Shivraj Patil dies: కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ (90) కన్నుమూశారు. మహారాష్ట్రలోని లాతూరులోని దేవ్ ఘర్ నివాసంలో తుదిశ్వాస విడిచారు. శివరాజ్ పాటిల్ కు శైలేష్ పాటిల్ అనే కుమారుడు, కోడలు అర్చన, ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. మరోవైపు శివరాజ్ మృతి పాట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లీఖార్జున్ ఖర్గే సంతాపం తెలియజేశారు.
శివరాజ్ మరణం బాధాకరం: ప్రధాని
శివరాజ్ పాటిల్ మరణంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘శివరాజ్ మరణం బాధాకరం. ఆయన అనుభవజ్ఞుడైన నాయకుడు. ప్రజా జీవితంలో సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా సేవలందించారు. సమాజ సంక్షేమం కోసం ఆరాటపడేవారు. గత కొన్నేళ్లలో ఆయనతో చాలాసార్లు మాట్లాడాను. ఇటీవల నా నివాసానికి వచ్చినప్పుడు కూడా సంభాషించాను. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు మెుత్తం వారి కుటుంబం చుట్టే తిరుగుతున్నాయి’ అని ప్రధాని పోస్ట్ చేశారు. చివరలో ఓం శాంతి అంటూ శివరాజ్ పాటిల్ తో ఉన్న ఫొటోను ప్రధాని పంచుకున్నారు.
श्री शिवराज पाटील जी यांच्या निधनाने दुःख झाले आहे. ते एक अनुभवी नेते होते. सार्वजनिक जीवनातील आपल्या प्रदीर्घ कारकिर्दीत त्यांनी आमदार, खासदार, केंद्रीय मंत्री, महाराष्ट्र विधानसभेचे तसेच लोकसभेचे अध्यक्ष म्हणून काम केले. समाजाच्या कल्याणासाठी योगदान देण्याच्या ध्येयाने ते… pic.twitter.com/aqQVerLnhn
— Narendra Modi (@narendramodi) December 12, 2025
రాహుల్, ప్రియాంక సంతాపం
శివరాజ్ పాటిల్ మరణం పట్ల కాంగ్రెస్ అగ్రనేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం అత్యంత బాధాకరమని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా సంతాపం తెలియజేశారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిదని పేర్కొన్నారు. దేశ సేవకు ఆయన చేసిన కృషి అంకిత భావం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. శివరాజ్ పాటిల్ మరణం హృదయ విదారకమని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. దశాబ్దాల కాలంగా ప్రజాసేవలో ఆయన నిమగ్నమయ్యారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లీకార్జున్ ఖర్గే సైతం శివరాజ్ పాటిల్ మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న సన్నిహిత సంబంధం, మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ తనతో ఉంటాయని అన్నారు. ఆయన కుటుంబం, సహచరులు, స్నేహితులకు సానుభూతి తెలిపారు.
Also Read: Panchayat Elections: పోలింగ్‌లో ఆ జిల్లానే టాప్.. ఎంత శాతం ఓటింగ్ నమోదు అయ్యిందంటే?
రాజకీయ నేపథ్యం
శివరాజ్ పాటిల్ విషయానికి వస్తే ఆయన 1935 అక్టోబర్ 12న మహారాష్ట్రలోని లాతూర్ లో జన్మించారు. ముంబయి విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రం పట్టా అందుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తరపున క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టారు. మున్నిపల్ కౌన్సిల్ చీఫ్ గా రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. 1980లో లాతూరు పార్లమెంటు స్థానం నుంచి తొలిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1984,1989, 1991, 1996, 1998, 1999లలో వరుసగా ఏడుసార్లు లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంలో వాణిజ్యం, హోమ్, రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1991-96 మధ్య లోక్ సభ స్పీకర్ గానూ వ్యవహరించారు. అనంతరం పంజాబ్ గవర్నర్ గానూ కొంతకాలం పనిచేశారు.

