Panchayat Elections: నగదు, మద్యం, నజరానాల హోరులో పల్లె ఓటరు నిద్ర కోల్పోయాడు. సర్పంచ్ ఎన్నికల యుద్ధంలో కదనరంగంగా మారిన పల్లెలు, కేవలం ఒకే ఒక్క రాత్రిలోనే అంచనాలను, అభ్యర్థుల తలరాతలను తలకిందులుగా మార్చాయి. పోలింగ్ ఒకరోజు ముందు వరకు వెనుకబడి ఉన్నవారు ముందుకు పరుగు తీయగా, గెలుపు తథ్యం అనుకున్న పలువురు చతికిలపడ్డారు. ఒకరికి మించి మరొకరు ఓటరు ప్రసన్నం కోసం చేసిన ప్రయత్నం అంతా ఇంతా అని చెప్పడం అసాధ్యంగా మారింది. రాత్రంతా అభ్యర్థులు, వారి ముఖ్య కార్యకర్తలు నిద్ర మానుకొని ఊరు తిరగగా ఓటర్లను కూడా నిద్రపోకుండా చేశారు. ప్రచారానికి తక్కువ సమయం చిక్కడంతో చివర రోజు రాత్రి నగదు, మద్యం, నజరానాలు పెద్ద మొత్తంలో పోటీపడి అందించారు. అనేక గ్రామాలలో సర్పంచ్‌లతో పాటు వార్డు సభ్యులు కూడా పోటీపడి ఓటర్ ప్రసన్నం కోసం సర్వశక్తులు వినియోగించారు.
ఏరులై పారిన మద్యం
పోలింగ్‌కు ముందు రోజు రాత్రి అభ్యర్థులకు, ముఖ్య కార్యకర్తలకు నిద్రలేకుండా పోయింది. ప్రచారం తక్కువ సమయం చిక్కడంతో అభ్యర్థులు ఎక్కువ మొత్తం బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు భారీగా ఖర్చుపెట్టారు. పార్టీల వారీగా అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి మందు, నగదు, చీరలు, చికెన్, మటన్ ప్యాకెట్లు పంచడంతో గ్రామస్తులకు కూడా నిద్ర లేకుండా చేశారు. జనరల్ స్థానాల్లోనే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ స్థానంలో కూడా భారీగా అభ్యర్థులు ఖర్చు పెట్టారు. ఒకరు ఒక ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తే, మరొకరు రూ.1500లు, ఇంకొకరు రూ.2వేలు ఇచ్చి ఓటర్లను సంకట స్థితికి చేర్చారు. పురుషులకు మందు బాటిళ్లు ఒకరికి మించి మరొకరు పోటీపడి ఇచ్చారు. కొందరు మహిళలకు చీరలు పంపిణీ చేస్తే మరికొందరు మరికొన్ని వస్తువులను నజరానాగా ఇచ్చారు.
Also Read: Panchayat Elections: సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు.. ఎంతమంది ఓటు వేశారో తెలుసా?
నిద్ర పోనిస్తే పాపం
ఎలక్షన్లు ఏమోగానీ రాత్రి నిద్ర పోనిస్తే పాపం’ అంటూ ఒక పెద్దాయన తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు. ఒకరు పోగానే మరొకరు వచ్చి తలుపు కొట్టడం, మేము లేచి తలుపు తీయడం ఇట్లే తెల్లారిపోయిందని కళ్ళు నలుస్తూ వివరించారు. వాళ్ళు ఇచ్చేవి వద్దన్నా మొహమాటం పెట్టినట్లు చెప్పుకొచ్చారు. అభ్యర్థులు ఇచ్చేవి తీసుకుంటే ఓ బాధ, తీసుకోకపోతే మరో సమస్య ఏర్పడిందని, ఇచ్చేది వద్దంటే ‘నాకు ఓటు వేయకూడదని అనుకుంటున్నావా?’ అని నిష్టూరం చేశారని పలువురు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. చాలా గ్రామాల్లో పోలింగ్ ముందు రోజు రాత్రి అభ్యర్థులు చక్రం తిప్పడంతో అప్పటిదాకా ఉన్న పరిస్థితులు మారిపోయాయి. నిన్నటి వరకు ఫలానా అభ్యర్థి ముందున్నాడనుకుంటే తెల్లారేసరికి పరిస్థితులు మారిపోయినట్లు గ్రామస్తులు చర్చించుకోవడం కన్పించింది. ఏదేమైనా సర్పంచ్ ఎన్నికలు ఈసారి కొత్త పోకడలను తొక్కడం గమనార్హం. కాగా చిన్న చిన్న సంఘటన తప్ప మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరగడం విశేషం.

