Domestic Airfare: దేశీయ విమానయాన రంగ దిగ్గజం ‘ఇండిగో’ (Indigo Cancilations) సంస్థ సేవల్లో కొనసాగుతున్న తీవ్రమైన అంతరాయం, సంక్షోభాన్ని తలపిస్తున్న పరిస్థితుల పర్యావసానంగా, దేశీయంగా రద్దీగా ఉండే పలు వాయు మార్గాల్లో విమాన టికెట్ రేట్లు ఆకాశాన్ని తాకాయి. ఇవాళ ఒక్కరోజే ఏకంగా 700లకుపైగా విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేయడంతో, ఇతర విమానయాన సంస్థల సర్వీసులకు భారీ గిరాకీ ఏర్పడింది. విపరీతమైన డిమాండ్ కారణంగా విమాన టికెట్ రేట్లు (Domestic Airfare) చుక్కలను తాకాయి.
హైదరాబాద్ టు భోపాల్ రూ.1.3 లక్షలు
హైదరాబాద్ నుంచి వివిధ నగరాలకు వెళ్లే విమాన టికెట్ రేట్లు గురువారం నాడు అమాంతం పెరిగాయి. హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు ఒక్కో టికెట్ ధర ఏకంగా లక్ష రూపాయలకు పైగా పలుకింది. కేవలం ఒక్క టికెట్ రూ.1.3 లక్షలుగా టికెట్ సెల్లింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో కనిపించింది. డిసెంబర్ 3న (బుధవారం) ఒక విమానానికి సంబంధించి చివరి నిమిషంలో ఈ భారీ రేటు నమోదయింది. ఆ ప్లేన్‌లో గురువారం ఉదయం ఎకానమీ వెయిటింగ్ లిస్ట్‌లో ఒక్క టికెట్ రేటు రూ.1.03 లక్షలుగా, బిజినెస్ క్లాస్ టికెట్ రూ.1.3 లక్షలుగా కనిపించింది. కేవలం ఒక్క సీటుకు మాత్రమే ఈ భారీ రేటు చూపించింది. హైదరాబాద్ – భోపాల్ మధ్య ఇతర డైరెక్ట్ సర్వీసులు ఏమీ లేకపోవడంతో రేటు ఇంత భారీగా పెరినట్టు అంచనాగా ఉంది. వన్ స్టాప్ ట్రావెల్ ఆప్షన్‌తో టికెట్ ధర అత్యుల్పంగా రూ.12,599గా నమోదయింది. గురువారం రాత్రి కూడా ఢిల్లీ-ముంబై రూట్‌లో కూడా టికెట్ రేట్లు ఆకాశాన్ని తాకాయి.
హైదరాబాద్ – విజయవాడ రూ.28 వేలు
ఇక, హైదరాబాద్ – విజయవాడ టికెట్ ధర రూ.28 వేలుగా కనిపిస్తోంది. హైదరాబాద్ – ఢిల్లీ రూట్‌లో ఒక్కో విమాన టికెట్ ధర ఏకంగా రూ.89 వేలుగా చూపిస్తోంది. సాధారణ రోజుల్లో రూ.4 – 10 వేల మధ్య ఉండే ఢిల్లీ-ముంబై విమాన టికెట్ ధర రూ.40 వేల వరకు పెరిగింది. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన ఇండిగో విమానాలు పెద్ద సంఖ్యలో రద్దు కావడంతో, తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్న ఇతర విమాన సంస్థల సర్వీసులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్యాసింజర్లు ఒక్కసారిగా ఎగబడడంతో విమాన టికెట్ రేట్లు భారీగా పెరిగాయి.
కొండెక్కిన హైదరాబాద్ – విశాఖ విమాన ఛార్జీలు
విశాఖపట్నం-హైదరాబాద్ మార్గంలో ఎయిరిండియాకు చెందిన ఒకే ఒక్క విమానం అందుబాటులో ఉండడంతో విమాన టికెట్ ఛార్జీలు భారీగా పెరిగాయి. ముంబై, బెంగళూరు మీదుగా రెండు స్టాప్‌లతో దాదాపు 9 గంటల ప్రయాణ సమయాన్ని తీసుకునే, ఈ ఫ్లైట్‌లో ఎకానమీ టికెట్ ధర ఏకంగా రూ.69,787గా చూపించింది. ఇక, విశాఖపట్నం నుంచి భువనేశ్వర్‌కు 9 గంటల ఒక స్టాప్ ప్రయాణ సమయంలో టికెట్ ధర రూ.27,417గా చూపించింది. 13 గంటల సింగిల్ స్టాప్ జర్నీ ట్రావెల్ టికెట్ ఏకంగా రూ.49,413గా ఉండడం గమనార్హం.
ఇతర రూట్లలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఇండిగో విమానాల రద్దు ప్రభావంతో హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్నం, భోపాల్ వంటి ప్రధాన నగరాల మధ్య ఇండిగో సర్వీసులు పెద్ద సంఖ్యలో రద్దు కావడంతో ఈ రూట్లలో విమాన టికెట్ల రేట్లు భారీగా పెరిగాయి. విమానయాన సంస్థల వెబ్‌సైట్‌లు, ట్రావెల్ పోర్టల్స్ డేటా ప్రకారం, అందుబాటులో ఉన్న ఇతర విమానయాన సంస్థల టికెట్ రేట్లు భారీగా పెరిగాయి.

