Goa Fire Accident: గోవాలో ఆదివారం తెల్లవారుజామున బిర్చ్ బై రోమియో లేన్ రెస్టారెంట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం చాలా మందిని షాక్‌కు గురిచేసింది. ఉత్తర గోవాలోని అర్పోరాలో ఉన్న ఈ రెస్టారెంట్ ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని 25 మంది ప్రాణాలు కోల్పోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. కిచెన్ దగ్గర సిలిండర్ పేలడంతో మంటలు వేగంగా వ్యాపించాయని అనుమానం. మృతుల్లో ఎక్కువ మంది అక్కడ పని చేసే వంటశాల సిబ్బందే, వారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం. ఇంకా నలుగురు పర్యాటకులు కూడా చనిపోయిన వారిలో ఉన్నారని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు.
గోవా ప్రజలకు చాలా బాధాకరమైన రోజు.. సీఎం సావంత్
ఘటనపై సీఎం సావంత్ స్పందిస్తూ.. “ ఈ రోజు గోవాకు చాలా బాధాకరమైన రోజు. అర్పోరాలో జరిగిన అగ్ని ప్రమాదం 23 మంది ప్రాణాలు తీసింది. వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి” అని Xలో పోస్ట్ చేశారు. ఆయన వెంటనే సంఘటన స్థలాన్ని సందర్శించి, పూర్తిగా విచారణకు ఆదేశించారు. “ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించారా లేదా? అసలు మంటలు ఎలా వచ్చాయి?” అన్న విషయాలన్నీ విచారణలో బయటపడతాయని అన్నారు. కొంచం నిర్లక్ష్యం ఉన్నా కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. అధికారులు చెబుతున్నట్టు.. ముగ్గురు కాలిన గాయాలతో, మిగతా వారంతా పొగలో ఊపిరాడక చనిపోయారు. అదే సమయంలో, నైట్‌క్లబ్‌లో సేఫ్టీ నిబంధనలు పాటించలేదన్నది ముందస్తు దర్యాప్తులో తేలింది.
గోవా సేఫ్ ప్లేస్ పేరు దెబ్బతింది.. BJP MLA మైఖేల్ లుబో
ఈ ప్రమాదంపై BJP MLA మైఖేల్ లుబో ఆందోళన వ్యక్తం చేస్తూ.. “ ఇంత పెద్ద ప్రమాదం జరగడం షాకింగ్. 23 మంది చనిపోయారు, ఎక్కువ మంది స్థానిక వర్కర్లే. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా గోవాలో ఉన్న అన్ని క్లబ్‌లకు సేఫ్టీ ఆడిట్ తప్పనిసరి చేయాలి” అని అన్నారు. “ గోవా ఎప్పుడూ పర్యాటకులకు సేఫ్ డెస్టినేషన్. కానీ ఈ ఘటన ఆ పేరును దెబ్బతీసింది. టూరిస్టులైనా, అక్కడ పనిచేసేవారైనా.. అందరి సేఫ్టీ చాలా ముఖ్యం” అని ఆయన చెప్పారు.
PM మోదీ సానుభూతి.. రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటింపు
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సీఎం సావంత్‌తో మాట్లాడి మొత్తం పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ డబ్బులు PMNRF నుండి ఇవ్వబడతాయి. అర్పోరా అగ్ని ప్రమాదంతో గోవా మొత్తం దుఃఖంలో మునిగిపోయింది. ఈ ఘటనతో క్లబ్బులు, రెస్టారెంట్లలో సేఫ్టీ నిబంధనలపై పెద్ద చర్చ మొదలైంది.

