Nominated Posts: రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ఊపందుకున్నది. కొత్త ఏడాది 2026 ప్రారంభం సందర్భంగా తనను కలిసిన పార్టీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న వారికి ‘ఓపిక పట్టండి.. తగిన గుర్తింపు లభిస్తుంది’ అని భరోసా, హింట్ ఇచ్చేశారు. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి, పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వారికే ఈసారి ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈసారి యువ నాయకత్వానికి పెద్దపీట వేయనున్నారు. 50 ఏళ్ల లోపు వయసున్న నాయకులకు 60 శాతం నామినేటెడ్ పదవులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీనియర్ల అనుభవం, యువత ఉత్సాహం కలగలిసి పనిచేసేలా జాబితా సిద్ధమైంది. విధేయతతో పాటు పనితీరును కూడా ప్రాతిపదికన తీసుకున్నట్లు సీఎం తెలిపారు.
బీసీలకు అగ్రతాంబూలం
నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం స్పష్టతనిస్తూ, సామాజిక సమీకరణాల్లో భాగంగా బీసీ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే తొలి దఫాలో కొన్ని కీలక కార్పొరేషన్లను భర్తీ చేసిన ప్రభుత్వం, రెండో జాబితాలో మరిన్ని జిల్లా, రాష్ట్ర స్థాయి పదవులను ప్రకటించనుంది. ఇందులో భాగంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలతో పాటు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవులను భర్తీ చేయనున్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, క్షేత్రస్థాయిలో పట్టున్న నేతలకు ప్రాధాన్యత కల్పించనున్నారు.
Also Read: Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్.. ఆ సినిమాలు డౌటే!
ఇప్పటికే నిఘా వర్గాలు
అటు ఢిల్లీలో అధిష్టానంతో చర్చలు జరుపుతూనే, ఇటు రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలోపేతంపై సీఎం దృష్టి సారించారు. సంక్రాంతి తర్వాతే ఈ నామినేటెడ్ పదవుల రెండో జాబితా అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. పార్టీ కోసం గత పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి పోరాడిన నాయకుల వివరాలను ఇప్పటికే నిఘా వర్గాలు, పార్టీ ఇన్‌ఛార్జీల ద్వారా సేకరించిన సీఎం, ‘పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్తను గుండెలకు హత్తుకుంటాం. పదవి అనేది ప్రజలకు సేవ చేసే బాధ్యత’ అని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ పరిణామాలతో కొత్త ఏడాదిలో కాంగ్రెస్(Congress) శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
Also Read: Bhatti Vikramarka: కొత్త ఏడాది సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక సందేశం

