Gali Janardhan Reddy: కర్ణాటకలోని బళ్లారిలో కాల్పులు చోటుచేసుకున్నాయి. అపర కుబేరుడు గంగావతి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. మెుత్తం 8 రౌండ్ల కాల్పులు జరగ్గా.. ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. బళ్లారి ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి ఈ కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. అనంతరం గాలి జనార్ధన్ రెడ్డి వర్గం కూడా ఎదురు దాడికి దిగింది. ఈ ఘర్షణలో ఒకరు మృతి చెందగా దాదాపు 25 మంది గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన బళ్లారి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘర్షణకు కారణాలు..
బళ్లారి నగరంలోని హవాంభావి ప్రాంతంలో గల గాలి జనార్ధన్ రెడ్డి నివాసం సమీపంలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటు సందర్భంగా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి సమీపంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు యత్నించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి అనుచరులు.. ఫ్లెక్సీ ఏర్పాటును అడ్డుకున్నారు. మరోచోట పెట్టుకోవాలని సూచించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
A political banner dispute outside MLA Janardhan Reddy’s residence in #Ballari turned violent on Jan 2, leaving a Congress worker dead after a gunshot injury. Clashes broke out between rival supporters, forcing police to use lathicharge and fire in the air. An FIR has been… pic.twitter.com/CPKGlylMrZ
— Madhuri Adnal (@madhuriadnal) January 2, 2026
పరస్పరం కాల్పులు..
ఇరు వర్గాల వాగ్వాదం.. చూస్తుండగానే తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దీంతో నివాసంలో ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి బయటకు వచ్చారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గన్ మెన్ నుంచి తుపాకీని లాక్కొని ఒక్కసారిగా గాలి జనార్ధన్ రెడ్డిపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. మెుత్తం 8 రౌండు కాల్పులు జరపగా.. గాలిజనార్ధన్ రెడ్డి అక్కడి తప్పించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బుల్లెట్ తగిలి 32 ఏళ్ల బీజేపీ కార్యకర్త చనిపోయాడు. దీంతో ఇరువర్గాల మధ్య పరస్పర దాడులు చోటుచేసుకున్నాయి. బీర్ సీసాలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
పోలీసుల లాఠీ చార్జి..
స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఘటనాస్థలికి రావడంతో ఉద్రిక్తత మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దాడి సమాచారం అందుకున్న బళ్లారి పోలీసులు.. హుటాహుటీనా గాలి జనార్ధన్ నివాసం వద్దకు వచ్చారు. లాఠీచార్జీ చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. ఘటనాస్థలికి వచ్చిన బళ్లారి ఎస్పీ పవన్ నెజ్జూరు.. స్థానికంగా 144 సెక్షన్ విధించారు. గాలి జనార్ధన్ రెడ్డితో పాటు భరత్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు.
Also Read: Harish Rao: ఏపీ జల దోపిడీకి కాంగ్రెస్ తలుపులు తెరిచింది: హరీష్ రావు ఫైర్..!
గాలి జనార్ధన్ రెడ్డి రియాక్షన్..
తనపై జరిగిన దాడికి గురించి గాలి జనార్ధన్ రెడ్డి మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి మద్దతుదారులు తన ఇంటి ముందు కుర్చీలు వేసి రాకపోకలకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. తాను ఇంటికి వచ్చిన సమయంలో భరత్ రెడ్డి మద్దతుదారు సతీష్ రెడ్డికి చెందిన ప్రైవేటు గన్ మెన్లు ఒక్కసారిగా కాల్పులు జరిపారని ఆయన ఆరోపించారు. తనపై హత్యాయత్నం చేశారని స్పష్టం చేశారు. కాల్పుల సమయంలో కిందపడ్డ ఖాళీ తూటాను ఆయన చూపించారు. అయితే గాలి జనార్ధన్ రెడ్డి ఆరోపణలను భరత్ రెడ్డి ఖండించారు. ఆయన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు.

