Panchayat Elections: పంచాయతీ ఎన్నికలలో భాగంగా తొలి విడుత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ దఫాలో 3,834 సర్పంచ్, 27,628 వార్డ్ మెంబర్ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాధారణ ఎన్నికలతో పోల్చితే సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్ల నుంచి భారీ స్పందన వచ్చింది. ఒక్కో జిల్లాల్లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సమయం ముగిసినా లైన్లలో ఉండడంతో వారికి ఓటేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతించారు.
యాదాద్రి జిల్లా టాప్
పోలింగ్ అత్యధికంగా యాదాద్రి జిల్లాలో నమోదైంది. ఏకంగా 92.88 శాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 84.28 శాతం పోలింగ్ శాతం నమోదు కాగా, అన్ని జిల్లాల్లో సగటును 75 శాతానికి తగ్గకుండా పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79 శాతం జరిగింది. ప్రతీ రెండు గంటలకు చొప్పున పోలింగ్ శాతాన్ని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్‌లో 53,57,277 మంది ఓటర్లు ఉండగా, 45,15,141 మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. గురువారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. మొత్తం ఓటింగ్‌లో మహిళలే ఎక్కువ మంది 84.40 మంది పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడుతలో నాలుగు జిల్లాల్లో 90 శాతం పోలింగ్ దాటగా, 20 జిల్లాలో 80 శాతం, ఏడు జిల్లాల్లో 70 శాతానికి పైగా ఓట్లు పడ్డాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేయడానికి పట్టణాల్లో ఉండే ప్రజలు ఆసక్తి చూపారు. పెద్ద ఎత్తున సొంతూళ్లకు తరలివెళ్లారు.
Also Read: Panchayat Elections: మెజార్టీ స్థానాల్లో హస్తం హవా.. పల్లెల్లో జోరుగా సాగిన పోలింగ్!
మెజార్టీ స్థానాల్లో హస్తం హవా
తొలి విడుత జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో హస్తం పార్టీ మద్దుతు ఉన్న అభ్యర్ధులు సత్తా చాటారు. 3,834 గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్ స్థానాల్లో, రిటర్నింగ్ ఆఫీసర్ల వివరాల ప్రకారం(అర్ధరాత్రి ఒంటిగంట వరకు) 2,292 మంది కాంగ్రెస్ మద్దతుదారులు గెలువగా, బీఆర్ఎస్ మద్దతుతో 1,155 మంది గెలిచారు. ఇక, బీజేపీ మద్దతుతో 186 మంది, ఇతర పార్టీల మద్దతు, ఇండిపెండెంట్లు కలిపి మరో 524 మంది గెలుపొందారు. మెజార్టీ స్థానాల్లో హస్తం అభ్యర్థులే విజయం సాధించారు. వాస్తవానికి తొలి విడుతలో 4,236 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా, 396 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అంతేగాక 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం జరుగగా, తొలి విడుత సర్పంచ్ ఎన్నికల్లో 12,690 మంది అభ్యర్థులు, 65,455 మంది వార్డు అభ్యర్థులు బరిలో నిలిచారు.
కొన్ని కీలక ఘటనలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీలో గురువారం నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజుల ముందు గుండెపోటుతో మరణించిన సర్పంచ్ అభ్యర్థి చెర్ల మురళి (50) బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సొంత గ్రామం వీర్లపల్లిలో బీఆర్ఎస్ మద్దతు ఉన్న అభ్యర్ధి 130 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెంలో సీపీఎంకు లక్కీ డ్రాలో ఉప సర్పంచ్ వచ్చింది. జగిత్యాల జిల్లా తిమ్మయ్య పల్లెలో తల్లిపై కూతురు గెలిచింది. తల్లి గంగవ్వకు బీఆర్ఎస్ మద్దతివ్వగా, కూతురు సుమలతకు కాంగ్రెస్ అండగా నిలిచింది. యాదాద్రిలో రాజంపేట్ మండలం లక్ష్మణ్లపట్ల గ్రామ సర్పంచ్‌గా లక్కీ డ్రాలో గెలుపొందారు. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు ఒకే విధంగా 148 ఓట్లు పోలవ్వడంతో లక్కీ డ్రా తీశారు. మరోవైపు, ఆదిలాబాద్ ఊట్నూర్ లింగోజిగూడ తండాలో జాదవ్ మాయ దంపతులు సర్పంచ్ ఉప సర్పంచ్‌లుగా గెలిచారు. జడ్చర్లలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంతూరు రంగారెడ్డి గూడలో బీజేపీ మద్దతు ఉన్న అభ్యర్థి రేవతి ఏకంగా 490 మెజార్టీతో గెలిచారు.

