేకపోవడం, బ్యాగ్ స్కానర్లు కూడా లేకపోవడం పోలీసులను ఆశ్చర్యపరిచింది.
ఇవి ముందస్తు జాగ్రత్త చర్యలే అని పోలీసులు చెబుతున్నారు. నగరం సురక్షితంగా ఉండాలంటే ప్రజలు, షాపులు, మాల్స్ యజమానులు పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పండుగల సమయం, టూరిస్టులు ఎక్కువగా వచ్చే రోజుల్లో ఇలాంటి చెక్స్ సాధారణంగానే ఉంటాయని చెప్పారు.
ఈ తనిఖీలను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ టీమ్‌లు చేశాయి. గుర్తించిన లోపాల వివరాలను అన్ని జిల్లాల డీసీపీలకు, మెట్రో పోలీస్, రైల్వే పోలీస్ అధికారులకు పంపించారు. సౌత్‌వెస్ట్ జిల్లాలో ఎక్కువ లోపాలు బయటపడగా, ఆ తర్వాత నార్త్‌వెస్ట్, సౌత్‌ఈస్ట్, మెట్రో యూనిట్ ప్రాంతాల్లోనూ సమస్యలు ఉన్నట్లు తేలింది.
భద్రతా లోపాలు ఉన్న చోట్ల వెంటనే వాటిని సరిచేయాలని, చేసిన పనిపై రిపోర్ట్ ఇవ్వాలని పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడటమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

